WiFi Calling: మొబైల్ నెట్‌వర్క్ ఒక్కసారిగా డౌన్ అయిపోతే ఎంత ఇబ్బందో మనందరికీ తెలిసిందే. ముఖ్యమైన సమయంలో కాల్ కట్ అవ్వడం, సిగ్నల్ కోసం చుట్టూ తిరగడం, అవసరమైనప్పుడు మాట్లాడలేకపోవడం చాలా అసౌకర్యం కలిగించే విషయం. ఈ సమస్యకు ఒక సింపుల్ పరిష్కారం ఉంది అదే వైఫై కాలింగ్.
వైఫై కాలింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా మనం ఫోన్ కాల్స్ చేయడానికి మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్‌పైనే ఆధారపడతాం. కానీ కొన్ని ప్రాంతాల్లో టవర్ సిగ్నల్ బలహీనంగా ఉండవచ్చు. అప్పుడు ఫోన్ లైన్ పనిచేయకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో, మన దగ్గర వైఫై ఇంటర్నెట్ ఉంటే, అదనపు యాప్‌లు అవసరం లేకుండా ఫోన్‌లోని డయలర్ ద్వారానే కాల్ చేయగలిగే సౌకర్యమే వైఫై కాలింగ్. అంటే సిగ్నల్ లేకపోయినా, ఇంటర్నెట్ ద్వారా మన ఫోన్ కాల్ చేస్తుంది.
Also Read: RBI new rules 2025: RBI షాకింగ్ అప్‌డేట్.. అక్టోబర్ 1 నుంచి మీ బ్యాంక్ ఖాతాలో ఇవన్నీ తప్పనిసరి!
చాలా సులభం! జస్ట్ ఇలా చేయండి
ఈ ఫీచర్ వాడటం చాలా సులభం. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్‌లోకి వెళ్లి, నెట్‌వర్క్ లేదా కనెక్షన్ ఆప్షన్‌లో ‘వైఫై కాలింగ్’ ఆన్ చేస్తే చాలు. కొన్ని ఫోన్లలో ఇది కాల్ సెట్టింగ్స్‌లో కూడా లభిస్తుంది. ఐఫోన్‌లో అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫోన్ ఆప్షన్‌లో ‘వైఫై కాలింగ్’ ఎంపికను ఆన్ చేయాలి. ఒకసారి ఇది యాక్టివేట్ చేస్తే, మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడల్లా ఆటోమేటిక్‌గా వైఫై ద్వారా కాల్ చేస్తుంది.
వైఫై కాలింగ్ వల్ల లాభాలు
నిజం చెప్పాలంటే, వైఫై కాలింగ్ వల్ల లాభాలు చాలా ఉన్నాయి. మొదటిగా, కాల్ క్వాలిటీ చాలా మెరుగ్గా ఉంటుంది. మనం HD వాయిస్‌తో మాట్లాడుతున్నట్టే క్లియర్‌గా వినిపిస్తుంది. అదనంగా, ఇంట్లో లేదా ఆఫీస్‌లో టవర్ సిగ్నల్ బలహీనంగా ఉన్నా, కాల్స్ సులభంగా సాగుతాయి. రోమింగ్ సమయంలో కూడా ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఉన్నప్పుడు మొబైల్ నెట్‌వర్క్ ఖర్చులు ఎక్కువగా వస్తాయి. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించి వైఫై కాలింగ్ చేస్తే ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.
ఇలా చేస్తే.. సమస్యలు రావా?
భద్రత విషయంలో కూడా వైఫై కాలింగ్ నమ్మకమైనదే. ఇది మన మొబైల్ ఆపరేటర్ నెట్‌వర్క్‌ద్వారానే నడుస్తుంది. అంటే మొబైల్ కాల్స్ ఎంత సేఫ్‌గా ఉంటాయో, వైఫై కాల్స్ కూడా అంతే సేఫ్‌గా ఉంటాయి. కానీ పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తు తెలియని నెట్‌వర్క్‌లో మీ ఫోన్ కనెక్ట్ చేస్తే డేటా రిస్క్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి వైఫై లేదా నమ్మకమై కనెక్షన్‌తో వాడటం ఉత్తమం. కాబట్టి ఇది ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే స్మార్ట్ ఫీచర్‌గా మారింది.