నాలుగు రోజుల విహారయాత్ర కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లిన తెలుగు పర్యాటకులు చుక్కలు చూస్తున్నారు. అక్కడ బాంబుల సౌండ్ లకు కన్నీరు పెట్టుకుంటున్నారు.. ఇప్పుడు బహ్రెయిన్ లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది పర్యాటకులు టూరిస్ట్ వీసాపై ఆ ద్వీప దేశానికి చేరుకున్నారు. యాత్ర ముగించుకుని తిరిగి రావాల్సిన సమయంలో ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ వార్ మొదలైంది. అక్కడ ఊహించని పరిస్థితులు ఎదురవడంతో తెలుగు పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. తమను ఆదుకునే వారు లేక.. స్వదేశానికి చేరుకునే మార్గం కనిపించక వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పర్యాటకులు తమ దీనస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వేసుకోవడానికి మందులు లేక విలవిలలాడుతున్నారు. తమ వద్ద ఉన్న డబ్బులు ఖర్చయిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. స్థానికంగా ఎవరిని అడగాలో తెలియక.. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక వారు నరకయాతన అనుభవిస్తున్నామని బోరున ఏడుస్తున్నారు.
ఐల్యాండ్ కంట్రీ బహ్రెయిన్ లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన టూరిస్ట్‌ల ఆవేదన
బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల పర్యాటకులు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం కోసం ఎదురుచూపు
టూరిస్ట్ వీసా పై 4 రోజులపాటు పర్యటించేందుకు బహ్రెయిన్ వెళ్ళిన తెలుగు రాష్ట్రాలకు చెందిన… pic.twitter.com/AKEz8aEG9k
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2026
ఈ క్లిష్ట సమయంలో తమను సురక్షితంగా సొంత ప్రాంతాలకు తరలించాలని పర్యాటకులు వేడుకుంటున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వాలు చొరవ చూపి తమను ఈ గండం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. తమ కుటుంబ సభ్యులు స్వదేశంలో ఆందోళన చెందుతున్నారని.. వీలైనంత త్వరగా తాము ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని వారు వేడుకుంటున్నారు.
స్థానిక దౌత్య కార్యాలయాల తీరుపై పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కానీ.. అటు బహ్రెయిన్ ఎంబసీ కానీ తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయం కోసం అక్కడి అధికారులను సంప్రదించినా సరైన స్పందన రావడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ కష్టాలను పట్టించుకోకపోవడం పట్ల వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విదేశీ గడ్డపై దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వెంటనే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విదేశాంగ శాఖతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా వారిని వెనక్కి తీసుకురావాలని విన్నవిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ అక్కడ పర్యాటకుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి తమ వారిని క్షేమంగా ఇంటికి చేర్చుతారని వారు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Iran School Airstrike Minab: యుద్ధానికి బలైపోయిన బాల్యం.. 165 మంది బాలికలకు సామూహిక అంత్యక్రియలు!