High Paying Jobs Class 12| ప్రపంచాన్ని చుట్టేస్తూ లక్షల్లో జీతం సంపాదించాలనుకునే యువతకు మెర్చంట్ నేవీ మంచి కెరీర్ ఆప్షన్. ఇందులో పనిచేసే అధికారులు ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా చేసే వాణిజ్య నౌకల్లో సేవలు అందిస్తారు. మంచి వేతనం, విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఈ రంగానికి ప్రత్యేక ఆకర్షణ. అయితే క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యం, శారీరక దృఢత్వం తప్పనిసరి. ఈ ఉద్యోగం చేసేవారికి ప్రారంభ వేతనం రూ.1 లక్ష ఉండగా.. నైపుణ్యం, అనుభవంతో త్వరోలనే రూ.10 లక్షల వరకు లభిస్తుంది.
మెర్చంట్ నేవీ అధికారులు సరుకు రవాణా చేసే నౌకలను సురక్షితంగా నడిపే బాధ్యత తీసుకుంటారు. నౌక ప్రయాణం, యంత్రాల నిర్వహణ, సరుకు భద్రత వంటి పనులను పర్యవేక్షిస్తారు.
ఇండియన్ నేవీ.. దేశ రక్షణ కోసం పనిచేస్తే, మెర్చంట్ నేవీ పూర్తిగా వాణిజ్య రంగానికి చెందినది. ఇందులో ప్రధానంగా మూడు రకాల ఆఫీసర్ పోస్టులు ఉంటాయి.
డెక్ ఆఫీసర్లు.. నౌకను నడపడం, మార్గాన్ని నిర్ణయించడం, కార్గో నిర్వహణ, భద్రతను చూసుకుంటారు.
మెరైన్ ఇంజినీర్లు.. ఇంజిన్లు, జనరేటర్లు, ఇతర మెషీన్లను ఆపరేట్, మెయిన్‌టెనెన్స్ చూస్తూ ఉంటారు.
ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్లు.. విద్యుత్ వ్యవస్థలు, ఆటోమేషన్ పరికరాలు, కమ్యూనికేషన్ సిస్టమ్‌లను పర్యవేక్షిస్తారు.
ప్రతి ఒక్కరూ ట్రైనీగా కెరీర్ ప్రారంభిస్తారు. అనుభవం, పరీక్షలు, పనితీరు ఆధారంగా పదోన్నతులు లభిస్తాయి.
డెక్ ఆఫీసర్‌గా చేరిన వారు ట్రైనీ క్యాడెట్, థర్డ్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్, చీఫ్ ఆఫీసర్‌గా ఎదిగి చివరకు కెప్టెన్‌గా మారవచ్చు.
మెరైన్ ఇంజినీర్లు కూడా దశలవారీగా పదోన్నతి పొంది చీఫ్ ఇంజినీర్ స్థాయికి చేరుకుంటారు.
మెర్చంట్ నేవీలో పనిచేయాలంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరం. సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించే సామర్థ్యం ఉండాలి. క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా చాలా ముఖ్యమైనవి. వివిధ దేశాల సిబ్బందితో కలిసి పనిచేసే సామర్థ్యం ఉండాలి.
భారతీయ మెర్చంట్ నేవీ అధికారులు టెక్నాలజీపరంగా ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు కలిగి ఉంటారు. ఇంగ్లీష్‌లో మంచి పట్టు, క్రమశిక్షణ, నైపుణ్యం వల్ల ప్రపంచంలోని ప్రముఖ షిప్పింగ్ కంపెనీలు భారతీయులకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి.
ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (PCM), ఇంగ్లీష్ చదివిన విద్యార్థులు మెర్చంట్ నేవీ ఆఫీసర్ కోర్సులకు అర్హులు.
విద్యాసంస్థలు నిర్ణయించిన కనీస మార్కులతో పాస్ అయి ఉండాలి. వయస్సు, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనలను కూడా పాటించాలి. ఇంటర్ పూర్తి చేసిన వారికి 17 నుంచి 25 ఏళ్ల వయసు పరిమితి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి 28 నుంచి 30 వరకు వయో పరిమితి ఉంది.
కంటి చూపు, కలర్ విజన్, వినికిడి, శారీరక ఆరోగ్యం వంటి పరీక్షల్లో అర్హత సాధించాలి.
కామర్స్, ఆర్ట్స్ విద్యార్థులు సాధారణంగా ఆఫీసర్ ఎంట్రీ కోర్సులకు అర్హులు కారు.
డెక్ ఆఫీసర్ కావాలనుకునే వారు బీఎస్సీ నాటికల్ సైన్స్ లేదా డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (DNS) చేయవచ్చు.
మెరైన్ ఇంజినీర్ కావాలంటే బీఈ లేదా బీటెక్ మెరైన్ ఇంజినీరింగ్ చదవాలి.
ఇప్పటికే ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ (GME) కోర్సు ద్వారా ఈ రంగంలోకి రావచ్చు.
విద్యుత్ వ్యవస్థలపై ఆసక్తి ఉన్నవారు ఎలక్ట్రో టెక్నికల్ ఆఫీసర్ కోర్సును ఎంచుకోవచ్చు.
Also Read: ఆన్‌లైన్ లవర్‌ని తొలిసారి ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నారా? ఈ 8 జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి
మెర్చంట్ నేవీలో కొత్తగా చేరిన అధికారులు కూడా మంచి వేతనం పొందుతారు. చాలా మంది నెలకు రూ.1 లక్షకు పైగా సంపాదించే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ జీతం మరింత పెరుగుతుంది.
ఉచిత వసతి, భోజనం, వైద్య సదుపాయాలు, ప్రయాణ భత్యాలు వంటి ప్రయోజనాలు కూడా కంపెనీలు అందిస్తాయి. కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత ఎక్కువ రోజులు సెలవులు కూడా లభిస్తాయి.
మెర్చంట్ నేవీ ఉద్యోగంలో నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావచ్చు. సముద్రంలో వాతావరణ మార్పులు, అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి ప్రయాణంలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమైనది.
సాహసం, మంచి ఆదాయం, విదేశీ ప్రయాణాలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కోరుకునే వారికి మెర్చంట్ నేవీ అద్భుతమైన కెరీర్. సరైన కోర్సును ఎంపిక చేసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు.