Google App Changes: మనందరం రోజూ వాడే స్మార్ట్‌ఫోన్‌లో చిన్న చిన్న మార్పులు వచ్చినా వెంటనే గుర్తిస్తాం. ముఖ్యంగా ఫోన్‌లో ఎక్కువగా వాడే డయలర్ స్క్రీన్ ఒక్కసారిగా కొత్తగా మారిపోతే? ఎవరికైనా షాక్ కొట్టినట్టే ఉంటుంది. ఇటీవల చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఫోన్ డయలర్ కొత్త రూపంలో కనిపించడంతో కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొందరికి “ఫోన్‌లో ఏదైనా సమస్య జరిగిందా?” అన్న సందేహం కలిగింది. అసలేం జరిగింది? ఎందుకు ఈ మార్పు వచ్చింది?
గూగుల్ కొత్త డిజైన్ ఎందుకు మార్చారు..
గూగుల్ తాజాగా తన ఫోన్ యాప్‌కి తీసుకొచ్చిన “మెటీరియల్ 3 ఎక్స్‌ప్రెసివ్ రీడిజైన్”. ఈ కొత్త రూపకల్పన ప్రస్తుతం దశలవారీగా అన్ని సపోర్ట్ చేసే డివైజ్‌లకు అందుతోంది. ఇంటర్‌ఫేస్‌ను మరింత కొత్తగా, వినియోగదారులకు సులభంగా మార్చే విధంగా గూగుల్ ఈ కొత్త డిజైన్‌ను రూపొందించింది. ఇంతకుముందు వేర్వేరుగా ఉన్న ఫేవరెట్స్, రీసెంట్స్ ట్యాబ్‌లను ఇప్పుడు ఒకే చోట చేర్చారు. దీంతో కాల్ హిస్టరీతో పాటు టాప్ కాంటాక్ట్స్‌ను కారౌజెల్ రూపంలో తక్షణమే చూడగలుగుతున్నారు. పాత ఫ్లోటింగ్ బటన్ స్టైల్‌కి బదులుగా, ఇప్పుడు ప్రత్యేక ట్యాబ్‌గా రౌండెడ్ డిజైన్‌తో కనిపించే కీప్యాడ్‌ను అందించారు. అలాగే సెర్చ్ ఫీల్డ్ దగ్గర కొత్త నావిగేషన్ డ్రాయర్ జోడించారు.
Also Read:Ganesha lorry stuck: ఫ్లైఓవర్ కింద ఇరుక్కుపోయిన గణేశుడి లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..
దీని ద్వారా కాంటాక్ట్స్, సెట్టింగ్స్, కాల్ హిస్టరీ, హెల్ప్ వంటి ఆప్షన్లు మరింత సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇక ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్ కూడా పూర్తిగా మారింది. కాల్స్ రిసీవ్ చేయడం లేదా క్యాన్సల్ ఇప్పటి నుంచి హారిజంటల్ స్వైప్‌తో గానీ, సింగిల్ ట్యాప్‌తో గానీ చేయవచ్చు. యూజర్లు తమకు నచ్చిన విధంగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎలా రిసీవ్ చేయాలి, ఎలా క్యాన్సిల్ చేయాలి ఆప్షన్‌లో మార్పులు చేసుకోవచ్చు. ఇన్‌కాల్ ఇంటర్‌ఫేస్‌లో కూడా కొత్తదనం కనిపిస్తోంది. కాల్‌లో ఉండగా కనిపించే బటన్‌లు ఇప్పుడు గుండ్రంగా, ఎంచుకున్నప్పుడు పెద్దవిగా మారుతాయి. అలాగే ఎండ్ కాల్ బటన్ మరింత పెద్దదిగా చేసి, సులభంగా కనిపించేలా చేశారు.
పాత పద్దతి కొనసాగించాలంటే ఇలా చేయండి
పాత డిజైన్‌నే వాడాలనుకునే వారికి కూడా మార్గం ఉంది. యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్‌డేట్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసుకుంటే మళ్లీ పాత రూపానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఈ కొత్త రూపంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కొందరికి ఇప్పుడ వచ్చిన కొత్త లుక్ నచ్చుతుంటే, మరి కొందరికి ఇది అవసరమా అనే విమర్శలు వస్తున్నాయి. అందుకే గూగుల్ కొత్త పద్దతి నచ్చకపోతే పాత పద్దతినే కొనసాగించేలా ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. దీనిని ఉపయోగించి ఫోన్‌లో సెట్టింగ్ చేసుకుంటే మీ ఫోన్ పాత పద్దతినే కొనసాగించవచ్చు.