Telangana BJP: బీజేపీలో గెలిచింది 8 మంది ఎమ్మెల్యేలు.. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా… మిగిలింది ఏడుగురు ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎమ్మెల్సీలు… వారి వైఖరి వ్యూహాత్మకమో? లేక పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా అయోమయమో.? తెలీదు కానీ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాల్సిన ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు మౌనం పాటిస్తున్నారు.. అధికార, ప్రతిపక్షాలపై హార్డ్ అప్రోచ్ తీసుకోకుండా, సాఫ్ట్ అప్రోచ్‌లో నడుస్తున్నారు… ఆది దేనికి సంకేతం..?..వారు ఎవరితో అయినా కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నారా?
బీజేపీలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రోగా పనిచేస్తున్నారా..? ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పార్టీ ప్రతినిధులు అధికార పక్షానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారా.? ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాల్సిన బీజేపీ ప్రజా ప్రతినిధులు ఎందుకు మౌనంగా ఉన్నారు..? అసెంబ్లీ అయినా..?కౌన్సిల్ అయినా..? నియోజకవర్గం అయినా..? ఇంద్రపార్క్ ధర్నా చౌక్ అయినా..? కాంగ్రెస్ ప్రభుత్వంపై కమలం నేతల్లో దూకుడు కనిపించకపోవడంపై ఆంతర్యం ఏంటి..? అసలు ఇది వ్యూహమా..? లేక బలహీనతా..? లేక ఇన్సైడ్‌గా ఏదైనా ఒప్పందామా..? అన్న అనుమానాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
కాషాయ పార్టీ ప్రజాప్రతినిధులు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారన్న చర్చ ఆ పార్టీతో పాటు, పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో బీజేపీ నేతల పాత్ర కనిపించకపోవడంపై క్యాడర్లో అసహనం వ్యక్తం అవుతుందట.. దీంతో ఉత్తర తెలంగాణ తమ అడ్డా అని చెప్పుకుంటున్న నేతల సమీకరణలు తలకిందులవుతున్నాయన్న టాక్ నడుస్తోంది. ఆ క్రమంలో బీజేపీలో గెలిచిన ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపక్షమా..? అధికార పక్షమా..? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ప్రశ్నించడానికి, లేవనెత్తడానికి ఆస్కారం, ఆధారాలు లేని ప్రజాపాలన రాష్ట్రంలో కొనసాగుతుండటంతో… తిరిగి విజయం సాధించాలంటే అధికార పక్షానికి కొంతమేరకు ప్రో గానే ఉండాలన్న భవిష్యత్తు లెక్కలే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మౌనానికి కారణమన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పాత్ర పోషించే కంటే.. అధికార పక్షానికి అనుకూలంగా ఉంటే మళ్ళీ తమను గెలిపిస్తుందన్న ధీమాలో బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు.. ఆపార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. అందులో భాగంగానే పోరాటాలు చేయకుండా, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు చోద్యం చూస్తున్నారంట.
ఈ వ్యవహారంపై జాతీయ నాయకత్వం కూడా అలర్ట్ అయిందట. ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, నేతల వైఖరిపై ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వం నుంచి రిపోర్ట్ కోరారంటున్నారు. అలా హైకమాండ్ సీరియస్ అయి, రిపోర్ట్ కోరిన తక్షణమే ఎమ్మెల్సీలు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల మీద హుటాహుటిన ఇందిరా పార్క్ వేదికగా ధర్నా ప్రకటించారంటున్నారు బీజేపీ నేతలు ఎమ్యెల్సీలుగా గెలిచి ఏడాది పూర్తైంది.. ఏడాది కాలంగా కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపించాయా? ఉన్న ఫలంగా రిటైర్డ్ ఉద్యోగులపై ఎమ్మెల్సీలకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? గత ప్రభుత్వంలో ఆ సమస్య కనిపించలేదా? అన్న చర్చ మొదలైంది.
ఎమ్మెల్సీ పదవి అన్నది బీజేపీ నేతలు కేవలం షోపుటప్ హోదాగా భావిస్తున్నారని… ఓట్లేసి గెలిపించిన ఉపాద్యాయులు, పట్టభద్రులకు చేసిందేమీ లేదన్న టాక్ అటు ఉద్యోగుల్లోనూ, ఇటూ పట్టభద్రుల్లోనూ నడుస్తూ .. తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. అంతేకాదు తాజాగా ఇందిరాపార్క్ వేదికగా ముగ్గురు ఎమ్మెల్సీల నేతృత్వంలో నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగుల మహాధర్నాకు పట్టుమని వందమంది కూడా రాకపోవడం గెలిచిన ఎమ్మెల్సీలకు, కాషాయ పార్టకి చెంప పెట్టు లాంటిదన్న అభిప్రాయ వ్యక్తం అవుతోంది.
అదటుంచితే పార్టీ తీసుకుంటున్న అధికారిక స్టాండ్‌కు భిన్నంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మౌనంగా ఉండడం, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం … ఇవన్నీ కలిపి చూస్తే గ్రే ఏరియా పాలిటిక్స్ అంటే నైతికత లేని రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరు…వారి వైఖరితో ప్రజల్లో పార్టీపై పడుతున్న ఇంపాక్ట్… ప్రభుత్వంపై వారు ఎందుకు పోరాటం చేయడం లేదన్న అంశాలపై ఢిల్లీ బీజేపీ పెద్దలు రాష్ట్ర నాయకత్వం నుంచి ఫీడ్‌బ్యాక్ కోరారంట.
మొత్తానికి బీజేపీలో గెలిచిన ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్‌కు ప్రోగా పని చేస్తున్నారన్న వార్తలు జోరుగా వస్తున్న నేపద్యంలో.. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అయిందా.? ఇంకా వారి మౌనం ఎంతకాలం కొనసాగుతుంది..? రాష్ట్ర నేతల వ్యవహారంపై రిపోర్ట్ కోరిన అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది..? రాష్ట్ర నాయకత్వం ఏ విధమైన రిపోర్ట్ ఇవ్వబోతుంది..? అన్నది ఇప్పుడు తెలంగాణ కాషాయ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.
Also Read: విశాఖ లో వైసీపీకి దిక్కెవరు?
Story by: Anup, Big Tv