Sting Operation: కర్ణాటకలో రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనను, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశ్‌ను లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్‌కు తెరలేపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అయితే బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాల ముఖ్యమంత్రుల విషయంలో మాత్రం ఇలాంటి ప్రయత్నాలు జరగలేదని ఆయన పేర్కొన్నారు. కన్నడ వార్తా ఛానెల్ ‘ఏషియానెట్ సువర్ణ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను వెల్లడించారు.
తనను కలవడానికి వచ్చిన ఓ పారిశ్రామికవేత్త తీరుపై అనుమానం వచ్చిందని ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ తెలిపారు. అధికారికంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి.. తొలుత వ్యాపార విషయాలు మాట్లాడి ఆ తర్వాత మెల్లగా రాజకీయాల వైపు సంభాషణను మళ్లించాడని చెప్పారు. బూత్ స్థాయి వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై ఆ వ్యక్తి మాట్లాడటం తనలో అనుమానాలకు తావిచ్చిందన్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తి ధరించిన ‘మెటా స్మార్ట్ గ్లాసెస్’ (Meta smart glasses) తనను మరింత అప్రమత్తం చేశాయని శివకుమార్ పేర్కొన్నారు. సదరు పారిశ్రామికవేత్త కదలికలు, నేపథ్యంపై దృష్టి పెట్టాలని తాను అధికారులను ఆదేశించినట్లు డీకే చెప్పారు.
ఆ పారిశ్రామికవేత్త కదలికలపై ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని డీకే శివకుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఆ వ్యక్తి ఆ మెటా గ్లాసెస్ ధరించలేదని డీకే అన్నారు. కేవలం తనను, కేరళ సీఎం వీడీ సతీశ్‌ను కలిసినప్పుడు మాత్రమే వాటిని పెట్టుకున్నాడని ఆయన ఆరోపించారు. ఈ తరహా కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తన మంత్రివర్గ సహచరులను, వ్యక్తిగత సహాయకులను ముందే హెచ్చరించినట్లు డీకే తెలిపారు. ప్రభుత్వ పెద్దగా తన సహచరులను అప్రమత్తం చేయడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: యాపిల్, శాంసంగ్‌లకు దీటుగా స్వదేశీ మొబైల్ బ్రాండ్.. కేంద్రం సంచలన ప్రకటన!
మరోవైపు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియోల వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సిద్ధరామయ్య స్పందించారు. ఇది పూర్తిగా బూటకపు కేసని ఆయన కొట్టిపారేశారు. ఈ విషయంపై ప్రజలకు నిజం తెలియాలనే తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను ఎనిమిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో తాను లేనని ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడూ ఎవరూ తనను బ్లాక్మెయిల్ చేయలేకపోయారని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
Also Read: కలిసిపోని వామపక్షాలు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భిన్న వ్యూహాలు.. ఎవరి దారి వారిదేనా?