Indian Mobile: మెుబైల్ తయారీ రంగంలో తిరుగులేని శక్తిగా తయారయ్యేందుకు భారత్ సన్నద్దమవుతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2028 నాటికి ప్రపంచ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్‌లతో పోటీపడేలా స్వదేశీ బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన ‘ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుత తేదీని అందరూ నోట్ చేసుకోవాలని.. సరిగ్గా రెండేళ్ల తర్వాత అంటే 2028 అక్టోబర్ 23 నాటికి భారత్‌లోనే డిజైన్ చేసి, తయారైన స్వదేశీ బ్రాండ్ మొబైల్ ఫోన్లు మన చేతుల్లో ఉంటాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఈ ప్రక్రియ వెనుక ఉన్న సాంకేతిక సవాళ్లను వివరిస్తూ.. యాంకర్ చేతిలోని ఫోన్‌ను అడిగి మరీ మంత్రి తీసుకున్నారు. ఇంత చిన్న ఫోన్ లో రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్, యాంటెన్నా, కెమెరాలు, డిస్ ప్లే, పవర్ మేనేజ్ మెంట్ అన్ని ఉంటాయని గుర్తుచేశారు. అది కూడా ఒక నిర్దిష్ట బరువును మెయిన్ టెన్ చేస్తూ మెుబైల్ ను తయారు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డారు. అందుకే మెుబైల్ డిజైన్ చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా మారిందని చెప్పుకొచ్చారు.
అయితే మూడేళ్ల క్రితం తాము దేశీయ డిజైనర్లకు ఒక సవాలు విసిరామని మంత్రి గుర్తుచేశారు. మొబైల్ ఫోన్‌కు గుండెకాయ లాంటి పీసీబీని (మదర్‌బోర్డ్) మన వాళ్లు ఎందుకు డిజైన్ చేయలేరని ప్రశ్నించినట్లు తెలిపారు. ఈ సవాలును స్వీకరించి ముందుకు వచ్చిన రెండు కంపెనీల్లో ఒక కంపెనీ డిజైన్ అత్యద్భుతంగా వచ్చిందని చెప్పారు. నేడు ఆ డిజైన్‌ను అమెరికాలోని అత్యుత్తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక చేసుకుందని తెలిపారు. అమెరికాలో ఫోన్ కొనుగోలు చేసినప్పుడు 12 నెలల టెలికాం కాంట్రాక్ట్ కూడా వస్తుందని, ఆ కంపెనీ ఇప్పటికే 5జీ ప్లస్ మొబైల్‌ను డిజైన్ చేసి అమెరికన్ కస్టమర్లకు అందించినట్లు వెల్లడించారు. ఈ సాంకేతిక సామర్థ్యాన్నే ఇకపై మన స్వదేశీ బ్రాండ్, డిజైన్, ఐపీల కోసం ఉపయోగించుకుంటామని, తద్వారా ఈ ఫోన్లు అత్యధికంగా అమ్ముడవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
గత కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన నిబంధనలు, చట్టాల వల్లే తయారీ రంగం తీవ్రంగా వెనుకబడిందని మంత్రి ఆరోపించారు. 1990ల నాటి ఆర్థిక సంస్కరణలు.. 2004 వరకు బాగానే పనిచేసినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ పాత నియంత్రణ ధోరణి, వామపక్ష భావజాలం కారణంగా దేశం వెనకడుగు వేసిందని విమర్శించారు. కానీ 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని బట్టి చూస్తేనే మన ప్రయాణం ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు.
Also Read: బీజేపీలో ఎమ్మెల్సీ గుబులు.. ఆశావాహుల్లో టెన్షన్ టెన్షన్.. అధిష్టానం సపోర్ట్ ఎవరికి?
ఇవాళ భారత్ కేవలం మొబైల్సే కాకుండా డ్రోన్లు, క్షిపణులు, రైళ్లు, అత్యంత ఆధునిక పరికరాలను కూడా తయారు చేస్తోందని వైష్ణవ్ గర్వంగా చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ‘సరిగ్గా 12 ఏళ్ల క్రితం భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు అవుతాయని ఎవరైనా ఊహించగలరా? అది అప్పట్లో కష్టతరంగా ఉండేది. కానీ దానిని సుసాధ్యం చేసి భారత్ ను మూడో స్థానంలో నిలిపాం. అతి త్వరలోనే దేశం రెండో స్థానానికి చేరుకుంటుంది’ అని ఐటీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: కలిసిపోని వామపక్షాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్న వ్యూహాలు.. ఎవరి దారి వారిదేనా?