Hyderabad to Tirupati Bus: వినాయక చవితి సమీపిస్తున్న వేళ భక్తులకు శుభవార్తను అందించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచింది. తిరుపతి మార్గంలో నడిచే లహరి, రాజధాని ఏసీ బస్సుల టిక్కెట్ ధరలపై 10 శాతం తగ్గింపు, సూపర్ లగ్జరీ బస్సులపై 15 శాతం రాయితీని అందిస్తోంది. ఇంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, నెల్లూరు, విశాఖపట్నం వంటి ఇతర ముఖ్య నగరాలకు వెళ్లే బస్సులపైనా ఈ రాయితీలు వర్తించనున్నాయి. లహరి నాన్ ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15 శాతం, లహరి ఏసీ, రాజధాని ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపుతో ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గే అవకాశం లభిస్తోంది.
ఆన్‌లైన్ సమాచారం ఆధారంగా.. హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్సు షెడ్యూల్
హైదరాబాద్ నుంచి తిరుపతికి రోజూ 23 నుండి 30 వరకు బస్సులు నడుస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకు మొదటి బస్సు బయలుదేరగా, రాత్రి ఎనిమిదిగంటల వరకు చివరి బస్సు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయం 10 నుంచి 13 గంటలన్నర వరకు పడుతుంది. బస్సు రకాల విషయానికి వస్తే, సూపర్ లగ్జరీ నాన్ ఏసీ పుష్‌బ్యాక్ సీట్లు ₹732 నుంచి ₹860 వరకు ఉండగా, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ధరలు ₹784 నుంచి ₹1200 మధ్య ఉంటాయి. రాజధాని ఏసీ సెమీ స్లీపర్ ధరలు ₹776 నుంచి ₹998 వరకు ఉంటాయి.
Also Read: Google App Changes: ఫోన్‌లో డయలర్ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి
హైదరాబాద్- తిరుపతికి బోర్డింగ్- డ్రాపింగ్ పాయింట్లు :
హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, అఫ్జల్‌గంజ్, కాచిగూడ, అమీర్‌పేట్, హబ్సిగూడ, ఈసీఐఎల్, షంషాబాద్, మౌళా అలీ, నిజాంపేట్ వంటి ప్రధాన ప్రదేశాల్లో ఎక్కే అవకాశం కల్పించగా, తిరుపతిలో బస్‌స్టాండ్‌తో పాటు కరకంబాడి, ఆర్టీవో ఆఫీస్, మంగళం, లీలామహల్ సెంటర్ వంటి ప్రదేశాల్లో దిగే సౌకర్యం ఉంది.
టీటీడీ స్పెషల్ దర్శనం
టీజీఎస్‌ఆర్టీసీ ప్రతిరోజూ సుమారు వెయ్యి ప్రత్యేక దర్శన టిక్కెట్లను అందిస్తోంది. ఒక్కొక్కటి ₹300 ధర కలిగిన ఈ టిక్కెట్లు అబ్బీబస్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. బస్సు టిక్కెట్‌తో పాటు దర్శన టిక్కెట్‌ను కూడా రిజర్వ్ చేసుకోవచ్చన్నది ప్రత్యేకత.
బుకింగ్ సమాచారం
టిక్కెట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in లో రెడ్‌బస్, అబ్బీబస్, మేక్‌మైట్రిప్, గోయిబిబో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లను ఉపయోగించవచ్చు. రాయితీలు పొందడానికి రెడ్‌బస్‌లో TGSRTC లేదా TGSRTC10 వంటి ప్రోమో కోడ్‌లను వాడితే 5 నుంచి 25 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఖచ్చితమైన సమాచారం కోసం టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ (040-69440000, 040-23450033) ను సంప్రదించాలి.