Jubilee hills elections: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యూసఫ్‌గూడలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నవీన్ యాదవ్ గెలిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరం స్వయంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తీసుకుంటామని, ముఖ్యంగా యూసఫ్‌గూడ డివిజన్‌ను ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నియోజకవర్గంలో 2,40,000 మందికి తొలిసారిగా ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం అందిస్తోందని గుర్తు చేశారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 14,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మైనారిటీ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, దేశంలో బీజేపీని, నరేంద్ర మోదీని ఓడించగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి మాత్రమే ఉందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిజెపితో కుమ్మక్కైందని, వారి పాలనలో 80% మైనారిటీ కళాశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కోసం 2002 ఇంజనీరింగ్ సీట్లు, ఒక లా కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీని మంజూరు చేసిందని తెలిపారు.
ముస్లింలకు 12% రిజర్వేషన్లంటూ బిఆర్‌ఎస్ మోసం చేసిందని, కాంగ్రెస్ ఇచ్చిన 4% రిజర్వేషన్ల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టులో సైతం పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూసఫ్‌గూడ బిడ్డ అయిన నవీన్ యాదవ్‌కు ఈ డివిజన్ నుండి భారీ మెజారిటీ అందించాలని, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.