Rs 1 Crore Investment Plan: కోటి రూపాయల కార్పస్‌ను నిర్మించడం చాలా మంది కల. కోటీశ్వరుడు కావాలనే ఈ పెద్ద లక్ష్యం మొదటిసారి చూసేందుకు కష్టంగా అనిపించినా.. క్రమశిక్షణ, సరైన పెట్టుబడి వ్యూహంతో దీన్ని సులభంగా సాధించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సులువుగా అందుకోవచ్చని సూచిస్తున్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.కోటి నిధిని సంపాదించవచ్చని తెలియజేస్తున్నారు. నిపుణుల ప్రకారం 8 ఏళ్లలో రూ.1 కోటి ఎలా సంపాదించవచ్చో ఈ కథనంలో చూద్దాం.
8 ఏళ్ల కాలంలో రూ.కోటి నిధిని కూడబెట్టాలంటే పలు పెట్టుబడి మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, SIP, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీన్ని సాధించే అవకాశముంది. నిపుణుల లెక్కల ప్రకారం బంగారంలో నెలవారీగా 8 ఏళ్ల పాటు రూ.25వేల చొప్పున పెట్టుబడి పెడితే.. మెుత్తం పెట్టుబడి 24 లక్షల అవుతుంది. వార్షికంగా 10 శాతం మేర ధర పెరిగిందని భావిస్తే.. రూ.12.14 లక్షల ఆదాయం పెట్టుబడిపై సమకూరుతుంది. అంటే మెచ్యూరిటీ కార్పస్ రూ.36.14 లక్షలు అవుతుంది.
ఎస్ ఐపీలో నెలవారీ పెట్టుబడి రూ. 30,000 పెడితే మార్కెట్లో 12 శాతం రాబడిని ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా రూ.30 వేల చొప్పున మెుత్తం పెట్టుబడి రూ.28.8 లక్షలు చేరితే దానిపై అంచనా రాబాడి రూ.18.31 లక్షలు. ఆ రెండు కలిపితే మెుత్తం మెచ్యూరిటీ కార్పస్ రూ. 47.11 లక్షలు అవుతుందని అంచనా. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్ లోనూ రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే.. దానిపై కూడా 12 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా 8 ఏళ్లు మ్యూచువల్ ఫండ్ నిధి రూ. 22.28 లక్షలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా బంగారం, SIP, మ్యూచువల్ ఫండ్ లో ప్రతీ నెలా ఏకకాలంలో పెట్టుబడి పెడితే 8 ఏళ్లు తిరిగేసరికి రూ.1 కోటికిపైగా సంపాదించవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!
పైన తెలిపిన లెక్కలు ఎనిమిదేళ్లలో కోటి రూపాయల నిధిని ఎలా సాధించవచ్చో తెలియజేస్తాయి. అయితే మ్యూచువల్ ఫండ్లు, బంగారంలో పెట్టే పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. మార్కెట్ లో చోటుచేసుకునే మార్పుల వల్ల రాబడి లెక్కలు మారే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ మార్గాల్లో వచ్చే రాబడిపై ట్యాక్స్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఒకవేళ మీరు ప్రతి నెల అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేకపోతే తక్కువ మొత్తంతో కూడా ఈ కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో టార్గెట్ ను ఎనిమిదేళ్ల కంటే ఎక్కువగా పెంచుకోవాల్సి ఉంటుంది.