EPFO Withdraw: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం పీఎఫ్ విధానాన్ని అమలు చేస్తుంది. ఉద్యోగి జీతం, ఉద్యోగి పనిచేసే సంస్థ నుంచి నెలలవారీగా కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ పొదుపు వడ్డీని కూడా ఇస్తుంది. అయితే ఉద్యోగి అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది. అయితే విత్ డ్రా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఈపీఎఫ్ఓ గుర్తించింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రావిడెంట్ ఫండ్ పొదుపును విత్ డ్రా చేస్తుండడంపై పదవీ విరమణ నిధి సంస్థ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక హెచ్చరిక జారీ చేసింది.
పీఎఫ్ విత్ డ్రా ఖాతాదారులు నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొన్ని పరిస్థితులలో చేసే అకాల విత్ డ్రాలపై విధించే ఛార్జీల గురించి ఖాతాదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
EPFO ఖాతా నుంచి చందాదారులు ముందస్తు ఉపసంహరణ చేసుకోవచ్చు. అంటే ఒక ఉద్యోగి పదవీ విరమణకు ముందు ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల నుండి నిధులను ముందస్తుగా ఉపసంహరించుకునే విధానం. ఇది పూర్తిగా లేదా పాక్షికంగా విత్ డ్రా కావొచ్చు.
1952 ఈపీఎఫ్ పథకం కింద నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుండి ఏదైనా ముందస్తు ఉపసంహరణను ఉల్లంఘనగా పరిగణించవచ్చు. ఏదైనా ఉల్లంఘన జరిగితే, దుర్వినియోగం అయిన నిధులను రికవరీ చేసే అధికారం ఈపీఎఫ్ఓకి ఉంటుంది. అలాగే అదనపు జరిమానాలు విధించవచ్చు. ఈపీఎఫ్ఓ 3.0 సంస్కరణలతో పీఎఫ్ విత్ డ్రా, ఇతర ప్రావిడెంట్ ఫండ్ సేవలను సులభతరం చేయనుంది.
ఉద్యోగుల తమ పీఎఫ్ ఖాతాల నుంచి ముందస్తుగా నిధులను ఉపసంహరించుకోవాలనుకుంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
1. ఖాతాదారులు పీఎఫ్ పొదుపులో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని పొందవచ్చు.
2. ఖాతాదారుడు పదవీ విరమణ చేసినా లేదా రెండు నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకోవచ్చు.
3. ఇల్లు కొనుగోలు, నిర్మాణం లేదా పునరుద్ధరణ, రుణాలను చెల్లించడం, వైద్య ఖర్చులు వంటి నిర్దిష్ట కారణాల వల్ల పాక్షికంగా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు.
4. చందాదారులు విత్ డ్రా అమౌంట్ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఎలాంటి పత్రాలను అందించాల్సిన అవసరం లేదు.
5. ఉద్యోగానికి రాజీనామా చేసిన సందర్భంలో ఖాతాదారులు తమ పీఎఫ్ కార్పస్‌ను ఉపసంహరించుకోవడానికి రెండు నెలలు వేచి ఉండాలి.
పీఎఫ్ ఖాతాదారుడు 5 సంవత్సరాల సర్వీస్ పూర్తికాక ముందే మొత్తాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటే ఈపీఎఫ్ఓ నిబంధనల మేరకు టీడీఎస్ పాటు నిధులపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ స్కీమ్ 1952 ప్రకారం సరైన కారణాలు చూపకుండా పీఎఫ్ విత్ డ్రా చేస్తే రికవరీకి దారితీయవచ్చు. ఖాతాదారులు సాధారణంగా తమ పిల్లల విద్య లేదా వివాహానికి డబ్బులు పాక్షికంగా విత్ డ్రా చేస్తారు.
1952 ఈపీఎఫ్ పథకంలో పేర్కొనని ఇతర అవసరాల కోసం పీఎఫ్ నిధులను విత్ డ్రా చేస్తే ఈపీఎఫ్‌ఓకు ఆ మొత్తాన్ని వడ్డీతో పాటు తిరిగి రికవరీ చేయవచ్చు.
Also Read: TVS Bikes Price Cut: బైక్స్, స్కూటర్ల ధరలు తగ్గించిన టీవీఎస్.. కొత్త ధరల లిస్ట్ ఇదే!
ఉదాహరణకు ఈపీఎఫ్ఓ సభ్యుడు తన ఇంటి నిర్మాణానికి పీఎఫ్ విత్ డ్రా చేసి, ఆ నిధులను వేరే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే దీనిని దుర్వినియోగంగా గుర్తిస్తారు. ఇలాంటి సందర్భాల్లో నగదు మంజూరు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాల వ్యవధిలోపు విత్ డ్రా మొత్తాన్ని, వడ్డీతో రికవరీ చేస్తుంది. ఈ డబ్బు చెల్లించే వరకు అతనికి తదుపరి పీఎఫ్ విత్ డ్రాకు అనుమతి ఉండదు.