Vallabhaneni Vamsi: ఏపీ పాలిటిక్స్‌లో వల్లభనేని వంశీ మరోసారి తెరపైకి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా యాక్టీవ్‌గా లేని గన్నవరం మాజీ ఎమ్మెల్యే తాజాగా జగన్ పర్యటనలో కనిపించారు. జగన్ వెహికల్ పట్టుకుని ప్రయాణించిన వంశీ తిరిగి రాజకీయంగా యాక్టీవ్ అయ్యాననే సిగ్నల్ పంపారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తుందట.
వల్లభనేని వంశీ.. ఆంధ్రా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. 2019లో టీడీపీ తరుఫున గెలిచిన ఆయన..ఆ తర్వాతి కాలంలో వైసీపీ సానుభూతిపరుడిగా మారారు. అంతేనా.. టీడీపీ అగ్ర నేతలపై తన మార్క్ కామెంట్స్‌తో ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపారు. 2019లో కూడా టీడీపీ నుంచి పోటీ చేసిన వంశీ వైసీపీ హవాలోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆ తర్వాత టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలున్నాయి. దీంతో టీడీపీకి ఆయన బద్ధ శత్రువుగా మారారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓటమిపాలయ్యారు.
2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం రాగానే వంశీ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో.. వంశీపై దాదాపు 17 కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో వంశీ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక దశలో అసలు వంశీ బయటకు వస్తారా అనే చర్చ నడిచిన పరిస్ధితులున్నాయి. జైలు ఉన్న సమయంలో బాగా సన్నబడి.. జుట్టుకు కలర్ వేయకుండా పూర్తిగా మారిపోయిన వంశీ పేషెంట్‌లా తయారయ్యారు. ఆ తర్వాత కూడా అదే లుక్ కంటిన్యూ చేశారు. ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా…ఇంటికే పరిమితమై కోర్టు కేసులపైనే దృష్టిని కేంద్రీకరించారనే చర్చ నడించింది.
గత 18 నెలలు కాలంగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్న వంశీ…. తాజాగా జగన్ పర్యటనలో ప్రత్యక్షం కావడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ పై దాదాపుగా 17 కేసు నమోదు చేశారు… 160 రోజులు పైగా విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు… అనారోగ్య కారణంతో బెయిల్ మంజూరు అవడంతో బయటకు వచ్చారు… బయటికి వచ్చిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అవ్వలేదు. దాంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.
ఆ చర్చలకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు వల్లభనేని వంశీ తిరిగి జగన్ కృష్ణా టూర్లో ప్రత్యక్షమయ్యారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో క్రమంగా చురుకుగా మారుతున్నారనే చర్చ గన్నవరం నియోజకవర్గంలో స్టార్ట్ అయిందట. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు వల్లభనేని వంశీ.
గూడూరు ప్రాంతంలో జగన్‌తో కలిసి కారులో పంట నష్టాలను పరిశీలించిన వంశీని చూసిన అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారట. ఆయన మళ్లీ రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారనే అభిప్రాయం వంశీ అనుచరుల్లో వ్యక్తమవుతోంది.