EPFO Withdrawal: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించే పొదుపు పథకం. ఈ స్కీమ్ ను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ ఒక నిర్దిష్ట మొత్తాన్ని (బేసిక్ సాలరీలో 12%) పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం లేదా ఉద్యోగాలు కోల్పోతే లేదా ఆరోగ్య సంరక్షణ, వివాహం లేదా ఇతర కారణాల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. అయితే ఇటీవల ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం పీఎఫ్ విత్ డ్రాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అక్టోబర్ 13న జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పీఎఫ్ పాక్షిక విత్ డ్రా నిబంధనలను సరళీకృతం చేయడానికి 13 నిబంధనలను విలీనం చేయాలని నిర్ణయించారు. వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. ముఖ్యమైన అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులుగా వర్గీకరించారు. పాక్షిక విత్ డ్రా సంఖ్యను, ఉపసంహరణల మొత్తాన్ని పెంచారు. విద్యకు సంబంధించి విత్ డ్రాను 10 రెట్లు, వివాహం కోసం 5 రెట్లు పెంచారు.
పాక్షిక విత్ డ్రా నియమాల సడలింపుపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, పూర్తి విత్ డ్రాపై నిబంధనల సడలింపుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకూ రెండు నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉంటే పూర్తి పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ కాలాన్ని రెండు నెలల నుంచి 12 నెలలకు పెంచారు. ఫైనల్ సెటిల్మెంట్ ను రెండు నెలల నుంచి 36 నెలలకు పెంచారు. ఉద్యోగం కోల్పోయినా, పదవీ వివరణ చేసిన వారు తమ సొంత పొదుపు మొత్తాలను పొందేందుకు చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీతంపై ఆధారపడే వారికి, పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులను తక్షణమే ఎదుర్కొనేందుకు పీఎఫ్ పొదుపు సొమ్ము ఉపయోగపడడంలేదని నిపుణులు అంటున్నారు.
పీఎఫ్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ పై ఈపీఎఫ్ఓ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వరకు ఎప్పుడూ పీఎఫ్ ఖాతాలో 25% కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధన విధించారు. ఈ కనీస బ్యాలెన్స్ పై అధిక వడ్డీ(8.25 శాతం) కల్పించినప్పటికీ 25 శాతం లాక్ ఇన్ పీరియడ్ తప్పుదారి పట్టించడమేనని అంటున్నారు. 55 ఏళ్ల సర్వీస్ తర్వాత పదవీ విరమణ, శాశ్వత వైకల్యం, తొలగింపు, స్వచ్ఛంద పదవీ విరమణ లేదా శాశ్వతంగా దేశాన్ని విడిచి వెళ్లడం వంటి కొన్ని కారణాలతో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ (కనీస బ్యాలెన్స్ 25%తో సహా) పూర్తిగా విత్ డ్రా చేసుకోవచ్చు.
Also Read: Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా
మీరు ఉద్యోగాన్ని కోల్పోతే పీఎఫ్ డబ్బులో మొదటిగా 75 శాతం విత్ డ్రా చేసుకోగలుగుతారు. మిగిలిన 25% 12 నెలలు నిరంతరం నిరుద్యోగిగా ఉంటేనే విత్ డ్రా చేసుకోగలుగుతారు. ఈపీఎఫ్ఓ వ్యక్తిగత పొదుపు ఖాతా అని, అందులోని నిధుల వినియోగం పూర్తిగా వ్యక్తిగత అంశాలపై ఆధారపడి ఉండాలని నిపుణులు అంటున్నారు. పాక్షిత విత్ డ్రా మధ్యతరగతి వారిపై ప్రభావం చూపుతుందంటున్నారు.