4 Day Work Week| ఇప్పుడు చాలా ఆఫీసుల్లో వారానికి రెండు రోజులు సెలవు విధానం ఉంది. అయితే వారంలో ఐదు రోజులకు బదులుగా కేవలం నాలుగు రోజులు పని చేయడం చాలా మందికి కలలా అనిపిస్తుంది. ఒక రోజు అదనపు సెలవు లభిస్తే కుటుంబంతో ఎక్కువ సమయం గడపవచ్చు, ఒత్తిడి తగ్గడం లాంటి ప్రయోజనాలు ఉంటాయి. కానీ కంపెనీలు మాత్రం ఒక సమస్య ఎదుర్కొంటాయి. తక్కువ రోజులు పని చేసినా ఉద్యోగుల ప్రొడక్టివిటీ అలాగే ఉంటుందా? నాలుగు రోజుల పని విధానం నిజంగా విజయవంతం కావాలంటే కేవలం సెలవు పెంచడం కాదు, పని చేసే విధానాన్ని కూడా మార్చాలి.
4 డే వర్క్ వీక్ అంటే ఉద్యోగులు ఐదు రోజులకు బదులుగా వారంలో నాలుగు రోజులు పని చేయడం. అయితే ప్రతి కంపెనీలో ఈ విధానం ఒకేలా ఉండదు. కొన్ని కంపెనీలు ఐదు రోజుల పని గంటలను నాలుగు రోజుల్లోనే పూర్తి చేయిస్తాయి. దీనివల్ల ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది. మరికొన్ని కంపెనీ మాత్రం మొత్తం పని గంటలు తగ్గించి, జీతాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తాయి. అయితే నాలుగు రోజుల విధానం విజయవంతం కావాలంటే విధానంలో ఉద్యోగులపై అదనపు ఒత్తిడి ఉండకూడదు. కంపెనీలు అనవసరమైన పనులను తగ్గించాలని నిపుణలు సూచిస్తున్నారు.
నాలుగు రోజుల పని విధానంలో 100 – 80 -100 మోడల్ గురించి తరచుగా మాట్లాడుతారు. ఇందులో ఉద్యోగులకు 100 శాతం జీతం అందుతుంది. అయితే గతంలో పనిచేసిన సమయంతో పోలిస్తే సుమారు 80 శాతం సమయం పని చేస్తారు. అయినప్పటికీ కంపెనీ 100 శాతం ప్రొడక్టివిటీని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే ఈ మోడల్ ప్రతి కంపెనీకి ఒకే విధంగా పనిచేయదు. ప్రతి రంగానికి వేర్వేరు అవసరాలు ఉంటాయి.
కొన్ని ట్రయల్స్‌లో ఉద్యోగులు తక్కువ ఒత్తిడి,తక్కువ అలసట అనుభవించినట్లు తెలిపారు. అదనపు సెలవు రోజు కుటుంబం మరియు వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం ఇస్తారు. ఉద్యోగులు ఆ సమయాన్ని విశ్రాంతి, హాబీలు లేదా ఇతర పనుల కోసం ఉపయోగిస్తారు. మంచి విశ్రాంతి తర్వాత వారు మరింత శక్తితో పని చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగులు.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా మెరుగుపడుతుంది. అయితే ఇది ఉద్యోగ భారం, కంపెనీ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.
నాలుగు రోజులు పని చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఆటోమేటిక్‌గా పెరగదు. కంపెనీలు పనిని మరింత స్మార్ట్‌గా నిర్వహించాలి. ఎక్కువ సమయం తీసుకునే మీటింగ్‌లను తగ్గించాలి. అవసరం లేని మీటింగ్‌లను తొలగించాలి. పదే పదే చేసే పనులను సులభతరం చేయవచ్చు.
టెక్నాలజీ సహాయంతో కొన్ని సాధారణ పనులను ఆటోమేట్ చేయవచ్చు. ఉద్యోగులకు స్పష్టమైన ప్రాధాన్యతలు ఇవ్వడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read:కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి
టెక్నాలజీ కంపెనీలు ఈ విధానాన్ని సులభంగా అమలు చేయవచ్చు. కానీ ఆసుపత్రులు, రెస్టారెంట్లు, ఫ్యాక్టరీలు, అత్యవసర సేవలకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. కొన్ని సంస్థలు ఉద్యోగులకు రోటేషన్ విధానంలో సెలవులు ఇవ్వాల్సి రావచ్చు. అందువల్ల ఇతర కంపెనీలను చూసి అదే విధానాన్ని కాపీ చేయడం సరైనది కాదు.
సరైన ప్రణాళికతో అమలు చేస్తే నాలుగు రోజుల పని విధానం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు విశ్రాంతి పెరగడంతో పని మీద దృష్టి కూడా మెరుగుపడుతుంది. అయితే కేవలం ఒక రోజు సెలవు ఇవ్వడం మాత్రమే పరిష్కారం కాదు. అనవసరమైన పనులను తగ్గించి, పని విధానాన్ని సమర్థవంతంగా మార్చాలి.
Also Read: పుట్టబోయేది మగబిడ్డ లేదా ఆడబిడ్డ.. హార్ట్‌బీట్‌తో తెలుసుకోవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే