CM Chandrababu Meets Pawan: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల రాజకీయ పరిణామాలు హీటెక్కాయి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన పలు వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో ప్రతిపక్ష వైసీపీ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని విమర్శలు స్టార్ట్ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతోనే ఇటీవల అసెంబ్లీకి హాజరయ్యారు పవన్. అనంతరం వైద్యుల సూచన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇంకా ఆయన జ్వరంతోనే బాధపడుతున్నారు. ఓజీ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ పవన్ పాల్గొన్నారు. అనంతరం వైరల్ ఫీవర్ మరింత ఎక్కువగా కావడంతో ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ ను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు ఆదివారం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన సీఎం చంద్రబాబు పవన్‌ను పరామర్శించారు. అయితే భేటీలో ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల చర్చిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి అంశంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడిన తీరుపై చిరు అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై పవన్ ఇంకా స్పందించలేదు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ, చిరంజీవి అంశంపై అభిమానులు, టీడీపీ, జనసేన మద్దతుదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. జనసేన నేతలు ఎమ్మెల్యేలు చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు బాలయ్య వ్యాఖ్యల్లో తప్పేముందని అంటున్నారు.
కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో చూసుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సొంత అజెండాలతో ప్రశ్నలు సంధించడంపైనా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర స్వరంతో మండిపడ్డారు. మంత్రులపై కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం ఆరా తీశారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం శాసనసభలో మాట్లాడుతూ.. ఓ ఉద్యోగి ట్రాన్స్ ఫర్ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, హోంమంత్రికి లేఖలు ఇచ్చీ ఇచ్చీ తన లెటర్‌ప్యాడ్ అయిపోయిందని, కానీ ఇంకా ఆ అధికారి బదిలీ కాలేదని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తన్నాలన్నట్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు.
Also Read: Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక
ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోషల్ మీడియా పోస్టులపై హోంశాఖ తీరును తప్పుబట్టారు. సీనియర్లు కూడా మంత్రులను టార్గెట్ చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.