పండగ సీజన్లో పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. ద్రవ్యోల్బణం భయాలతో పసిడికి డిమాండ్ తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్ పతనం అవుతోంది. ప్రస్తుతం పది గ్రాముల మేలిమి బంగారం లక్షా 47 వేల రూపాయలకు దిగొచ్చింది. ఇక వెండి ధర 2 లక్షలా 6 వేల దగ్గర ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్‌లో అయితే 10 గ్రాముల ధర లక్షా 44 వేలకు పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఇవాళ 4089 డాలర్లకు తగ్గింది. దాదాపు వారం రోజుల కనిష్టానికి ఏరింది. వెండి కూడా ఔన్సు ధర 56 డాలర్లకు చేరింది. పశ్చిమాసియా ఘర్షణలతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 110 డాలర్ల పైకి చేరింది. సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థపై హుతీల దాడులు కంటిన్యూ అవుతున్నాయి. చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం భయాలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు పతనం కావడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Also Read: భారీగా పెరిగిన సోనా మసూరి, బీపీటీ బియ్యం ధరలు.. క్వింటల్ ఎంతో తెలుసా?
మరోవైపు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చనే అంచనాలున్నాయి. దీంతో వడ్డీరేట్లు పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. వచ్చేవారం అమెరికా ఫెడ్ వడ్డీరేట్లపై ప్రకటన వస్తుంది. ఈ నేపథ్యంలో రాబడులు లేని బంగారం కంటే, ఇతర పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఇటీవల RBI తీసుకున్న నిర్ణయాలతో రూపాయి బలపడం కూడా బంగారంపై ప్రభావం చూపిస్తోంది. ఆభరణాల బంగారం కొనుగోళ్లు కూడా ఇటీవల బాగా తగ్గాయి. ఓవరాల్‌గా పసిడి ధరల్లో మరికొంత పతనం కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ పండితులు.