Mahaganapathi: ఆలయం అంటే గర్భగుడి మస్ట్. కానీ ఇక్కడ సాంప్రదాయాలకు భిన్నంగా ఎలాంటి గర్భగుడి లేకుండానే అందరికి దర్శనమిస్తున్నాడు వినాయకుడు. అయితే దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. మరి ఆ గణనాథుడికి గుడిలో ఉండటం ఇష్టం లేదా? అక్కడి ప్రకృతి రమణీయతను నిత్యం ఆస్వాదించాలనుకున్నాడా?
ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా వినాయకుడి దర్శనం..
ఏ ఆలయమైనా.. ఏ దేవుడైనా గర్భగుడి మస్ట్. కానీ గర్భగుడి లేకుండానే ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు గణనాథుడు. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. సంప్రదాయబద్ధంగా ఇక్కడ గర్భగుడి అనేది ఉండదు. చుట్టు ప్రకృతి రమణీయతలో అలరారుతూ.. ఎలాంటి గోడల అడ్డంకులు లేకుండా అందరికి దర్శనమిస్తాడు ఇక్కడ గణనాథుడు. ఇది చాలా అరుదైన దృశ్యంగా.. చాలా ప్రత్యేకంగా భావిస్తారు కూడా. ఈ ఆలయానికి ఎలాంటి నియమాలు ఉండవు.. భక్తులు ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా వెళ్లి వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఆలయం మూసేయడం లేదా తెరిచే ఉండటం వంటివి ఉండవు.
గణపతికి గర్భగుడి ఇష్టం లేదనే సంకేతం..
దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలోని కోక్కడ్ ప్రాంతంలో ఉన్న సౌతడ్క మహాగణపతి గర్భగుడి లేకుండా ఉండేందుకు ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా, అతని నాగలి ఒక రాయికి తగిలింది. దానిని బయటకు తీసి చూస్తే, అది గణపతి విగ్రహమని తేలింది. తమకు దొరికిన విగ్రహానికి ఆలయం నిర్మించడానికి ప్రయత్నించగా.. అది సాధ్యం కాలేదట. వారు ఎప్పుడు గుడి కట్టడానికి ప్రయత్నించినా, ఏ రాత్రికి ఆ రాత్రి గోడలు కూలిపోయేవని స్థల పురాణం చెబుతోంది. దీంతో గణపతికి గర్భగుడి ఇష్టం లేదని సంకేతంగా భావించి, అప్పటి నుండి ఆయనను అలాగే బయట, ప్రకృతి మధ్యలో ఉంచేసారు.
ధ్వంసమైన ఆలయంలోని విగ్రహాన్ని తీసుకెళ్లిన గోప బాలురు..
మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దాదాపు 800 ఏళ్ల క్రితం ఇక్కడ ఓ ఆలయం ఉండేదని.. కానీ అక్కడి రాజు పదవీ పోవడంతో ఆలయం ధ్వంసమైందంటారు. ఆ తర్వాత ధ్వంసమైన ఆ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని కొందరు గోప బాలురు చూసి అక్కడి నుంచి తీసుకెళ్లి ఓ చెట్టు కింద ఉంచారని చెబుతారు. అయితే ఇలా ఉన్న విగ్రహానికి ఓ ఆలయాన్ని నిర్మించే ప్రయత్నం జరిగింది. కానీ ఓ గోప బాలుడు కలలోకి వచ్చి కాశీ విశ్వనాథుడికి కనిపించేంత ఎత్తులో ఉండే గోపురాన్ని నిర్మించాలని ఆదేశించాడంటారు. అది అసాధ్యమని భావించిన ఓ భక్తుడు.. స్వామి వారికి ప్రకృతిలో ఉండటమే ఇష్టమని భావించి.. నిర్మాణ పనులను ఉపసంహరించుకున్నారు.
ఇక్కడ గణనాథుడికి గణేశుడికి ఎలాంటి వేషధారణ లేదు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ వాస్తుశిల్పం, శిల్పకళకు అనుగుణంగా ఆలయాలను నిర్మించడం ఆనవాయితీ. అంతేకాదు తూర్పు ముఖంగా దేవుని విగ్రహాలను ప్రతిష్టించే పురాతన సంప్రదాయం కూడా ఉంది. కానీ ఈ ప్రదేశం గురించి ప్రత్యేకత ఏమిటంటే గౌతమ గణేశుడు ఆలయంలో ఈ సంప్రదాయాలను పాటించలేదు. ఆగ్నేయం వైపు, ప్రకృతి అందమైన ప్రదేశంలో బహిరంగ ప్రదేశంలో ఆలయం ఉంటుంది.
మానసిక ప్రశాంతతకు నెలవుగా ఆలయం
సౌతడ్క గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటే.. కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ముఖ్యంగా ముడుపులు కట్టడమనే ఒక ఆచారం ఉంది. ఈ ఆలయం భౌతికంగా మాత్రమే కాకుండా, మానసికంగా కూడా ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడ పూజా సామగ్రి వంటివి ఉండవు. కేవలం ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు గణపతిని ప్రార్థిస్తారు. ఇది ప్రకృతితో మమేకమైన దైవారాధనను సూచిస్తుంది. అంతేకాదు ఇక్కడ వినాయకుడు సాధారణంగా కనిపించే విధంగా నాలుగు చేతులతో కాకుండా, రెండు చేతులతో ఉంటాడు. ఈ రూపం చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఆలయంలో ఆనవాయితీగా గంటలు సమర్పించడం
ఈ ఆలయంలో గంటలు సమర్పించడం ఓ నమ్మకం. దీనిని ఓ ప్రత్యేక సేవగా భావిస్తారు భక్తులు. ప్రతిరోజు కొన్ని వందల గంటలు ఆ ఆలయంలో స్వామివారికి సమర్పిస్తారు. అతి చిన్న గంటల నుంచి 100 కిలోల వరకు బరువున్న అతిపెద్ద గంటల వరకుఆలయానికి నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయానికి వచ్చి గంటలను అంకితం చేస్తారు. ప్రతి ఏటా 11 టన్నుల గంటలు ఆలయానికి వస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రాంతానికి సౌతడ్క అని పేరు రావడం వెనక కూడా ఓ కథ ఉంటి. పశువులు మేపే పిల్లలు తమ వద్ద ఉన్న ఆహారాన్ని గణనాథుడికి నైవేద్యంగా ఉంచేవారు. సౌతా అనేది ఓ తిండి పదార్థం కాగా.. అడ్క అంటే మైదానం. అలా ఈ ప్రాంతానికి సౌతడ్క అని పేరు పెట్టారని చెబుతారు.
10 వేల మంత్రాలతో అథర్వశీర్ష హవనం
ఈ ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, శుభకార్యాలు జరుగుతాయి. వేలాది మంది భక్తులు వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటారు. భక్తితో గణేశుడిని ప్రార్థిస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.ప్రశాంతమైన వాతావరణంతో ఉన్న ఈ ఆలయం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ గణపతి సమక్షంలో 10 వేల మంత్రాలతో అథర్వశీర్ష హవనాన్ని నిర్వహిస్తారు. దీని ద్వారా సంపద కోరుకునే వారికి సంపదను, పిల్లలను కోరుకునే వారికి సంతానం ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఈ ఆలయం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల నుంచి సుబ్రహ్మణ్యానికి వెళ్ళే మార్గంలో కోక్కడ్ సమీపంలో ఉంది. ధర్మస్థల నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు, మంగళూరు లేదా ధర్మస్థలకు బస్సు లేదా రైలులో ప్రయాణించి సౌతడ్క ఆలయానికి చేరుకోవచ్చు.