E-Paper
Advertisement

Visakhapatnam politics: విశాఖ లో వైసీపీకి దిక్కెవరు?

Visakhapatnam politics: విశాఖ లో వైసీపీకి దిక్కెవరు?
Advertisement

Visakhapatnam politics: ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి నాయకులు కరువైనట్లు కనిపిస్తున్నారు .. నియోజకవర్గాలకు ఇన్చార్జిలే కాదు రీజనల్ కోఆర్డినేటర్లుగా సైతం పక్క జిల్లాల నుంచి వలస వచ్చిన వాళ్ళే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు … దాంతో గతంలో గెలిచి వైసీపీలో పనిచేసిన మాజీలకు రానున్న ఎన్నికల్లో సొంత నియోజకవర్గాలు ఏవో అర్థం కావడం లేదంట… ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నవాళ్లు సమర్ధులైన నాయకులు కాదని వైసీపీ అధిష్టానం భావిస్తుందో ఏమో కానీ సొంత నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలకు మార్చేసి నాయకుల చేత కప్పగంతులేయిస్తోంది… ఆ క్రమంలో తమకు అంతో ఇంతో బలం ఉన్న స్థానంలో కాకుండా నియోజకవర్గాలు మారుస్తుండటం వెనుకున్న వైసిపి వ్యూహం ఏంటో సదరు నేతలకు అంతుపట్టడం లేదంట..

విశాఖ రాజకీయాల్లో వైసీపీ నేతల కొరత

ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది… విశాఖ ఏపీ ఆర్థిక రాజధాని కావడంతో పాటు పారిశ్రామికంగా కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం… అభివృద్ధిలో మాత్రమే కాదు రాజకీయపరంగా కూడా అందరి చూపు విశాఖ వైపే ఉంటుంది… అలాంటి కీలకమైన విశాఖ జిల్లాలో వైసీపీకి నాయకులే కరువైనట్లు కనిపిస్తుంది… గత ఎన్నికల్లో నియోజకవర్గాల అభ్యర్థులను ఇష్టానుసారం మార్చి ప్రయోగాలు చేసిన వైసీపీ ఘోర పరాజయాన్ని మూగట్టుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం సొంత సెగ్మెంట్ల నుంచి ఎక్కడెక్కడికో మార్చేసింది.

నాన్‌లోకల్ అభ్యర్థులే వైసీపీకి సమస్య..

Advertisement

ఎన్నికలకు ముందు పార్టీ ఇన్చార్జులుగా పక్క నియోజకవర్గాలు, పొరుగు జిల్లాల వాళ్ళని నియమించడంతో లోకల్ క్యాడర్ వారికి పూర్తిస్దాయిలో సహకరించలేదంట. ఎమ్మెల్యే అభ్యర్థులు నాన్ లోకల్ అన్న ప్రచారం జోరుగా సాగడంతో గత ఎన్నికల్లో ఎప్పుడు లేనంత భారీ ఓట్ల తేడాతో వారు ఓటమిపాలై, ఘోర అవమానాన్ని ఫేస్ చేశారు… 2024 ఎన్నికల తర్వాత కూడా వైసీపీ అధిష్టానం అలాంటి నిర్ణయాలే తీసుకుంటూ 2029 ఎన్నికలకు పార్టీ నాయకులను కేడర్‌ని సిద్ధం చేయాలని చూస్తుండటం చర్చనీయాంశంగా మారింది .. ఎన్నికలకు పార్టీ అధిష్టానం, కిందిస్థాయి క్యాడర్ సిద్ధంగా ఉన్నా బరిలో నిలవాల్సిన అభ్యర్థులు నాన్ లోకల్ అవ్వడంతో భవిష్యత్తుపై తెగ బెంగ పెట్టుకుంటున్నారంట.

వైసీపీ లో కప్పగంతుల ప్రభావం.. అమర్నాథ్ ప్రయాణం

ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో ఎక్కువగా కప్పగంతులే కనిపిస్తున్నాయి… 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుండి పోటీ చేసి మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ 2024 ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల తేడాతో రికార్డు ఓటమి మూటగట్టుకున్నారు… గాజువాకలో అయినా ఆయన పార్టీని ఈ ఐదు సంవత్సరాలు బలోపేతం చేసుకుని ఉంటే 2029 ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా పోటీలో నిలిచే అవకాశం ఉండేది… కానీ 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే జగన్ ఆయన్ని గాజువాక నుంచి అనకాపల్లి జల్లా చోడవరం నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. దాంతో పాటు అమర్నాథ్ను అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.

అమర్నాథ్ ఇన్చార్జీ నియామకంపై వివాదాలు

Advertisement

గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో పాటు, అనకాపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించి ఉంటే… గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో క్యాడర్ ను సమన్వయం చేసుకునే అవకాశం ఉండేది… కానీ పక్కనే ఉన్న చోడవరం నియోజకవర్గం నుండి కరణం ధర్మశ్రీని తప్పించి గుడివాడ అమర్నాథ్‌ను దానికి ఇన్చార్జిని చేశారు. దాంతో ఎక్కడా క్యాడర్‌ను సమన్వయం చేసుకోలేక మాజీ మంత్రి తెగ ఇదై పోతున్నారంట.

అభ్యర్ధులపై ప్రజా ఆదరణ కీలకం

మరోపక్క 2019 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచిన కరణం ధర్మశ్రీని ఎలమంచిలి నియోజకవర్గానికి ఇన్చార్జిగా పంపారు. దాంతో 2024 వరకు ఎలమంచిలి ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నబాబురాజుకు నియోజకవర్గం లేకుండా పోయింది. కరణం ధర్మశ్రీకి సొంత అనుచరవర్గం అంతా చోడవరంలో ఉంది… మరి ఎలమంచిలిలో కరణం ధర్మశ్రీకి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు అనుచరుగణం ఎంతవరకు సహకరిస్తుందనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది… క్యాడర్ అంతా వైసీపీని, జగన్‌ను చూసి ఓటు వేస్తారని అనుకునే పరిస్థితి లేదని గత ఎన్నికల్లో తేలిపోయింది… అభ్యర్ధులను బట్టే జయాపజయాలు ఉన్న పరిస్ధితుల్లో వైసీపీ తిరిగి ఇన్చార్జులతో కప్పగంతులు వేయిస్తుండటం పార్టీ శ్రేణులకే మింగుడుపడటం లేదంట.

వైసీపీ రీజనల్ నేతల ఎంపిక.. స్థానిక నేతలకు అవకాశాలా?

పార్టీ పదవుల ఎంపికలో పక్క జిల్లాల నాయకుల మీదే వైసీపీ అధిష్టానం ఎక్కువగా దృష్టి పెడుతూ… ఉమ్మడి విశాఖ నాయకులను చిన్నచూపు చూస్తుందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా కాకినాడ జిల్లాకు చెందిన మాజీమంత్రి కురసాల కన్నబాబును వైసీపీ అధిష్టానం నియమించింది. వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యవహరించారు. వారితో పాటు ఇప్పుడు మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఉత్తరాంధ్రకు స్థానికేతరులే. దాన్ని బట్టి చూస్తుంటే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించడానికి విశాఖలో కాని, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాని నుండి గాని సమర్ధుడైన నాయకుడు లేడని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తుంది…

జిల్లా నుండి గ్రామస్థాయికి క్యాడర్ సమన్వయం సవాలు

ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి పూ్తి అవగాహన ఉండి, పార్టీ స్థితిగతులు తెలిసిన నేతను రీజనల్ కోఆర్డినేటర్‌గా నియమిస్తే.. గ్రామస్థాయి నుండి జిల్లాల స్థాయి వరకు ఉన్న క్యాడర్ మొత్తాన్ని సమన్వయం చేసే అవకాశం ఉంటుందని వైసీపీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. కానీ వైసీపీ అధిష్టానం పక్క జిల్లాల నుండి రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకువచ్చి పార్టీని నడిపించాలని చూస్తుండడంతో వారు ఉత్తరాంధ్రకు చుట్టం చూపుగా వచ్చిపోతున్నారంట. జగన్ పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమలు నిర్వహించి మాయమవుతున్నారంట. దీంతో పూర్తిస్థాయిలో నియోజకవర్గాల స్థాయిల్లో ఉన్న పార్టీ సమస్యలు పక్క జిల్లాల నుండి వచ్చిన నాయకులకు అర్థం కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పక్క జిల్లాల నేతలపై ఆధారపడుతున్న వైసీపీ

జిల్లాలో నియోజకవర్గాల ఇన్చార్జిల విషయంలో కూడా పక్క జిల్లాలకు చెందిన వారిపై వైసీపీ అధిష్టానం ఆధారపడుతుండటంతో కింది క్యాడర్ వారికి పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి కనిపించడం లేదు… విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన భీమిలి నియోజకర్గానికి బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనును ఇన్చార్జ్‌గా నియమించారు. పాయకరావుపేట నియోజకవర్గం ఇన్చార్జిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులును ఇంపోర్ట్ చేశారు. దాంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నేతలు వైసీపీలో లేరా? గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లను ప్రజలు నమ్మడం లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి…

బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా విజయం

వైసీపీ గద్దె దిగాక ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలోకి దిగి గెలిచారు.. బొత్స సత్యనారాయణ కూడా పక్క జిల్లా అయినా విజయనగరానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. బొత్స సత్యనారాయణకు రాష్ట్రస్థాయి నేతగా ఉన్న గుర్తింపు, ఉత్తరాంధ్రవాసి అవ్వడంతో ఆయన విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా ఉన్నా వైసీపీకి కొంతవరకు మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది… కానీ మిగిలిన నాయకుల విషయంలో అంత సీన్ లేదంటున్నారు.

వైసీపీ పాలనలో ఇన్చార్జి మార్పులు

ముందు నుంచి ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్‌ని బిల్డప్ చేసుకున్న నాయకులను ఇన్చార్జిలుగా తప్పించి సంబంధం లేని స్థానాలకు పంపిస్తుండటంతో వైసీపీలో కప్పగంతులాట కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు… మరి వైసీపీ అధిష్టానం 2029 ఎన్నికల వరకు నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నియమితులైన వారిని పూర్తిస్థాయిలో కంటిన్యూ చేస్తుందా? లేక మళ్ళీ ఎన్నికల నాటికి ఇన్చార్జులను మార్చి కప్పగంతులు కొనసాగిస్తుందా? అన్న సందేహాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.

Also Read: ఉత్తమ్ ట్రీట్‌మెంట్.. అరవింద్ కు షాక్ తప్పదా?

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×