Tibet Earthquake: టిబెట్‌లో గురువారం రాత్రి సంభవించిన భయంకరమైన భూకంపం తీవ్ర విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ఈ శక్తివంతమైన భూకంపం ధాటికి 18 మంది ప్రాణాలు కోల్పోగా.. 46 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. క్షతగాత్రులను శిథిలాల నుంచి రక్షించే పనిలో పడ్డారు.
యూఎస్ జీలాజికల్ సర్వే (USGS) అందించిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10:33 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. నాగ్చు పట్టణానికి తూర్పు-ఈశాన్యంగా దాదాపు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. రాత్రివేళ భూమి తీవ్రంగా కంపించడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్ధం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
చైనా సెంట్రల్ టెలివిజన్ (CCTV) కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో 46 మంది గాయపడ్డారు. వారిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. భూకంప ప్రభావానికి సుమారు 339 ఇళ్లు పూర్తిగా కూప్పకూలాయి. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు, బాధితులకు తక్షణ సాయం అందించేందుకు 300 మందికి పైగా పోలీసు అధికారులను, రెస్క్యూ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. మరోవైపు భూ ప్రకంపనల ధాటికి సూపర్ మార్కెట్లోని వస్తువులు కిందపడటం.. రెస్టారెంట్లు, ఇళ్ల నుంచి టిబెట్ ప్రజలు బయటకు పరుగులు పెట్టిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
JUST IN: At least 16 dead, 32 injured and hundreds of homes collapsed after a magnitude 7.0 earthquake struck Tibet, China, officials say. https://t.co/2nTZ5BL4CU
— Scope Report (@ScopeReport_) October 22, 2026
ఈ ప్రాంతంలో స్వల్ప వ్యవధిలోనే వరుస విపత్తులు సంభవించడం స్థానికులను కలవరపెడుతోంది. గతేడాది జనవరిలో టిబెట్‌లోని టింగ్రీ కౌంటీలో వచ్చిన భారీ భూకంపంలో 126 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొద్ది వారాల క్రితమే (ఆగస్టులో) నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన వరదల్లో 1,400 మందికి పైగా మరణించారు.
ఇదిలా ఉంటే టిబెట్ తో పాటు చైనాలోనూ గురువారం రాత్రి భూకంపం చోటుచేసుకుంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిన వివరాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లోని పాంగిన్‌కు 505 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో 5.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. రాత్రి 8:29 గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.