BigTV English
Advertisement

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

India VS Pakistan: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. ఆ దేశంలో మరింత పవర్‌ఫుల్‌గా మారబోతున్నాడనే న్యూస్.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతని కోసం.. పాకిస్థాన్ ఏకంగా రాజ్యాంగ సవరణే చేసేందుకు సిద్ధమైంది. ఆ ఒక్క సవరణతో.. ఆసిమ్ మునీర్‌కు అపరిమిత అధికారులు దక్కుతాయనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న ఆసిమ్ మునీర్.. పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని శాసించబోతున్నాడా?


రాజ్యాంగాన్నే సవరించేందుకు సిద్ధమైన పాక్ ప్రభుత్వం..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రభావం.. ఆ దేశంలో బాగా పెరుగుతోందని చెప్పడానికి ఇదే బిగ్ ఎగ్జాంపుల్. అతని కోసం.. పాకిస్థాన్ ప్రభుత్వం ఏకంగా రాజ్యంగాన్నే సవరించేందుకు సిద్ధమవుతోంది. ఆ సవరణతో.. తన సైన్యానికి మరిన్ని అధికారాలు కట్టబెట్టే అవకాశం ఉంది. త్వరలోనే.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. పార్లమెంటులో 27వ రాజ్యాంగ సవరణని ప్రవేశపెట్టనుంది. ఇందులో.. సాయుధ దళాల కమాండ్‌కు సంబంధించిన ప్రతిపాదిత మార్పులు ఉన్నాయ్. 27వ సవరణకు మద్దతు కోసం.. ప్రభుత్వం తనని సంప్రదించినట్లు.. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేసిన తర్వాత.. రాజ్యాంగంలో మార్పులకు సంబంధించి ఊహాగానాలు మొదలయ్యాయి. పాక్ డిప్యూటీ పీఎం, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా సెనేట్‌లో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ చర్య.. పాకిస్థాన్‌పై మునీర్‌కు ఉన్న పట్టుని మరింత సురక్షితం చేస్తుందనే చర్చ జరుగుతోంది. పాకిస్థాన్‌.. ఎన్నో దశాబ్దాలుగా పౌర-సైనిక సంబంధాలతో ఇబ్బంది పడుతోంది. ఆ దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థపైనా.. సైన్యం ప్రభావం కనిపిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా
షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేయబోయే 27వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం ఒకటే. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పదవికాలం, చట్టపరమైన హోదా చుట్టూ ఉన్న అస్పష్టతని తొలగించేందుకే.. రాజ్యాంగంలో మార్పులు చేయబోతున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మునీర్‌కు.. ఫీల్డ్ మార్షల్ హోదా ఇచ్చింది పాక్ ప్రభుత్వం. అయితే.. ఈ పదవి నుంచి మునీర్ అధికారికంగా ఈ నెల 28న రిటైర్ అవ్వాల్సి ఉంది. కానీ.. పాకిస్థాన్ సర్కార్ చేయబోయే రాజ్యాంగ సవరణతో.. అతని పదవీకాలం 2027 వరకు పొడిగించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఇది సక్సెస్ అవుతుందా? లేదా? అనే దానిపై ప్రస్తుతం దాయాది దేశంలో అనిశ్చితి కొనసాగుతోంది. కొన్ని రిపోర్టుల ప్రకారం.. గత ప్రభుత్వంలో చట్టపరమైన సంస్కరణ ద్వారా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ పదవీకాలం మూడు నుంచి ఐదేళ్లకు పెంచారు. అయితే.. ఫీల్డ్ మార్షల్ పదవీకాలం, పదవీ విరమణ, సేవా పరిస్థితులను పాకిస్థాన్ రాజ్యాంగం ప్రస్తావించలేదు. దాంతో.. మునీర్ ఫ్యూచర్ అస్పష్టంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. షాబాజ్ ప్రభుత్వం మాత్రం.. రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ స్థానాన్ని, అధికారాన్ని కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చూస్తోంది.


ఫీల్డ్ మార్షల్ హోదాని గుర్తించని ఆర్టికల్ 243
మునీర్ పదవీ విరమణ తేదీ సమీపిస్తుండటంతో.. ప్రధానమంత్రి కార్యాలయం, పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం.. తీవ్రమైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ చట్టం, ఆ దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 సాయుధ దళాల కమాండ్, నియంత్రణని నిర్వచించినప్పటికీ, అవి ఫీల్డ్ మార్షల్ హోదాని గుర్తించలేదు. దాంతో.. పాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన 27వ సవరణ ఫీల్డ్ మార్షల్ స్థానం, అధికారులు, సేవా పరిస్థితులను అధికారికంగా మార్చేందుకు.. ఆర్టికల్ 243ని సవరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ కొనసాగింపుతో పాటు చట్టపరమైన రక్షణని ఇస్తుందని చెబుతున్నారు. పాకిస్థాన్‌లో ఈ సవరణ గనక ఆమోదం పొందితే.. ఆర్మీ చీఫ్ అధికారాలు అపరిమితంగా మారిపోనున్నాయ్. ఇకపై.. దేశంలో ఆసిమ్ మునీర్‌ని సవాల్ చేసేందుకు ఎవరూ ఉండరు. పాకిస్థాన్‌లోఇప్పటికీ.. సైన్యానిదే అంతిమ అధికారం. మిలటరీ ఏమి కావాలంటే.. అది చేయగలదు. మరోవైపు.. మునీర్ కూడా చాలా కాలం పాటు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ పదవీలో ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ని.. సైన్యం సుప్రీం కమాండర్‌గా పాలించాలని అతను కలలు కంటున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.

పాకిస్థాన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందనే వాదన
అయితే.. ఈ సవరణ పాకిస్థాన్‌లో కొత్త కమాండర్ ఇన్ చీఫ్ పదవిని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుందని కొందరు చెబుతుంటే.. ఈ చర్యతో దేశాన్ని వేరొకరికి అప్పగిస్తున్నారా? దేశంలో పౌర ఆధిపత్యం అనే ఆలోచన ఏమైంది? అని ప్రశ్నిస్తున్నారు. ఈ సవరణ.. దేశ పునాదులను కదిలిస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య.. పాకిస్థాన్ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని అంటున్నారు. అయితే.. మునీర్ కోసం తీసుకురాబోతున్న రాజ్యాంగ సవరణని.. సెనేట్, నేషనల్ అసెంబ్లీలో విడివిడిగా టూ బై థర్డ్ మెజారిటీతో ఆమోదించాలి. 336 మంది సభ్యులు కలిగిన నేషనల్ అసెంబ్లీలో.. ఈ సవరణకు 233 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే.. 96 మంది సభ్యులున్న సెనేట్‌లో.. దీనికి అనుకూలంగా 61 మంది మాత్రమే ఉన్నారు. మూడింట.. రెండొంతుల మెజారిటీ పొందేందుకు.. కనీసం ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు అవసరమవుతున్నారు. అయితే.. సెనేట్‌లో దీనికి ఎవరు మద్దతిస్తారనేది కూడా ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆపరేషన్ సిందూర్‌కు ముందు.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న మునీర్.. ఇప్పుడు ఫీల్డ్ మార్షల్‌గా ఉన్నారు. అప్పటి నుంచి.. పాకిస్థాన్ రాజకీయాలపై.. తన పట్టుని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను.. ఇప్పటికే అనేక ప్రపంచ ప్రతినిధుల బృందాల్లో భాగంగా ఉన్నారు. పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పంద చర్చల సమయంలోనూ.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మునీర్‌తో భేటీ కావడం కూడా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆసిమ్ మునీర్‌ని మించిన మొనగాడు.. పాకిస్థాన్‌లో ఇంకెవరూ లేనట్లుగా భావిస్తోంది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. రాజ్యాంగపరంగా అతను మరోసారి ఫీల్డ్ మార్షల్‌గా చేసే అర్హత లేకపోయినా.. అతని కోసం రాజ్యాంగాన్నే సవరించి.. సైన్యంలో కీలక బాధ్యతలను కట్టబెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సవరణతో.. మునీర్‌కు అపరిమత అధికారాలు దక్కితే.. భారత్-పాకిస్థాన్ మధ్య మరో యుద్ధం ఖాయమా?

పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 సవరణ
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందనే వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయ్. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. మునీర్‌ని ఫీల్డ్ మార్షల్‌గా కొనసాగించడానికి, మరిన్ని అధికారులు అప్పగించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని భావిస్తుండటమే.. ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ని సవరించడం ద్వారా.. ఆర్మీ చీఫ్ నియామకం, పదవీకాలం, అధికారాలపై.. కేంద్ర ప్రభుత్వం కంటే సైన్యానికే ఎక్కువ నియంత్రణ దక్కే చాన్స్ ఉంది. పాకిస్థాన్ రాజ్యాగంలో.. ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్ అనే ర్యాంక్‌కు.. చట్టబద్ధమైన గుర్తింపు లేదు. ఈ సవరణతో ఆ ర్యాంక్ చట్టబద్ధం అవుతుంది. దాంతో.. మునీర్‌కు అపరిమిత అధికారాలు దక్కుతాయ్. ఈ పరిణామాలు పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వంపై పెరుగుతున్న సైనిక వ్యవస్థ పట్టుని స్పష్టంగా సూచిస్తున్నాయ్. దేశం ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటున్న సమయంలో.. అపరిమిత అధికారాన్ని కట్టబెట్టే నిర్ణయం.. మునీర్‌ని డీ-ఫ్యాక్టో రూలర్ స్థానంలో నిలబెడుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఆసిమ్ మునీర్‌కు దక్కే అధికారాలు.. భారత్-పాకిస్థఆన్ సంబంధాలను, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో శాంతిని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు.

మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న మునీర్
ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్.. భారత్‌పై తరచుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుూ వస్తున్నారు. అణు వాతావరణంలో.. యుద్ధానికి తావులేదని చెబుతూనే.. భారత్ కనీస కవ్వింపు చర్యకు పాల్పడినా.. నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. అతనికి అపరిమిత అధికారులు గనక దక్కితే.. కచ్చితంగా అది సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంటుంది. పైగా.. కొద్ది నెలల క్రితమే.. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణ తర్వాతే.. మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా దక్కింది. సైనికపరమైన ప్రతిస్పందన కారణంగా.. ఈ హోదా దక్కడం, మరో సైనిక ఘర్షణ ద్వారా తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు అతను మొగ్గు చూపే చాన్స్ ఉంది. మునీర్‌కు కమాండర్ ఇన్ చీఫ్ హోదా దక్కి, పాక్ సైన్యంపై.. పౌర ప్రభుత్వ నియంత్రణ చట్టబద్ధంగా తగ్గితే పరిస్థితులు మారిపోతాయంటున్నారు. అప్పుడు.. భారత్‌తో సంబంధాల విషయంలో తక్షణ, సైనికపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. దీనివల్ల దౌత్యపరమైన సంప్రదింపులకు అవకాశం తగ్గి, ఉద్రిక్తతలు పెరిగి.. రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది.

పాకిస్థాన్ రాజకీయాలపై సైన్యం పట్టు సాధిస్తుందనే సంకేతం
రాజ్యాంగ సవరణతో ఆసిమ్ మునీర్‌ మరింత పవర్‌ఫుల్‌గా మారితే.. అది కచ్చితంగా పాకిస్థాన్ అంతర్గత రాజకీయాలపై సైన్యం పూర్తి పట్టు సాధిస్తుందనే సంకేతం ఇప్పటికే వెళ్లింది. ఇది.. ఆ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, ప్రాంతీయ స్వయంప్రతిపత్తిని ప్రమాదంలో పడేస్తుందనే చర్చ మొదలైంది. అయితే. మునీర్ ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. పాకిస్థాన్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికే.. ఆ దేశం ఆర్థికంగా చితికిపోయింది. ఇలాంటి సమయంలో.. మునీర్‌కు అపరిమిత అధికారాన్ని కట్టబెట్టి, అతనేదైనా తప్పుడు నిర్ణయం తీసుకొని.. భారత్‌తో గనక కయ్యానికి కాలు దువ్వితే.. పాక్ ఆర్థికంగా మరింత దిగజారిపోతుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పాకిస్థాన్‌పై ప్రెజర్ పెరుగుతుంది. ఇవన్నీ పక్కనబెడితే.. మునీర్‌ని గనక ఫీల్డ్ మార్షల్‌గా కొనసాగిస్తే.. భారత్-పాక్ మధ్య సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం మాత్రం ఖాయమంటున్నారు.

Also Read: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా చెబుతున్నారు. అతను.. మానసిక స్థితి సరిగా లేదని చెప్పడం.. చర్చనీయాంశమైంది. మునీర్.. తన పార్టీ కార్యకర్తలపై అనేక దారుణాలకు ఒడిగట్టారని, నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరపడం లాంటివి చేశారన్నారు. ఎన్నడూ లేని విధంగా మహిళలపై అనేక దారుణాలకు ఒడిగట్టారని.. పాక్ ఆర్మీ చీఫ్‌తో పాటు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని, తన భార్యని కూడా అన్ని రకాలుగా మునీర్ ఇబ్బంది పెట్టాడన్నారు ఇమ్రాన్ ఖాన్. మునీర్ ఎలాంటి వాడు, అతని నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖానే చెప్పాక.. అతనికి అపరిమిత అధికారాలు దక్కితే.. అతనెలా ప్రవర్తిస్తాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్న దానిపై అందరికీ ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. పాకిస్థాన్ పార్లమెంటులో గకన రాజ్యాంగ సవరణకు ఆమోదం దక్కితే.. అది పాక్ రాజకీయ వ్యవస్థలో సైన్యం ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది. భారత్‌తో సహా ప్రాంతీయ ఉద్రిక్తతలకు దారితీస్తుంది.

Story By Anup, Bigtv

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Big Stories

×