Tea Business: కేవలం పది రూపాయల టీ కప్పుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చంటే నమ్ముతారా? కానీ ఇది సాధ్యమేనని నిరూపించారు ఓ టీకొట్టు వ్యాపారి. రోజుకు వేలాది కప్పుల టీని అమ్ముతూ ఆయన నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు దీటుగా ఆదాయాన్ని అర్జిస్తున్నారు. తన లాభదాయకమైన టీకొట్టు వ్యాపారం గురించి ఓ వ్యక్తి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
‘శర్మ కేఫ్ రెస్టారెంట్’ పేరిట టీ కొట్టు నడుపుతున్న ఆ యజమాని.. కంటెంట్ క్రియేటర్ ఆయుష్ గోస్వామితో తన వ్యాపారానికి సంబంధించి అంశాలను పంచుకున్నారు. ఈ టీకొట్టు ద్వారా నెలకు దాదాపు రూ. 9 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. గత 55-56 ఏళ్లుగా విజయవంతంగా తన షాపు నడుస్తోందన్నారు. ‘మేం కస్టమర్లకు అత్యుత్తమ టీని అందించడానికే ప్రయత్నిస్తాం. దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉన్నాం’ అని ఆయన గర్వంగా చెప్పారు.
వ్యాపార లెక్కల గురించి చెబుతూ.. తమ షాప్‌లో ప్రతిరోజూ దాదాపు 3,000 కప్పుల టీ అమ్ముడవుతుందని యజమాని తెలిపారు. ఒక్కో కప్పు ధర రూ. 10 అని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతిరోజూ టీ విక్రయాల ద్వారా రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు వ్యాపారం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే 30 రోజులకు గాను మొత్తం ఆదాయం రూ. 7.5 లక్షల నుండి రూ. 9 లక్షల వరకు ఉంటుందన్నారు. అయితే ఇది కేవలం వచ్చిన మొత్తం ఆదాయం మాత్రమేనని.. ఇందులో టీ పొడి, పాలు, చక్కెర వంటి ముడిసరుకుల ఖర్చులు, సిబ్బంది జీతాలు, దుకాణం అద్దె, విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులన్నీ తీసివేసిన తర్వాత మిగిలేదే అసలు లాభమన్నారు. ఇక తన కేఫ్ లో దాదాపు 30 నుండి 35 మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన వెల్లడించారు.
‘తక్కువ పెట్టుబడితో పెద్ద వ్యాపారాన్ని నిర్మించగలరా?’ అన్న ప్రశ్నకు యజమాని ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. సాధారణ స్థాయి నుండి ప్రారంభించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న కొందరి ఉదాహరణలను ఆయన ఉదహరించారు. ‘ప్రతి ఒక్కరూ శూన్యం నుంచే పైకి ఎదుగుతారు. ఉదాహరణకు నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్‌లను చూడండి. మోదీ గారు ఒకప్పుడు టీ అమ్మారు. ఈ రోజు భారత ప్రధానిగా ఉన్నారు. ఎలాన్ మస్క్ చిన్న వ్యాపారవేత్తగా మెుదలై.. ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. విజయం సాధించడానికి తాతముత్తాతల ఆస్తులు, వారసత్వ సంపద అవసరం లేదు. కష్టపడి పని చేస్తే కింద స్థాయి నుండి పైకి రావచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: చదివింది ఇంటరే.. కానీ 30 ఏళ్లు డాక్టర్‌గా చలామణి.. ఏకంగా రూ.188 కోట్లు స్వాహా!
వ్యాపారం ప్రారంభించేటప్పుడు రిస్క్ తీసుకోవడంపై టీకొట్టు వ్యాపారి యువతకు తనదైన శైలిలో సూచనలు చేశారు. ప్రారంభంలోనే పెద్ద మొత్తంలో డబ్బు పెట్టకుండా చిన్న మొత్తాలతో రిస్క్ తీసుకోవడం నేర్చుకోవాలన్నారు. ‘యువత రూ.10,000, రూ. 20,000, రూ. 50,000 వంటి చిన్న మొత్తాలతో రిస్క్ తీసుకోవడం ప్రారంభించాలి. మహా అయితే ఏమవుతుంది? కొంత నష్టం రావచ్చు. కానీ ఆ చిన్న రిస్క్‌ల వల్ల గొప్ప అనుభవం లభిస్తుంది. వ్యాపారంలో ఆ అనుభవమే అత్యంత కీలకమైనది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
?utm_source=ig_embed&ig_rid=A9_Mzw56LT4I5ky8ZsNWJ7p
Also Read: అయ్య బాబోయ్ డబ్బే డబ్బు.. ఏకంగా రూ. 4 కోట్ల హవాలా మనీ, ఎక్కడి నుంచి ఎక్కడకంటే..