High Salary Tech Career| టెక్నాలజీ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కృత్రిమ మేధస్సు (AI) కొత్త అవకాశాలను తీసుకొస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు మంచి జీతాలు అందించే మరో ప్రత్యేకమైన కెరీర్ అందుబాటులోకి వస్తోంది. అదే ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీరింగ్ (Forward Deployed Engineering). ఈ రంగంలో అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారు ఏడాదికి రూ. 40 లక్షల నుంచి రూ. కోటి వరకు సంపాదిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అసలు ఈ ఉద్యోగం ఏమిటి? ఇందులో ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఉద్యోగాలకు డిమాండ్ ఎలా ఉండబోతోంది? తెలుసుకుందాం.
ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్, ఏఐ టెక్నాలజీని వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడంలో కీలక పాత్ర పోషిస్తారు. కంపెనీల సమస్యలను అర్థం చేసుకుని, వాటికి తగిన టెక్నాలజీ పరిష్కారాలను రూపొందిస్తారు. సాధారణంగా కోడింగ్ చేయడమే కాకుండా, పరిష్కారాలను పరీక్షించడం, అమలు చేయడం, వాస్తవ పరిస్థితుల్లో సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడం కూడా వీరి బాధ్యతల్లో భాగం. కస్టమర్లతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవాలి.
స్కేలర్ (Scaler), సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) కలిసి India’s FDE Opportunity పేరుతో ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ నివేదికలో ఉద్యోగ అవకాశాలు, జీతాలు, నైపుణ్యాల అవసరాలను విశ్లేషించాయి. ఈ అధ్యయనం కోసం 1,000 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, 200 మంది సంస్థల టెక్నాలజీ నిర్ణయాధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఎనిమిది ప్రధాన నగరాలతో పాటు కొన్ని టైర్ – 2 నగరాలను కూడా పరిశీలించారు.
నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీరింగ్ స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతుందని 88 శాతం భారతీయ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం కేవలం ఒక శాతం ఇంజినీర్లు మాత్రమే అధికారికంగా ఈ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? హాస్పిటల్ బిల్స్ ఈఎంఐలో చెల్లించవచ్చు.. ఎలాగంటే?
ఈ రంగంలో రాణించాలంటే కోడింగ్ ఒక్కటే సరిపోదు. ఏఐ పరిజ్ఞానం, సాఫ్ట్‌వేర్‌ను అమలు చేసే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు అవసరం. అలాగే కస్టమర్లతో మాట్లాడటం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, సాంకేతిక పరిష్కారాలను వివరించడం కూడా ముఖ్యం. నివేదిక ప్రకారం.. కంపెనీలు కోడింగ్ నైపుణ్యాల కంటే డిప్లాయ్‌మెంట్ నైపుణ్యాలను పరీక్షించే అవకాశం రెండింతలు ఎక్కువగా ఉంది.
నివేదిక ప్రకారం.. అధికారికంగా ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ ఉద్యోగాల్లో ఉన్నవారిలో 80 శాతం మంది ఏడాదికి రూ. 40 లక్షల నుంచి రూ. కోటి వరకు సంపాదిస్తున్నారు. అయితే, ఈ జీతాలు ఇప్పటికే ఆ ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారికి సంబంధించినవి. కొత్తగా కెరీర్ ప్రారంభించే ప్రతి ఒక్కరికీ ఇంత జీతం వస్తుందని చెప్పలేం.
Also Read: ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలు నివారించడానికి ఇలా చేయండి
ఏఐ, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, వ్యాపార సమస్యల పరిష్కారంపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగాన్ని పరిశీలించవచ్చు. సంబంధిత నైపుణ్యాలను పెంచుకోవడం, ప్రాజెక్టులపై ప్రత్యక్ష అనుభవం సంపాదించడం ఉపయోగపడుతుంది.
ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ, టెక్నికల్ సొల్యూషన్స్‌ని రియల్ టైమ్‌లో అమలు చేయగల నిపుణులకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.