Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతల తీరు ఓ అడుగు ముందుకేస్తే.. నాలుగడుగులు వెనక్కి వేసినట్టుగా ఉంటుంది ఈ మధ్య. దీంతో పార్టీ వ్యవహారాలపై అగ్ర నేతలు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే నేతలతో బీఎల్ సంతోష్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ తర్వాత కమలనాథులు డైలమాలో పడ్డారా? కొత్త నేతలంతా రివర్స్ అయ్యారా..? ఎంత చేసిన ఇంతేనా అంటూ అసహనంలోకి వెళ్ళారా..? అసలు సంతోష్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ పాత నేతల్లో ఉత్సాహం.. కొత్త నేతల్లో నిరుత్సాహంగా ఎందుకు మారింది?
పార్టీపై, పార్టీ నాయకత్వంపై బురద జల్లడం, విమర్శలు ఎక్కుపెట్టడం, నోటికొచ్చిందల్లా అనేయడం, ఎప్పుడూ అసంతృప్తి, అసహనం వెళ్లగక్కడం ఆపండి.. ఆడిన డ్రామాలు చాలు, పార్టీలో ఉంటే ఉండండి.. వెళ్తే వెళ్లండి, ఇట్లాంటి మీ త్యాగం, మీ శ్రమ అక్కర్లేదు అంటూ తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం కుండబద్ధలు కొట్టినట్టు చెప్పిందట. అయితే అధిష్టాన పెద్దల వార్నింగులు.. ఫలితాలను తెచ్చి పెడతాయా..? డ్యామేజ్ చేసి పెడతాయా..? అన్నది ఇప్పుడు రాష్ట్ర బీజేపీతో పాటు, పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తరాలు మారిన తల రాతలు మారలేదనట్టూ ఇప్పటికే నేతలంతా తలోదిక్కు అనేలా వ్యవహరిస్తూ విభేదాలతో రచ్చ చేసుకుంటున్నారు. కేవలం కొత్త నేతలే పార్టీలో అలజడులు సృష్టిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ కొత్త నేతలు అలా వ్యవహరించడానికి ప్రధాన కారణం పాత నేతలేనన్నది మరో టాక్. మరి రాష్ట్ర నాయకత్వ లోపమా..? జాతీయ నాయకత్వ లోపమా..? లేక నేతల వ్యక్తిగత ఇగోనే కారణమా అనేది ప్రస్తుతం పార్టీలో జోరుగా నడుస్తున్న చర్చ.
కొందరు నాయకుల తీరు కారణంగా కమలం పార్టీ పరిస్థితి రోజురోజుకూ ఆగాథంలోకి కూరుకుపోతుందనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కేరాఫ్‌గా నిలిచిన పార్టీ.. ఇప్పుడు పలువురు నేతల తీరుతో ఆ గుర్తింపును దాదాపుగా చెరుపుకునే స్థితికి తెచ్చుకుందనే చర్చ సైతం ఆ పార్టీలోనే వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలే ఒకరికొకరు వ్యక్తిగత దూషణలు, విమర్శలు, కుమ్ములాటలు చేసుకుంటూ పార్టీ పరువును తీస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతూ, రచ్చకెక్కుతున్న తీరు ఇటు పార్టీలో, అటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా చేసిన అనంతరం కూడా పార్టిపైన, పార్టీ నేతలపైనే ఘాటుగా స్పందిస్తున్నారు. వరుస కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి లాంటి కొందరు పాత సామాన్ల లాంటి సీనియర్లు పక్కకు తప్పుకుంటే తప్పా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని కరాఖండిగా చెప్పేస్తున్నారు. రాజాసింగే కాదు పార్టీలో మెజారిటీ నేతల తీరు కూడా అదే తీరు లెక్క కనిపిస్తుందట.
భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అనే నానుడి ఉంది. ఎందుకంటే దాని ముఖచిత్రం వెనక రాష్ట్రీయా స్వయం సేవక్ సంఘ్ ఉంది కాబట్టి. హిందుత్వ సైద్దాంతికంగా, సిద్ధాంత పరంగా కమలం పార్టీ నిలబడగలిగిందనే టాక్ ప్రజల్లో వుంది. ఈ మధ్యే ఆర్ఎస్ఎస్ సెంచరీ సెలబ్రేషన్స్ దేశ వ్యాప్తంగా గొప్పగా చేసుకొంది. కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో బీజేపీ వ్యవహారం నడుస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒక లెక్క, తెలంగాణలో మరోలెక్క అన్నట్టుగా బీజేపీ తయారైంది. నాడు రచ్చకెక్కలంటే నేతల్లో గుబులుండెది. అంత క్రమశిక్షణ నేతల్లో కనిపించేదట.. కానీ ఇప్పుడoదుకు బిన్నంగా తెలంగాణ బీజేపీలో కొంతమంది నేతల వ్యవహారం ఉంది.
ఇలాంటి సమయంలో ఆ పార్టీ జాతీయ సంస్థగత ఇంచార్జ్ బీఎల్ సంతోష్ రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర బీజేపీ నేతలను ఎడా పెడా ఏకి పడేశారనే టాక్ నడుస్తోంది. పార్టీ హైవేపై ఉంది. బైపాస్ చేయకండి, షార్ట్ కట్ రూట్‌లు మంచివి కావు, దేశ ప్రజలు నమ్మి మూడు సార్లు అధికారం ఇచ్చారు.. తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు. వచ్చే టర్మ్ కూడా కాషాయ పార్టీదే విజయం, తెలంగాణ ప్రజలు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.. తమాషాలు చేయకండి, ప్రజల్లోకి వెళ్లండి, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టండి అంటూ సంతోష్ క్లాస్ తీసుకున్నారట. అయితే ఈ కామెంట్లు కొత్తనేతలకు అస్సలు నచ్చలేదనే టాక్ వినిపిస్తంఓది. అసలు పార్టీని బైపాస్ చేస్తున్నదెవరు..? హైవే పై వెళ్తున్నదెవరు..? షార్ట్ కట్ రూట్ లో తీసుకెళ్లాలని చూస్తున్నది ఎవరు..? పార్టీని డ్యామేజీ చేస్తున్నదెవరు..? విజయాలు పాత నేతలవి.. అపజయాలు వస్తే కొత్త నేతలకా..? పొగడ్తలు వాళ్ళకు, విమర్శలు మాకా అంటూ పెదవి విరుస్తున్నారట కొత్త నేతలు.
బీఎల్ సంతోష్ వచ్చిన తర్వాత రాష్ట్ర నేతల్లో జోష్ కంటే నిరాశే ఎక్కువ మిగిలిందట. బీఎల్ టూర్ తర్వాత నేతలంతా డైలమాలో పడ్డారని టాక్ నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇట్లాంటి కిరికిరిలేంట్రా బాబు అంటూ తల పట్టుకుంటుందట రాష్ట్ర నాయకత్వం. ఇంతకు ఢిల్లీ పెద్దలు వచ్చి తెలంగాణ బీజేపీ నేతలను సెట్ చేశారా..? సమన్వయాన్ని నూరిపోశారా..? హిందుత్వ ఎజెండాను ఎక్కించరా..? లేక వారి మధ్య మరో కుంపటిని తగిలించి వెళ్ళారా..? అనేది ఇప్పుడు వింటర్లో కూడా హీట్ ఎక్కించే విషయం.
Story By Vamshi, Big Tv