Chicken Fry: చికెన్ ఫ్రై అంటే ఇష్టపడని వారుండరు. బయట తినే ఫ్రై కంటే ఇంట్లోనే తక్కువ నూనెతో.. శుభ్రంగా, రుచికరంగా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. అన్నంతో సైడ్ డిష్‌గా ఈ చికెన్ ఫ్రై అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో.. తక్కువ మసాలాతో ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
చికెన్ (చిన్న ముక్కలుగా కట్ చేసింది)-500 గ్రాములు
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1.5 టీస్పూన్లు
కారం పొడి- 1.5 టీస్పూన్లు (మీ కారానికి సరిపడా)
పసుపు-1/2 టీస్పూన్
ధనియాల పొడి-1 టీస్పూన్
జీలకర్ర పొడి-1/2 టీస్పూన్
ఉప్పు-రుచికి సరిపడా
నిమ్మరసం- 1 టీస్పూన్
వంట నూనె -3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు-2 రెమ్మలు
పచ్చిమిర్చి- 2-3 (మధ్యలో చీల్చినవి)
ఉల్లిపాయ- 1
కొత్తిమీర-కొద్దిగా
తయారీ విధానం:
1. చికెన్ మ్యారినేషన్ :
చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోండి. ప్పుడు చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, , నిమ్మరసం వేయండి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేలా చేత్తో కలపండి. దీనిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టండి. సమయం ఉంటే ఫ్రిజ్‌లో 1-2 గంటలు ఉంచితే రుచి మరింత పెరుగుతుంది.
2. చికెన్ ఫ్రై చేయడం:
స్టవ్‌పై మందపాటి అడుగున్న పాన్‌ను పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడి అయిన తర్వాత, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేయించండి. ఆ తర్వాత.. ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను పాన్‌లో వేయండి. చికెన్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చికెన్ మసాలాతో పాటు ఉడకడం మొదలవుతుంది. చికెన్ నుండి నీరు బయటకు వచ్చి, తిరిగి ఆవిరి అయ్యేవరకు ఫ్రై చేయండి. సుమారు 15-20 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఫ్రై చేస్తే, ముక్కలు బాగా ఉడికి, లేతగా మారుతాయి. చికెన్ ముక్కలు మంచి గోధుమ రంగులోకి మారి, క్రిస్పీగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
Also Read: బతుకమ్మ స్పెషల్ మలీద లడ్డూలు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !
3. సర్వింగ్ :
వేడివేడిగా ఉన్న చికెన్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి. పైన సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించండి. ఈ సులభమైన చికెన్ ఫ్రై రెసిపీని ఇంట్లో తయారు చేసి, వేడి వేడి అన్నంతో లేదా రొట్టెలతో ఆస్వాదించండి. ఇది తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది , రుచి అమోఘంగా ఉంటుంది.