Gold Prices: బంగారం రేట్లపై యుద్ధం ఎఫెక్ట్ అస్సలు కనిపించట్లేదు. పసిడిపై.. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించట్లేదు. ఇంతటి అనిశ్చితి, ఆందోళనల మధ్య కూడా.. బంగారం రివర్స్ ట్రెండ్‌లో పయనిస్తోంది. బేసిగ్గా.. ఎప్పుడు యుద్ధాలు వచ్చినా.. బంగారం రేట్లు పెరుగుతాయ్. అనిశ్చితి కాలంలో సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం.. ఈసారి వ్యతిరేక దిశలో కదిలింది. రేట్లు పెరగకపోగా.. తగ్గుతున్నాయ్. పశ్చిమాసియా యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. బంగారం ధరలు తగ్గుతున్నాయి.
సాధారణంగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు.. గోల్డ్ సేఫ్ హెవెల్ అని ఇన్వెస్టర్లంతా.. పెట్టుబడులు పెడతారు. కానీ.. వాళ్లే ఇప్పుడు బంగారాన్ని దేనికోసం పట్టించుకోవట్లేదనే చర్చ జరుగుతోంది. ఈ ప్రతికూల ధోరణికి.. బ్రాడ్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్, బలమైన యూఎస్ డాలర్, లాభాల బుకింగ్ ర్యాలీలే కారణమని నిపుణులు చెబుతున్నారు. లాంగ్‌టర్మ్ ఫండమెంటల్స్ ఇప్పటికీ విలువైన లోహాలకు మద్దతిస్తున్నందున ఇది స్వల్పకాలిక సర్దుబాటు అంటున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రెండు వారాలుగా తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ, సెన్సెక్స్ 5 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయ్. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వస్తువైన క్రూడ్ ఆయిల్ బ్యారెల్ మాత్రం.. వంద డాలర్ల మార్క్ దాటింది. ఇది.. ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. సాధారణంగా, ఇలాంటి యుద్ధ పరిస్థితులు.. బంగారం లాంటి అరుదైన లోహాల రేట్లు పెరిగేందుకు కారణమవుతాయ్. కానీ, ఈసారి ఆ ట్రెండ్ కంటిన్యూ కాలేదు. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో వెండి ధరలు 14 వేల కంటే ఎక్కువ తగ్గాయ్. బంగారం ధరలు కూడా క్రమంగా దిగొస్తున్నాయ్. భౌగోళిక రాజకీయ గందరగోళ పరిస్థితుల్లో.. బంగారంని సేఫ్ హెవెన్‌గా చూస్తారు. కానీ.. ఇప్పుడున్న మార్కెట్ డైనమిక్స్‌ని మిగతా ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తున్నాయ్. అందులో.. మొదటిది చమురు ధరల్లో పెరుగుదల. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. విస్తృతమైన రిస్క్ ఆఫ్ సెంటిమెంట్‌ని ప్రేరేపించాయి. ఇది పెట్టుబడిదారులను నగదు పెంచేందుకు, అసెట్ క్లాసుల్లో లివరేజ్డ్ పొజిషన్లు తగ్గించేందుకు ప్రేరేపించింది. ఈ దశల్లో.. బంగారం లాంటివి కూడా స్వల్పకాలిక అమ్మకాల ఒత్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే, పెట్టుబడిదారుల మార్జిన్ కాల్‌లని తీర్చేందుకు, పోర్ట్‌ఫోలియోలను రీబ్యాలెన్స్ చేయడానికి హోల్డింగ్‌లను రద్దు చేస్తారని చెబుతున్నారు.
ఇక.. అమెరికా డాలర్ బలోపేతం కూడా గోల్డ్ రేట్లు పడిపోయేందుకు కీలకపాత్ర పోషించింది. ప్రపంచ అనిశ్చితి కాలంలో మూలధనం తరచుగా డాలర్, యూఎస్ ట్రెజరీలోకి ప్రవహిస్తుంది. ఇది సాధారణంగా విలువైన లోహాలపై భారం పడుతుంది. ఎందుకంటే, వాటి ధర డాలర్లలో ఉంటుంది. ఇప్పటికే బంగారం ధరలు పెరిగిన స్థాయిలో ఉండటంతో.. కొంతమంది ఇన్వెస్టర్లు అస్థిరత పెరిగినప్పుడు.. లాభాలను లాక్ చేసేందుకు ఎంచుకున్నారు. క్రూడ్ ఆయిల్.. ద్రవ్యోల్బణంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నందున.. ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటున్నారు. ఆయిల్ రేట్లు పెరిగితే.. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇది ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. యూఎస్ ఫెడ్ ప్రస్తుతం.. ఉపాధి, ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ కూడా ఇన్‌ఫ్లేషన్‌ని 2 శాతం దగ్గరే ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముడిచమురు ధరలు పెరగడం వల్ల.. లక్ష్యాన్ని సాధించడం కష్టమనే అంచనాలున్నాయ్. బలమైన డాలర్ సాధారణంగా బంగారం ధరలపై ఒత్తిడి తెస్తుంది. యుద్ధాలు, అనిశ్చితి కాలంలో.. పెట్టుబడిదారులు తరచుగా భద్రత, లిక్విడిటీ కోసం అమెరికా డాలర్లు, యూఎస్ ట్రెజరీ బాండ్లలోకి తరలిస్తారు. గోల్డ్ రేట్లు డాలర్లలో నిర్ణయిస్తారు కాబ్టటి, బలమైన గ్రీన్‌బ్యాక్ బంగారాన్ని మరింత ఖరీదైనదిగా మార్చింది. ఇదే, డిమాండ్‌ని కూడా తగ్గించింది. యుద్ధం తగ్గుముఖం పడితే.. ఇన్వెస్టర్లు తమ ఫోకస్ మానిటరీ పాలసీ, డాలర్ ఇండెక్స్, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లపైకి మళ్లించే అవకాశాలున్నాయంటున్నారు.
యుద్ధం వస్తే బంగారం ధర ఆకాశాన్ని తాకడం మనం ఎప్పుడూ చూసేదే. కానీ, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలు పెరగకపోగా, తగ్గుతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎప్పుడూ సేఫ్ హెవెన్‌గా భావించే బంగారం విషయంలో ఈసారి రివర్స్ ట్రెండ్‌కు చాలా కారణాలున్నాయ్. అందులో మొదటిది.. డాలర్ పుంజుకోవడమే. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలకు, డాలర్ విలువకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. యుద్ధం, అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపే కాకుండా, అత్యంత సురక్షితమైన కరెన్సీగా భావించే అమెరికన్ డాలర్ వైపు కూడా మొగ్గు చూపుతారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ బలంగా పెరగడంతో, ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం కొనడం ఖరీదుగా మారింది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు స్వల్పంగా తగ్గాయి.
యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయ్. అప్పుడు ఆటోమేటిక్‌గా రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని అదుపు చేసేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని తగ్గించకుండా అలాగే ఉంచే అవకాశం ఉంది. బంగారం మీద ఎటువంటి వడ్డీ రాదు కాబట్టి, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మి బాండ్లు, డిపాజిట్ల వైపు టర్న్ అవుతారు. ఈ అంచనా కూడా బంగారం ధరలు పడిపోయేందుకు కారణమవుతోంది. ఇక.. రెండేళ్లు బంగారం అద్భుతమైన ర్యాలీని చూసింది. గతేడాది ఏకంగా 65 శాతం లాభాలను ఇచ్చింది. ఇంత భారీ పెరుగుదల తర్వాత, యుద్ధం లాంటి బిగ్ హెడ్ లైన్ రాగానే.. చాలా మంది ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించాలని చూస్తారు. దీనివల్ల మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగొస్తున్నాయి. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయ్. షేర్ మార్కెట్లలో భారీగా నష్టపోయిన ట్రేడర్లు, తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు తమ దగ్గరున్న అత్యంత విలువైన అస్తి అయిన బంగారాన్ని అమ్ముతుంటారు. లిక్విడ్ క్యాష్ కోసం జరిగే ఈ ఆరాటం కూడా బంగారం ధర తగ్గేందుకు కారణమవుతోంది. ఇక.. ప్రస్తుతమున్న ధరలు రికార్డు స్థాయికి చేరడంతో.. కొత్తగా కొనుగోలు చేసే వేగాన్ని అవి తగ్గించాయి. డిమాండ్, సప్లై మధ్య ఈ వ్యత్యాసం ధరలపై ప్రభావం చూపుతోంది.
బంగారంకి ఉన్న క్రేజ్‌ని.. బిట్ కాయిన్ లాంటి డిజిటల్ అసెట్స్, వెండి లాంటివి కూడా కొంత మేర దెబ్బతీస్తున్నాయ్. ఇప్పుడు ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడం వల్ల రాగి, వెండికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కేవలం భద్ర కోసమే కాకుండా, గ్రోత్ కోసం కూడా వీటిని ఎంచుకుంటున్నారు. అందువల్ల.. కొంతకాలం పాటు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని చెబుతున్నారు. గోల్డ్ రేట్లు.. ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యమైతే.. బంగారం ధరలు మరికొంత దిగొచ్చే అవకాశం ఉంది. విదేశీ మారక నిల్వల కోసం చాలా దేశాలు బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయ్. కాబట్టి, భారీ పతనం ఉండకపోవచ్చనే విశ్లేషణలు కూడూ వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి బంగారం మళ్లీ పుంజుకొని.. సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ రివర్స్ ట్రెండ్ కేవలం ఓ టెక్నికల్ కరెక్షన్ మాత్రమే. బంగారం.. తన సేఫ్ హెవెన్ లేబుల్‌ని పూర్తిగా కోల్పోలేదు., డాలర్, వడ్డీ రేట్ల ముందు దాని ఇంపాక్ట్ కాస్త తగ్గిందంటున్నారు. యుద్ధం మరింత తీవ్రమైనా, చమురు సంక్షోభం తలెత్తినా.. బంగారం మళ్లీ తన గోల్డెన్ పీరియడ్‌ని కంటిన్యూ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
Also Read: ఇరాన్ ముందు ట్రంప్ ప్లాన్ ఫెయిల్.. యుద్ధం ఇప్పట్లో ఆగే ఛాన్స్ ఉందా లేదా!
Story by: Anup, Big Tv