Vijay Victory: ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? తమిళనాడు విజిల్ వేస్తే.. ఇండియా అంతటా రీసౌండ్ వచ్చింది. బాక్సాఫీస్ కొల్లగొట్టడం మాత్రమే తెలిసిన విజయ్.. బ్యాలెట్ బాక్సులు కూడా బద్దలయ్యేలా విక్టరీ కొడితే.. బ్లాక్‌బస్టర్‌ని మించిన సినిమా కనిపించింది తమిళనాడులో! ఎవ్వరితో మింగిల్ అవకుండా.. సింగిల్‌గా బరిలోకి దిగి.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేని నిలిపి.. సింహంలా గెలిచి నిలిచాడు. ఎంట్రీతోనే కింగ్ మేకర్ అవుతాడనుకుంటే.. ఏకంగా కింగ్ అయి కూర్చున్నాడు. విజయ్ వండర్స్.. ఒకటా? రెండా? చాలానే ఉన్నాయ్..
అధికారంలో ఉన్న డీఎంకేని ఢీకొట్టాడు.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏడీఎంకేని ఎత్తిపడేశాడు. రాజకీయాల్లో తలపండిన పార్టీలతో తలపడ్డాడు. ఎత్తులకు ఎదురొడ్డి నిలిచాడు. పైఎత్తులు వేసి.. ఇప్పుడు అందరికంటే పైన ఉన్నాడు. ఏకంగా తమిళనాడునే గెలిచాడు. అందుకే.. విజయ్ విక్టరీ ఇంత సౌండ్ వస్తోంది. తమిళ నేలలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయ్. ఎన్నికల ముందు విజయ్ జన నాయగన్ సినిమా రిలీజ్ కానివ్వలేదు. కానీ.. అతనే జన నాయకుడిగా అవతరించాడు. అతని పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి.. పబ్లిక్‌లో పెట్టారు. అయినాసరే.. విజయ్ కుంగిపోలేదు.. వెనక్కి తగ్గలేదు. బలంగా నిలబడ్డాడు. అన్నీ.. బరిలోనే తేల్చుకున్నాడు. అద్భుతమైన రిజల్ట్‌తో తమిళనాడు పవర్ మ్యాప్‌నే మార్చేశాడు. ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి.. సంచలన విజయాన్ని నమోదు చేసి.. ఈ దేశాన్నే ఆశ్చర్యపరిచాడు. తన పార్టీ తమిళగ వెట్రి కజగం.. టీవీకేని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించేలా ముందుండి నడిపించాడు. అభిమానులతో మొదలైన ఉద్యమం.. ఇప్పుడు భారీ ఎన్నికల విజయంగా మారింది. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న డీఎంకే, ఏడీఎంకే ఆధిపత్యాన్ని కూలదోసింది.
యువత మద్దతు, ప్రభుత్వ వ్యతిరేకత, పకడ్బందీగా రూపొందించిన క్షేత్రస్థాయి ప్రచారం లాంటి వాటితో.. ఎవరూ ఊహించని బ్లాక్‌బస్టర్ ఎలక్షన్ షో చూపించారు విజయ్. ఈ ఫలితం కేవలం టీవీకే విక్టరీనే కాదు.. తమిళనాడు రాజకీయంలో.. ఓ నిర్ణయాత్మక మార్పుని కూడా సూచిస్తోంది. చెన్నై ప్రాంతంలోని 37 స్థానాలకు కూడా 30కి పైగా స్థానాల్లో టీవీకే డామినేషనే కనిపించింది. అంతేకాదు.. 65 అర్బన్ నియోజకవర్గాల్లో.. దాదాపు 50 స్థానాల్లో విజయ్ పార్టీనే లీడింగ్. బేసిగ్గా.. అర్బన్ తమిళనాడులో డీఎంకే డామినేషన్ కనిపిస్తుంది. కానీ.. ఈసారి విజిల్‌దే విక్టరీ. సౌత్ తమిళనాడులో 58 స్థానాలకు గానూ.. 25కి పైగా స్థానాల్లో విజయ్ పార్టీ ప్రభావం చూపింది. అక్కడ.. అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. 116 రూరల్ సెగ్మెంట్లలో..30కి పైగా స్థానాల్లో ఇంపాక్ట్ చూపించింది. టీవీకే సునామీలో.. డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన అనేక మంది అగ్ర నాయకులు కొట్టుకుపోయారు. ఈ దెబ్బతో విజయ్ పార్టీ తమిళనాడు అంతటా ఎంతలా దూసుకెళ్లిందో, ఎలా దుమ్మురేపిందో అందరికీ అర్థమైంది.
Also Read: కొడుకుతో కలిసి.. ప్రియుడిని చంపిన మహిళ!
రాష్ట్రంలో కచ్చితంగా తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని టీవీకే ధీమాగా ఉంది. ఈ భారీ విజయాన్ని ముందే ఊహించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సైలెంట్ విజయ్ వేవ్ ఉందని ముందునుంచీ తాము చెబుతూనే ఉన్నామన్నారు. తమిళనాడు మార్పు కోసం ఎదురుచూస్తోందని.. ఈ ఫలితాలు నిరూపించాయ్. జనం.. డీఎంకే, ఏడీఎంకేపై అసంతృప్తిగా ఉన్నారు. ఆ రెండు పార్టీల పాలనపై.. విసుగు చెందారు. అందుకే.. తమిళనాడులో విజయ్ గేమ్ ఛేంజర్‌గా మారారు. అందుకే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది కొత్త చాప్టర్ అనే చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, పొలిటికల్ స్క్రీన్ మీద కూడా విజయ కేతనాన్ని ఎగరేశారు విజయ్. హీరో గానే కాదు.. ఓ బలమైన నాయకుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు. దళపతి నుంచి అధిపతిగా మారారు.
తమిళనాడు పాలిటిక్స్ అంటేనే.. ఓ ఎమోషన్. అక్కడ సినిమాకు, రాజకీయానికి విడదీయలేని బంధం ఉంది. అయితే, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి దిగ్గజాల తర్వాత.. ఆ స్థాయిలో జనాన్ని ప్రభావితం చేసిన నాయకుడు విజయ్ ఒక్కడే. టీవీకే పార్టీ స్థాపించిన కొద్దికాలంలోనే.. విజయ్ సాధించిన విక్టరీ వెనుక అనేక అద్భుతాలున్నాయ్. సాధారణంగా సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వస్తే.. పొత్తుల కోసం ఎదురుచూస్తారు. కానీ, విజయ్ ఎవరితోనూ కలవకుండా, ఏ కూటమికి తలవంచకుండా.. సింగిల్‌గా బరిలోకి దిగారు. ఎంట్రీ ఇవ్వడంతోనే.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టడం.. విజయ్ రాజకీయ పరిణితికి, పవర్‌కు నిదర్శనం. విజయ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడం కామన్. అదే ఫార్ములా.. రాజకీయాల్లోనూ కనిపించింది. ఆడియెన్స్ పల్స్ తెలుసుకున్నట్లే.. ఓటర్ పల్స్ కూడా పట్టుకున్నారు. అతను చూపిన చాణక్యం.. రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. యువతను, మహిళలను టీవీకే వైపు తిప్పడంలో.. విజయ్ స్ట్రాటజీ.. వంద శాతం వర్కవుట్ అయింది. అనవసర విమర్శల జోలికి వెళ్లకుండా, అభివృద్ధి, మార్పు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. అందుకే.. టీవీకే విజిల్ సౌండ్.. ఇండియా మొత్తం వినిపించింది.
Also Read: Jagan – Vijay: జగన్ వ్యూహం.. విజయ్ విజయం, అసలు మేటర్ ఇదా!
ఏ పార్టీ మద్దతు లేకుండా ఒంటరి పోరాటం చేయడమే కాదు.. లక్షలాది మంది యువతను రాజకీయ కార్యకర్తలుగా మార్చుకున్నారు. తన పార్టీ క్యాడర్‌లో క్రమశిక్షణని నెలకొల్పారు. పాత రాజకీయ పద్ధతులకు స్వస్తి పలికి.. కొత్త తరం ఆశయాలకు అద్దం పట్టేలా.. విజయ్ విజన్ కనిపించింది. ఎన్నికల ఫలితాలకు ముందు విజయ్ ఏదో ఒక పార్టీకి మద్దతిచ్చి.. కింగ్ మేకర్ రోల్ పోషిస్తారని అంతా భావించారు. కానీ, తమిళ ప్రజలు మాత్రం ఆయనకు ఏకంగా కింగ్ కిరీటాన్నే తొడిగారు. తమిళనాడు గడ్డపై ఓ కొత్త నాయకత్వం ఉద్భవించింది. ఇది కేవలం ఒక పార్టీ విజయం మాత్రమే కాదు, తమిళ ప్రజల విజయం. చాలా మంది విజయ్‌ని తక్కువ అంచనా వేశారు. టీవీకే పార్టీకి 10 సీట్లు వస్తే గొప్పని కొందరు, 20 సీట్లకే పరిమితమవుతుంది ఇంకొందరు.. రిపోర్టులిచ్చారు. కానీ.. ఎంజీఆర్, జయలలిత తర్వాత సీఎంగా ఎదిగిన యాక్టర్‌గా విజయ్ గొప్ప స్థాయికి చేరారు.
1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంతో సృష్టించిన చరిత్రను.. ఇప్పుడు విజయ్ ఎంట్రీకి అన్వయిస్తున్నారు. అన్ని వర్గాల నుంచి లభించిన విస్తృత మద్దతుతోనే.. విజయ్ ఇప్పుడు ఈ స్థాయిలో మార్మోగుతోంది. ఈ తీర్పు.. రెండేళ్ల కిందట ఏర్పడినప్పుడే డిసైడ్ అయింది. మార్పు కోసం టీవీకే చేస్తున్న కృషి ప్రజలని బాగా ఆకట్టుకుందని చెబుతున్నారు. నిజానికి, యాక్సిస్ మై ఇండియా సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది.. తమిళనాడులో మార్పు తెచ్చేందుకు టీవీకేకు ఓటు వేస్తామని చెప్పారు. ఇప్పుడు రిజల్ట్ కూడా అలాగే కనిపిస్తోంది. విజయ్ విక్టరీ.. భారత రాజకీయాల్లోనే ఓ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. సిద్ధాంతం బలంగా ఉండి, జనం అండగా ఉంటే.. ఎంతటి కంచుకోటైనా బద్దలవ్వాల్సిందేనని విజయ్ ప్రూవ్ చేశారు. వెండితెర దళపతి నుంచి తమిళనాడుగా అధిపతిగా మారిన విజయ్ ప్రస్థానం.. రాబోయే రోజుల్లో మరిన్న సంచలనాలకు వేదిక అవుతుందని అంచనా వేస్తున్నారు.
Storey By: Appa Rao Big Tv
Also Read: యాపిల్ నుంచి క్రేజీ అప్డేట్.. అత్యాధునిక ఫీచర్లు, క్రేజీ కలర్స్‌లో రాబోతున్న iPhone 18 Pro!