Jared Kushner: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, వైట్‌హౌస్ మాజీ సీనియర్ సలహాదారు జారెడ్ కుష్నర్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన తన పదవిలో ఉన్న సమయంలో గల్ఫ్ దేశాల నిధులతో కూడిన విదేశీ బ్యాంకు ఖాతాలను రహస్యంగా యాక్సెస్ చేశారనే విమర్శలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయెల్ అగ్రనేతల ప్రయోజనాల కోసం ట్రంప్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సీక్రెట్ ఫైనాన్షియల్ ఏర్పాట్లు జరిగినట్లు ‘వానిటీ ఫెయిర్’ ప్రచురించిన ఒక నివేదిక వెల్లడించింది. డచ్ గూఢచారులు కుష్నర్ ఫోన్ కదలికలను నిరంతరం గమనించడం వల్లే ఈ రహస్యాలు బయటపడినట్లు ఆ కథనం పేర్కొంది.
ప్రముఖ జర్నలిస్ట్ మాథ్యూ కోల్ రాబోయే పుస్తకం ‘ప్రిన్సెస్ అండ్ థీవ్స్: జారెడ్ కుష్నర్ అండ్ మొహమ్మద్ బిన్ జాయెద్స్ సీక్రెట్ ప్లాట్ టు రీమేక్ ది మిడిల్ ఈస్ట్’ ఆధారంగా ఈ నివేదిక వెలువడింది. ట్రంప్ మొదటి హయాంలో డచ్ గూఢచారులు జారెడ్ కుష్నర్ ఐఫోన్‌ను హ్యాక్ చేశారని ఆ సమయంలో ఆయన యూఏఈకి చెందిన ఓ బ్యాంకు ఖాతాను ఉపయోగించినట్లు గుర్తించారని నివేదిక ఆరోపించింది. అజర్‌బైజాన్ నుంచి వందలాది కోట్ల రూపాయలు ఈ ఖాతాలోకి బదిలీ అయినట్లు సమాచారం.
ఫస్ట్ అబుదాబి బ్యాంకులో ఉన్న వాటానీ అల్ ఎమారత్ ఫౌండేషన్ (యూఏఈ ప్రభుత్వ నిధులతో నడిచే ఛారిటీ) ఖాతాలోకి దాదాపు 75 కోట్ల డాలర్లు బదిలీ అయ్యాయని నివేదిక పేర్కొంది. ఈ ఖాతాకు కుష్నర్ అధికారికంగా యజమాని కానప్పటికీ ఆయనకు అందులో సిగ్నేటరీ హోదా ఉండటంతో లావాదేవీలు జరిపే అవకాశం లభించింది. ఈ బ్యాంక్ చైర్మన్, యూఏఈ పాలకుడు మొహమ్మద్ బిన్ జాయెద్ సోదరుడైన తహ్నూన్ బిన్ జాయెద్ దీనిని పర్యవేక్షించినట్లు తెలుస్తోంది.
ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధాన లక్ష్యాలకు మద్దతుగా రహస్య నిధి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, బిన్ జాయెద్ లు ఈ ప్లాన్ వేసినట్లు నివేదిక ఆరోపించింది. ఈ స్లష్ ఫండ్ ఆలోచన చివరికి కార్యరూపం దాల్చకపోయినా ఆ ఇద్దరు మధ్యప్రాచ్య రాజులు కుష్నర్ కోసం వేర్వేరు ఖాతాల్లో కనీసం 2 బిలియన్ డాలర్లు జమ చేసినట్లు తెలుస్తోంది. అలాగే సౌదీ రాజ కుటుంబీకుడు కుష్నర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరో బిలియన్ డాలర్లను బదిలీ చేయడానికి ఒక బ్యాంకు ఖాతాను ఉపయోగించినట్లు ఆరోపణలున్నాయి.
ఈ బదిలీలను యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏర్పాటు చేయగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ డబ్బును ఇజ్రాయెల్‌లోనే జమ చేయాలని కుష్టర్‌ను ప్రోత్సహించినట్లు సమాచారం. ఆ సమయంలో ఇజ్రాయెల్‌లోని అప్పటి అమెరికా రాయబారి డేవిడ్ ఫ్రైడ్‌మన్ ద్వారా కుష్నర్, నెతన్యాహుతో సంప్రదింపులు జరిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు బయటపడలేదు. ప్రస్తుతం 45 ఏళ్ల వయసున్న జారెడ్ కుష్నర్.. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌తో కలిసి శాంతి చర్చల బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
Also Read: ‘దేశ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు’.. రాహుల్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ!
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను జారెడ్ కుష్నర్ తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) లో పోస్ట్ పెట్టారు. ‘ఇవి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ముసుగులో వస్తున్న అబద్ధపు ప్రచారాలు. ఇది అసలు జర్నలిజమే కాదు. మానసికస్థిమితం లేనివారు, దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న వారు రాస్తున్న కల్పిత కథలు’ అని కుష్నర్ మండిపడ్డారు. అయితే గతంలోనే ఇలాంటి అసత్యపు ఆరోపణలతో పలు విచారణలు ఎదుర్కొన్నానని కుష్నర్ అన్నారు. అప్పట్లో పలు కాంగ్రెస్ కమిటీలు, స్పెషల్ కౌన్సిల్ దర్యాప్తు సంస్థల ముందు స్వచ్ఛందంగా హాజరై 30 గంటలకు పైగా వాంగ్మూలం ఇచ్చానని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో ఇలాంటి విషయాలు ఏవీ బయటకు రాలేదని, ఎందుకంటే అలాంటి ఘటనే జరగలేదని స్పష్టం చేశారు.