Jurala Water: స్వేచ్చ బ్యూరో: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కలిసొస్తుందని ఆశపడ్డ జూరాల ఆయకట్టు రైతులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ఎల్ నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఆరుతడి పంటలు వేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షభావ పరిస్థితుల వల్ల జూరాల ప్రాజెక్టుకు వరద నీటి రాక దాదాపు నిలిచిపోయింది. ఇటీవల కర్ణాటకలోని ఎగువ జలాశయాల నుంచి జూరాలకు కొంతవరకూ వరద నీరు రావడంతో ఆయకట్టు పరిధిలోని రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటే నీరు విడుదల చేస్తారని భావించి, దుక్కులు దున్ని నారుమడులు పోసుకుని సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా పూర్తి స్థాయిలో నీటిని వదులుతార? వారబందీ పద్ధతి ద్వారా వదులుతార అనేది ప్రశ్నగా మారింది. జూరాలకు వరద ప్రవాహం తగితే ఉన్న నీటిని త్రాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవల్సి వస్తుంది. కనీసం వారబందీ పద్ధతి ద్వారా కాలువలకు సాగునీటిని విడుదల చేసి, మొదటి పంటను కాపాడాలని ఆయకట్టు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటి ప్రవాహాన్ని బట్టే సాగునీటి విడుదల ఆధారపడి ఉంటుందని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం వరద రాక స్వల్పంగా ఉండటం, రాబోయే రోజుల్లో కూడా పెద్దగా వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉన్న నీటిని ప్రాజెక్టులోనే నిల్వ చేసి, కనీసం ఒక పంటకైనా నీరందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టుకు సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: నేషనల్ మీడియా ఇంట్రాక్ట్‌లో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!
ప్రతి ఏటా వరి సాగు చేస్తున్న రైతుకు ప్రస్తుత ఖరీఫ్ లోను వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ బావులు బోర్లపై రైతులు ఆధారపడి పంటను సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రైతుల పొలాలలో బావులు ఉండగా నూతనంగా వారికి అవసరమే నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని బోర్ల తవ్వకానికి ప్రాధాన్యత నిస్తున్నారు.
ఎల్ నినో ప్రభావంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సాగునీటి విడుదలపై నీళ్ల నీడలో కమ్ముకున్న పరిస్థితుల్లో ప్రభుత్వ సూచన మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత క్లస్టర్ల వారిగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు సూచనలు ఇస్తున్నారు. వరికి బదులుగా మినుములు, పెసలు, అలసంద, కంది, ఆముదం వంటి స్వల్ప కాలిక పంటల సాగుతో తక్కువ నీటితో పంటలను పండించవచ్చని రైతులకు సూచిస్తున్నారు.
Also read: కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!