First Time Meeting Online Partner Safety Tips: ప్రస్తుతం సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం ఈ రోజుల్లో సాధారణ విషయమైపోయింది. చాలామంది కొంతకాలం చాట్ చేసిన తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయిస్తారు. ఆ క్షణం ఇద్దరూ చాలా స్పెషల్‌గా భావిస్తారు. అయితే ఈ క్షణం ఎంత ప్రత్యేకమైనదైనా, భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఎన్నో ఘోరమైన నేర సంఘటనలు జరిగిన ఉదాహరణలున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ తొలి రొమాంటిక్ మీటింగ్ సురక్షితంగా, సంతోషంగా ఉంటుంది.
కేవలం చాట్ లేదా ఫోన్ కాల్‌లపై మాత్రమే ఆధారపడకండి. కనీసం ఒకటి లేదా రెండు వీడియో కాల్స్ చేసి మాట్లాడండి. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి నిజమైనవారేనా అనే నమ్మకం పెరుగుతుంది. అలాగే నకిలీ ప్రొఫైల్‌ల ప్రమాదం కూడా తగ్గుతుంది. వారి ప్రవర్తనను ముందుగానే కొంత అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
మొదటి మీటింగ్‌ని ఎప్పుడూ జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోండి. కేఫ్‌లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లేదా పబ్లిక్ పార్కులు సరైన ప్రదేశాలు. ఒంటరి ప్రదేశాలు, హోటల్, లాడ్డ్ లేదా ఇంట్లో కలవడం మొదటి భేటీలో ప్రమాదకరం. పబ్లిక్ ప్రదేశాల్లో ఉంటే మీరు మరింత భద్రంగా ఉంటారు.
మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలవబోతున్నారు అనే వివరాలను కుటుంబ సభ్యులలో ఒకరికి లేదా నమ్మకమైన స్నేహితుడికి ముందుగానే చెప్పండి. అవసరమైతే మీ లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేయండి. ఇది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.
ఆన్‌లైన్‌లో మాట్లాడిన వ్యక్తి నిజ జీవితంలో పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. కొందరు అందమైన ఇతర వ్యక్తుల ప్రొఫెల్ ఫొటోలు పెట్టి మోసం చేసిన సంఘటనలున్నాయి. అందుకే మొదటి భేటీకి ముందు అధిక అంచనాలు పెట్టుకోవద్దు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వండి. సహజంగా సంభాషణ కొనసాగించండి.
మొదటి సమావేశంలోనే మీ సంబంధం గురించి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కమిట్‌మెంట్ ఇవ్వడానికి లేదా భవిష్యత్తు గురించి నిర్ణయించడానికి తొందరపడకండి. నమ్మకం ఏర్పడేందుకు కొంత సమయం అవసరం.
మొదటి భేటీలోనే బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక సమాచారం లేదా పూర్తి ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగత విషయాలను చెప్పకండి. ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాత మాత్రమే అలాంటి వివరాలు పంచుకోవాలి.
వారు మాట్లాడే మాటలకంటే వారి ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం. ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నారు, మీ మాటలకు ఎంత విలువ ఇస్తున్నారు అనేది పరిశీలించండి. గౌరవంగా ప్రవర్తించే వ్యక్తులు సాధారణంగా మంచి సంబంధాలను నిర్మించగలరు.
Also Read: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉండదు.. ఏది ఎంత కాలం నిల్వ చేయాలి?
ఎదుటి వ్యక్తి గురించి మీటింగ్ సమయంలో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీకు అసురక్షితంగా అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడం ఉత్తమ నిర్ణయం. మీ భద్రత ఎప్పుడూ మొదటి ప్రాధాన్యం.
ఆన్‌లైన్‌లో ప్రారంభమైన సంబంధాలు కూడా బలంగా మారవచ్చు. అయితే అందుకు పరస్పర గౌరవం, నిజాయితీ, ఓర్పు అవసరం. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు సమయం ఇవ్వండి. తొందరపాటు నిర్ణయాల కంటే నెమ్మదిగా ముందుకు వెళ్లడం మంచిది.