
Lunar Eclipse 2023 : కుమార పౌర్ణమి పురస్కరించుకుని శనివారం అర్థరాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణం కారణంగా దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ మూతపడనున్నాయి.అక్టోబరు 28 అర్ధరాత్రి చంద్రుడు.. భూమి నీడ యొక్క మసకబారిన వెలుపలి భాగం పెనుంబ్రాలోకి ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 29న అర్ధరాత్రి ఒంటిగంట ఐదు నిమిషాలకు ప్రారంభమై.. రెండు గంటల ఇరువై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం సుమారు 1 గంట 19 నిమిషాల పాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
అక్టోబర్ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి.. అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయం మూతపడనుంది. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరువై నాలుగు నిమిషాల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.
చంద్రగ్రహణం కారణంగా.. తిరుమలలో అర్జిత సేవలను కూడా రద్దు చేశారు అధికారులు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదని టీటీడీ తెలిపింది. అదేవిధంగా.. అక్టోబర్ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాలను గమనించి అసౌకర్యానికి గురికాకుండా తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.
మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం కూడా చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 4:00 నుండి రేపు ఉదయం 5 గంటల వరకు స్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో వెల్లడించారు. చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం వేళలో స్వామివారికి నిర్వహించు కైంకర్యాలు,దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఒక్క ఆలయం మూతపడదు
చంద్రగ్రహణం కారణంగా దేశంలోని అన్ని ఆలయాలను మూసివేస్తారు. కానీ.. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుంది. ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తారు. భక్తులు స్వామివారికి మౌనప్రార్థనలు చేస్తారు. గ్రహణం పూర్తయ్యాక ముగ్గురు మూర్తులకు మహాస్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయని శ్రీక్షేత్ర సేవల విభాగ సంచాలకుడు రవీంద్ర సాహు వెల్లడించారు.
చంద్రగ్రహణం వేళలు
గ్రహణ స్పర్శకాలం – శనివారం రాత్రి 01.05 గంటలకు
నిమలన కాలం – రాత్రి 01.24 గంటలకు
మధ్యకాలం (పట్టు) – రాత్రి 1.44 గంటలకు
ఉన్మీలన కాలం (విడుపు) – రాత్రి 02.01 గంటలకు
మోక్షకాలం – రాత్రి 02.22 గంటలకు
గ్రహణ స్నానాలు – 2.30 గంటలకు
ఈ రాశులవారు గ్రహణం చూడకూడదు
మేషం, కర్కాటకం, సింహ రాశుల వారు, అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణం చూడకూడదని పండితులు తెలిపారు. కుమార పౌర్ణమి సందర్భంగా పూజలు, వ్రతాలు, నోములు చేసుకునేవారు మధ్యాహ్నం 3.30 గంటల్లోగా పూర్తి చేయాలని, 4 గంటల్లోగా ఆహారం తినాలని, ఆ తర్వాతి నుంచి గ్రహణ కాలం ముగిసేంత వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకూడదని వివరించారు. ఈ గ్రహణం వల్ల పైన తెలిపిన మూడు రాశులు, అశ్వినీ నక్షత్రం వారు మినహా మిగతా 9 రాశులవారికి శుభఫలితాలుంటాయని చెబుతున్నారు.