Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోమారు ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశంపై మరో విడత సైనిక దాడికి సిద్ధమంటూ సంచలన హెచ్చరికలు చేశారు. అమెరికాతో ఎలాంటి ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ క్యాంపెయిన్ రాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. ‘మేము మరో చిన్నపాటి ‘ఎపిక్ ఫ్యూరీ’ చేయవచ్చు. లేదా ఇరానే స్వయంగా ఒప్పందానికి రావొచ్చు. వాళ్లకు కాస్తైనా బుద్ధి ఉంటే ఇకనైనా చర్చలకు కూర్చొని మాట్లాడాలి’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఈ దాడులను నివారించడానికి ఇరాన్ ఎలాంటి షరతులకు ఒప్పుకోవాలనే దానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వకపోవడ గమనార్హం.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో భారీ సైనిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లోనే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఆ తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ ద్వారా ఇరాన్ అణు ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని వారి సైనిక, ఆర్థిక వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీశామని ట్రంప్ తాజాగా గుర్తుచేశారు.
కాగా ట్రంప్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే, అమెరికా రాయబారి ఒకరు మాట్లాడుతూ ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొనడం కలకలం రేపింది. టర్కీలో అమెరికా రాయబారిగా ఉన్న టామ్ బరాక్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ వారాంతంలో దాడులు జరగవచ్చా? అన్న ప్రశ్నకు కచ్చితంగా జరగొచ్చు అని సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో ట్రంప్ చాలా క్లారిటీగా ఉన్నారని పేర్కొన్నారు. డీల్ కుదుర్చుకునేందుకు సైతం ట్రంప్ సిద్ధమేనని స్పష్టం చేశారు.
Also Read: కర్ణాటక ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. సీఎం డీకే శివకుమార్ సంచలన విషయాలు వెల్లడి!
మరోవైపు అమెరికా బెదిరింపులపై ఇరాన్ సైతం గట్టిగానే స్పందించింది. ‘నిప్పుతో చెలగాటమాడొద్దు’ అంటూ హెచ్చరించింది. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ తమపై దాడులకు దిగితే పర్షియన్ గల్ఫ్‌లోని సముద్రం కింద ఉన్న కమ్యూనికేషన్ కేబుల్స్‌ను (అండర్‌సీ కేబుల్స్) లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. దాడుల తర్వాత ఇంటర్నెట్ సేవలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కోలుకోకుండా ఉండేందుకే ఈ వ్యూహం పన్నుతున్నట్లు ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించాయి.
Also Read: యాపిల్, శాంసంగ్‌లకు దీటుగా స్వదేశీ మొబైల్ బ్రాండ్.. కేంద్రం సంచలన ప్రకటన!