Byjus Ravindran: ఎడ్ టెక్ సంస్థ బైజూస్ కు మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే అప్పులు ఊబిలో కూరుకుపోయిన ఆ సంస్థకు అమెరికా కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బైజూ ఆల్ఫా కంపెనీ యూఎస్ కు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్ పై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జిమెంట్ వెలువరించింది. బైజూస్ రవీంద్రన్ వ్యక్తిగతంగా ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రుణాలను తిరిగి చెల్లించాలని కోర్టు డిఫాల్ట్ తీర్పును జారీ చేసింది.
నవంబర్ 20న జారీ చేసిన తీర్పు ప్రకారం.. రవీంద్రన్ డిస్కవరీ ఆర్డర్‌ను పాటించడంలో విఫలమయ్యాయరని డెలావేర్ కోర్టు గుర్తించింది. ఈ పిటిషన్ లో రవీంద్రన్‌పై డిఫాల్ట్ తీర్పును జారీ చేసింది కోర్టు. బైజూస్ కంపెనీ తరఫున సేకరించిన రుణాలను అమెరికా నుంచి అక్రమంగా తరలించారని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. దీంతో కోర్టు పిటిషనర్ కు 1.07 బిలియన్ డాలర్లు(సుమారు 9 వేల కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. ఆల్ఫా ఫండ్స్, కామ్‌షాఫ్ట్ ఎల్పీ వడ్డీ వంటి ఏవైనా సంబంధిత ఆదాయాల కచ్చితమైన ఖాతాను రవీంద్రన్ అందించాలని కోర్టు తీర్పులో పేర్కొంది.
బైజు బ్రాండ్ పేరుతో పనిచేసే ఎడ్‌టెక్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ను రవీంద్రన్ నిర్వహిస్తున్న సమయంలో బైజూ ఆల్ఫాను స్థాపించారు. అమెరికాకు చెందిన రుణదాతల నుండి ఈ సంస్థ 1 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ తీసుకుంది. అనంతరం బైజూ ఆల్ఫా రుణ నిబంధనలను ఉల్లంఘించి మొత్తం రుణంలో 533 మిలియన్ డాలర్లను చట్టవిరుద్ధంగా యూఎస్ నుంచి బదిలీ చేసిందని రుణదాతలు ఆరోపించారు.
ఈ విషయంపై గ్లాస్ ట్రస్ట్ డెలావేర్ కోర్టును ఆశ్రయించి బైజూ ఆల్ఫాను నియంత్రించాలని కోరింది. ఈ మేరకు గ్లాస్ ట్రస్ట్ రెండూ 533 మిలియన్ల డాలర్ల విలువైన లావాదేవీల ఆవిష్కరణకు డెలావేర్ దివాలా కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. నవంబర్ 20 కోర్టు తీర్పు ఇచ్చింది. డిస్కవరీ ఆర్డర్ గురించి రవీంద్రన్‌కు తెలిసినా దానిని పాటించడానికి ఆయన నిరాకరించారని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. ఈ విషయంలో కోర్టు ధిక్కార ఉత్తర్వులను జారీ చేసింది. కానీ రవీంద్రన్ డిస్కవరీ అభ్యర్థనలకు స్పందించకుండా నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు అభిప్రాయపడింది.
బైజూస్ ఆల్ఫాకు సంబంధించి 533 మిలియన్ డాలర్లు, క్యామ్‌షాఫ్ట్ హెడ్జ్ ఫండ్ ఇంట్రెస్ట్‌కు సంబంధించిన 540.6 మిలియన్ డాలర్ల నిధులను వెంటనే చెల్లించాలని కోర్టు బైజూస్‌ను ఆదేశించింది. ఆల్ఫా ఫండ్లను ఏ విధంగా ఖర్చు చేశారో వెల్లడించి పూర్తి అకౌంట్ వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఈ ఆదేశాలను బైజూస్ రవీంద్రన్ న్యాయవాదులు తోసిపుచ్చారు. అప్పీల్‌కు వెళతామని తెలిపారు. కోర్టులో వాదనలు వినిపించేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని బైజూస్ తరఫు లాయర్లు పేర్కొన్నారు.
అమెరికా కోర్టులో బైజూస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ లిటిగేషన్ అడ్వైజర్ జె మైఖేల్ మెక్‌నట్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. బైజూ రవీంద్రన్ యూఎస్ కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని యోచిస్తున్నారన్నారు. బైజూ రవీంద్రన్ పూర్తి ఆధారాలను సమర్పించి గ్లాస్ సంస్థ 2.5 బిలియన్ల డాలర్లను క్లెయిమ్ చేయాలని యోచిస్తున్నారని పేర్కొన్నారు.