Solar Villages: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 81 మోడల్ సోలార్ గ్రామాల కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 40,350 సోలార్ వ్యవస్థల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో మంజూరైన 20,175 వ్యవస్థలకు సంబంధించి పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో ప్రస్తుతం సాధ్యమైనవిగా గుర్తించిన 17,758 సర్వీసులకు సంబంధించిన పనులను వేగవంతం చేసి, కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నవంబర్ 28 గడువులోగా తొలి విడత పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 81 మోడల్ సోలార్ గ్రామాల్లో పథకం అమలు తీరుపై తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు ఇటీవల కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
టీజీరెడ్కో కార్పొరేట్ కార్యాలయంలో వెండర్లు, జిల్లా మేనేజర్లు, ప్రధాన కార్యాలయ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 40,350 సోలార్ సిస్టమ్‌లలో, మొదటి విడత కింద మంజూరైన 20,175 సిస్టమ్‌లకు గానూ 17,758 ఫీజిబుల్ సర్వీసులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ ఎంఎన్ఆర్ఈ నిబంధనల ప్రకారం నవంబర్ 28 నాటికి మొదటి విడత పనులన్నింటినీ విధిగా పూర్తి చేయాలని వెండర్లను ఆదేశించారు. పథకం అమలులో ఉన్న 81 గ్రామాలకు సంబంధించిన తాజా గణాంకాలను అధికారులు పరిశీలించారు. కేటాయించిన ఫీజిబుల్ సర్వీసులు, ఇప్పటివరకు అమర్చిన సిస్టమ్‌లు, ఇంకా అమర్చాల్సిన బ్యాలెన్స్ పనులు, నెట్ మీటర్ల విడుదల, సింక్రనైజేషన్, బీటీఎస్ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన పత్రాల స్థితిగతులపై సమగ్ర సమీక్ష జరిపారు. వెండర్లు, జిల్లా మేనేజర్ల నుంచి వచ్చిన లెక్కల్లో తేడాలను సరిచేసి, ఎక్కడెక్కడ పనులు నిలిచిపోయాయో ఆయా దశలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
Also read: చంద్రబాబు ప్రభుత్వం హింసకు పాల్పడుతోంది, పార్టీ నేతల భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు
ముఖ్యంగా నాకాఫ్, హిందుస్తాన్, కేంద్రీయ భండార్, హాకా వంటి వెండర్ల ఆధ్వర్యంలో పనుల పూర్తి స్థాయి 50 శాతం కంటే తక్కువగా ఉండటంపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మందగించడానికి గల కారణాలను విశ్లేషించి, నిర్దేశిత గడువులోగా పెండింగ్ పనులను పూర్తి చేస్తామని వెండర్ల నుంచి లిఖితపూర్వక హామీలు తీసుకున్నారు. 95 శాతానికి పైగా పనులు పూర్తి చేసినట్లు క్లెయిమ్ చేస్తున్న క్లారో సంస్థకు సంబంధించి మిగిలిన ఇన్స్టాలేషన్లు, సింక్రనైజేషన్, డాక్యుమెంటేషన్ ముగించడానికి నిర్దిష్ట తేదీలను ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి, బాధ్యులైన అధికారులపై జవాబుదారీతనాన్ని నిర్ణయించారు. మిగిలిపోయిన అన్ని పనుల కోసం డెడ్‌లైన్ గా విధించుకున్న నవంబర్ 28తో పాటు, 15 రోజుల్లోగా అవసరమైన మెటీరియల్ కొరతను అధిగమించి, కొనుగోలు ఆర్డర్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో అదనపు సాంకేతిక సిబ్బందిని, ఇన్స్టాలేషన్ బృందాలను పెంచాలని, నెట్ మీటరింగ్, తనిఖీలకు షెడ్యూల్లో తగిన సమయం కేటాయించాలని సూచించారు.
విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కంల) అధికారులతో ఉన్న సమన్వయ లోపాలను గుర్తించి, నెట్ మీటర్ల విడుదల, ఇన్స్టాలేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సహించేది లేదని, డిఫెక్టివ్ సబ్మిషన్లను సరిదిద్దాలని స్పష్టం చేశారు. అలాగే, జిల్లా మేనేజర్లు తనిఖీల బ్యాక్‌లాగ్‌ను పూర్తి చేసి, నివేదికలను వెంటనే ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు. లోపాలను సరిదిద్దిన తర్వాతే వెండర్ల పేమెంట్లను క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు. మొదటి విడత పనులు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలోనే, రెండో నిర్దేశించుకున్న మార్చి 31, 2027 నాటి ముగింపు లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పురోగతిని ప్రతి వారం పర్యవేక్షిస్తూ.. ఆర్ఈసీ, ఎంఎన్ఆర్ఈ, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించేలా ప్రతి పనికి ఒక బాధ్యుడైన అధికారిని నియమించి, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు.
Also read: పండగ వేళ మహిళలకు శుభవార్త.. భారీ పడుతున్న బంగారం-వెండి ధరలు