Lord Vinayaka – Moon: సకల దేవతలకు నాయకుడు గణపతి. అందుకే ఎవరు ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని ఆరాధిస్తారు. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టి రచనకు ముందు గణపతిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి వినాయకుడి జన్మదినమైన భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితిగా జరుపుకుంటారు.సాధారణంగా ఈ పండుగ చాంద్రమానంలోని ఆరో నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ప్రత్యేకమైన స్థానాల్లో ఉండడం వల్ల భూమిపై పడే చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్మకం. అది మానసిక ఆరోగ్యాన్నికూడా ప్రభావితం చేస్తుందని భావిస్తారు. అందుకే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని అంటారు.
ఆ..చంద్రుడిని ఎందుకు చూడకూడదు?
ఈ పండుగకు సంబంధించి ఒక విశేష నమ్మకం ఉంది. అదేమిటంటే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని. ఎందుకంటే ఆ రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయని, ఒకవేళ చంద్రున్ని చూస్తే తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్వసిస్తారు. ఈ నమ్మకానికి కారణం మన పురాణాల్లో చెప్పబడిన ఒక కథ.
పురాణ నేపథ్యం
భాద్రపద శుద్ధ చవితిన వినాయకుడు కడుపునిండా భోజనం చేసి తన తల్లిదండ్రులైన శివ,పార్వతుల వద్దకు నమస్కరించడానికి వెళ్తాడు. అయితే పొట్ట నిండిపోవడంతో పాదాలకు నమస్కరించలేక ఇబ్బంది పడతాడు. ఈ దృశ్యం చూసి చంద్రుడు హేళనగా నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి శపిస్తూ నిన్ను చూసిన వారందరూ పాపాత్ములై నీలాపనిందలకు గురవుతారు అని శపిస్తుంది. ఆ శాపం కారణంగానే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడటం అశుభంగా భావిస్తారు.
శ్రీకృష్ణుడి అనుభవం
ఈ శాపం ప్రభావం వల్లే సాక్షాత్తు శ్రీకృష్ణుడుకూడా శమంతకమణి దొంగిలించాడని అపవాదుకు గురయ్యాడు. దాంతో దేవతలందరూ పార్వతీదేవిని వేడుకొని శాపాన్ని తగ్గించమని ప్రార్థించారు. అప్పుడు ఆమె శాపాన్ని పూర్తిగా తొలగించకుండా, ప్రతి రోజూ కాదు.. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన వారికే నిందలు వస్తాయని శాపాన్ని కొంతవరకు సడలించింది.
దోష పరిహారం
ఒకవేళ ఎవరికైనా పొరపాటున వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినట్లయితే ఈ పరిహారాలు చేస్తే నీలాపనిందల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు ఆ రోజున ఉపవాసం ఉండి వినాయక చవితి వ్రతకథను పఠించడం, వ్రతకథ అక్షతలను తలపై వేసుకోవడం, “సింహః ప్రసేనమవదీ, సింహో జాంబవతా హతః, సుకుమారక మాలోదిః, తవ హ్యేష శ్యమంతకః” అనే శ్లోకాన్ని నిర్మల హృదయంతో జపించడం. ఈ విధంగా చేస్తే అపవాదులు తొలగిపోతాయని, దోషం నివారణ అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
వినాయక చవితి రోజు ఇలా అస్సలు చేయకండి
* ఒకే ఇంట్లో రెండు గణపతి విగ్రహాలను ప్రతిష్టించకూడదు.
* నలుపు, నీలం రంగు దుస్తులు ధరించి గణపతిని పూజించకూడదు.
* గణపతి పూజ చేసి ఉపవాసం ఉన్నవారు ఆ రోజున శారీరక సంబంధాలలో పాల్గొనరాదు.
* గణపతి వాహనం ఎలుక కావడంతో, ఆ రోజున ఎలుకలను చంపకూడదు.
* పూజ పూర్తయ్యే వరకు చంద్రుణ్ణి చూడకూడదు.