
Right To Vote : మనదేశంలో 18 ఏళ్లు నిండితే చాలు. ఎవరికైనా ఓటుహక్కు వస్తుంది. కుల మత లింగ వివక్షలేం లేవు. ఆస్తులు, అంతస్తుల భేదాలేం లేవు. భారత పౌరులందరికీ సరిసమానంగా దక్కుతున్న అపూర్వమైన హక్కు ఇది. ప్రపంచ చరిత్రను గమనిస్తే.. ఓటుహక్కు కోసం పెద్ద పోరాటాలు చేసిన దేశాలూ ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే.. రక్తం ఏరులై పారింది కూడా. మరి.. ఇంతగా ఉద్యమించి, సాధించుకున్న హక్కును నేడు మన ఓటర్లంతా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
నేనొక్కడినే ఓటేయకపోతే కొంపలేమన్నా మునుగుతాయా? ప్రభుత్వాలు నాకేం చేశాయని నేను ఓటెయ్యాలి? ఎవరు పాలించినా జనం సమస్యలు శాశ్వతంగా తీరతాయా? అని ఎన్నికల సమయాల్లో కొందరు వితండవాదం చేస్తుంటారు. అలాంటివారంతా ఫిలిప్పీన్స్‌లో అవినీతి మార్కోస్ నియంతృత్వాన్ని ప్రజలు ఉద్యమించి అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్న సంగతిని గుర్తుచేసుకోవాలి. 1980ల్లో ఇది ప్రజాస్వామ్యపు గొప్పదనాన్ని చాటి చెప్పింది.
అలాగే.. ఒకప్పుడు బ్రిటన్ ఉక్కు మహిళగా, శక్తిమంతమైన ప్రధానిగా పేరొందిన మార్గరేట్ థాచర్ పేద, మధ్యతరగతి జనాన్ని విస్మరించి, సంపన్నుల సంక్షేమానికి పెద్దపీట వేసినందుకు అక్కడి జనం ఆమెను చిత్తుగా ఓడించారు. ఇక.. దక్షిణాఫ్రికాలో నల్లసూరీడు నెల్సన్ మండేలా దశాబ్దాల పోరాటం తర్వాతే ప్రజాస్వామ్యం నిలబడింది.
నేపాల్‌లోనైతే అద్భుతమే ఆవిష్కృతమైంది. దశాబ్దాల పాటు రక్తపాతం సృష్టించిన మావోయిస్టులు.. చివరికి.. ప్రజాస్వామ్యమే పరమోన్నతమైన ఎన్నిక ప్రక్రియ అని చెబుతూ.. ఆయుధాలను పక్కనబెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించుకున్నారు. ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఒకవైపు.. ఓటు వేసిన వాళ్లు నిలదీస్తేనే.. పట్టించుకోని ప్రజాప్రతినిధులు పట్టించుకోని పరిస్థితి. అలాంటిది.. అసలా హక్కును వాడుకోకపోతే.. నేతల్ని నిలదీసే అవకాశం, అధికారం ఉండదనే విషయాన్ని దురదృష్టవశాత్తు ఇలా మాట్లాడే వారంతా ఈ కింది దేశాల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
1890 నాటికి ఈ భూగోళంపై ఓటుహక్కున్న దేశం ఒక్కటైనా లేదు. అలాంటిది ఇప్పుడు మెత్తం 192 దేశాలకు గాను 124 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంది. మనదేశం.. స్వాతంత్ర్యం వచ్చిన నాడే.. నిర్దిష్ట వయసు నిండిన అందరికీ కుల, మత, వర్గ, భాషా అంతరాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించింది.
అగ్రరాజ్యం అమెరికాకు 1776లో స్వాతంత్య్రం సిద్ధించినా.. జాతి, లింగ వివక్ష రహితంగా ప్రజలందరికీ ఓటు హక్కు లభించడానికి సుమారు 150 ఏళ్లు పట్టింది! ప్రపంచంలోనే తొలిసారిగా 1906లో మహిళలకు ఓటు హక్కుతోపాటు… చట్టసభకు పోటీచేసే హక్కును కూడా ఒకేసారి ప్రసాదించింది ఫిన్‌లాండ్. మొదట్లో మాత్రం ఇక్కడ పురుషులకే ఓటు హక్కు ఉండేది.
డెన్మార్క్‌లో పరిస్థితి మరీ విచిత్రం! 1886 వరకూ ఇక్కడి మహిళలకు ఓటు హక్కు లేదు. ఆ తర్వాత కూడా… రాజధాని కోపెన్‌హాగన్‌లోని టాక్స్ పేయర్స్‌కు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అనేక ఉద్యమాల తర్వాత 1915లో అందిరికీ ఓటు హక్కు దక్కింది. ఈ జాబితాలో అందరి కంటే ఆఖర్లో అందిరికీ ఓటుహక్కు కల్పించిన దేశం.. సౌదీ అరేబియా. 2011 వరకూ ఇక్కడ పురుషులకే ఓటు హక్కుండేది.
ఓటింగుకు దూరంగా ఉంటూ ప్రభుత్వాలను విమర్శించే వారంతా ప్రజలకూ కొన్ని విధులు, బాధ్యతలు ఉన్నాయని తెలుసుకోవాలి. వాటిలో అత్యంత ప్రధానమైనదే ఓటు వేయటం. ప్రజాస్వామ్యానికి ప్రాణమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా, ప్రభుత్వ ఫలాలు మన ఇంట్లోకి అడుగుపెట్టాలనుకోవడం ముమ్మాటికీ స్వార్థమే. బాధ్యతను విస్మరించిన మానవులు హక్కులూ కోల్పోతారనే మాటను వీరంతా గుర్తుపెట్టుకోవాలి.