Karthika Pornami 2025: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని కార్తీక పూర్ణిమ లేదా త్రిపురారి పూర్ణిమ అని అంటారు. ఇది సాధారణ పౌర్ణమి కంటే విశేషమైనదిగా.. మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినంగా చెబుతారు. కార్తీక పూర్ణిమ యొక్క విశిష్టత, చరిత్ర , పాటించాల్సిన ఆచారాల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. పౌరాణిక నేపథ్యం, పేర్లు:
కార్తీక పూర్ణిమకు అనేక పురాణ గాథలు ముడిపడి ఉన్నాయి.
త్రిపురారి పూర్ణిమ: తారకాసురుడి ముగ్గురు కుమారులు (త్రిపురాసురులు) తమకు లభించిన వరంతో ముల్లోకాలలో కల్లోలం సృష్టిస్తుండగా.. పరమశివుడు వారిని సంహరించిన రోజు ఇదే. అందుకే ఈ రోజును త్రిపుర పూర్ణిమ లేదా త్రిపురారి పూర్ణిమ అని అంటారు. ఈ విజయాన్ని దేవతలు ఆనందంతో దీపాలు వెలిగించి ‘దేవ దీపావళి’గా జరుపుకున్నారు.
మత్స్యావతారం: శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారాన్ని (చేప రూపం) ఈ పౌర్ణమి రోజునే ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఇది విష్ణుమూర్తి ఆరాధనకు కూడా అత్యంత శ్రేష్ఠమైనది.
తులసి జన్మదినం: ఈ పవిత్రమైన రోజునే తులసి మాత భూమిపై జన్మించిందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారంగా చెబుతారు.
గురు నానక్ జయంతి: సిక్కుల మత స్థాపకుడైన గురు నానక్ దేవ్ జీ జన్మదినాన్ని కూడా ఈరోజే జరుపుకుంటారు.
2. ఆచారాలు, వాటి ఫలితాలు:
కార్తీక పూర్ణిమ నాడు ఆచరించే ప్రతి ఆచారానికి విశేషమైన ఫలితం ఉంటుంది.
పవిత్ర స్నానం : ఈ రోజున గంగా, యమునా, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం లేదా స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేయడం వల్ల తెలిసీ తెలియక చేసిన సకల పాపాలు తొలగిపోతాయని అంతే కాకుండా మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
దీపారాధన, దీపదానం: సంవత్సరమంతా దీపం వెలిగించలేని వారు కార్తీక పూర్ణిమ రోజున ఆలయాలలో లేదా తులసి కోట వద్ద 365 వత్తులతో దీపం వెలిగిస్తే.. సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం దక్కుతుంది. నదులు, కొలనుల ఒడ్డున దీపాలను వదలడం (దీపదానం) వల్ల జీవితంలోని చీకట్లు తొలగిపోయి వెలుగు వస్తుందని ప్రతీతి.
Also Read: 365 వత్తుల దీపం.. వెనక దాగి ఉన్న అంతరార్థం ఏంటి ?
దానధర్మాలు: ఈ రోజున పేదలకు, బ్రాహ్మణులకు ధాన్యాలు, వస్త్రాలు, ఆహారం దానం చేయడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఉసిరికాయలు దానం చేయడం లక్ష్మీకటాక్షాన్ని కలిగిస్తుంది.
జ్వాలాతోరణం: శివాలయాలలో జ్వాలాతోరణం వెలిగించి, దాని కింద నుంచి వెళ్లడం వల్ల సర్వ పాపాలు దహనం అవుతాయని, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.
కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం: కార్తీక పూర్ణిమ రోజున కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల శుభాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.
కార్తీక పూర్ణిమ కేవలం ఒక పండగ మాత్రమే కాదు, శివకేశవుల ఆశీస్సులు పొందడానికి, పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఒక గొప్ప అవకాశం. ఈ పవిత్ర దినాన భక్తి శ్రద్ధలతో పూజలు, దీపారాధన చేయడం ద్వారా అంతులేని శుభఫలాలను పొందవచ్చు.