2025 జులైలో పెను విపత్తు జపాన్ తోపాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది – న్యూ బాబా వాంగ అంచనా ఇది.
ఆమె అన్నట్టుగానే ప్రకృతి ప్రళయతాండవం మొదలైంది.
బుధవారం జపాన్ లో అగ్నిపర్వతం బద్దలైంది.
గురువారం భూకంపం వచ్చింది.
శనివారం, అంటే ఈరోజు మరిన్ని భూకంపాలు వస్తాయని జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది.
విలయం తప్పదా..?
ఇవన్నీ చూస్తుంటే ఆమె చెప్పిందే నిజమవుతుందని అనిపిస్తోంది. జులై-5 అని నేరుగా విధ్వంసం తేదీని సైతం న్యూ బాబా వాంగ ప్రకటించింది. దీంతో ఈరోజు విలయం తప్పదని జపాన్ వాసులు భయపడిపోతున్నారు. ఆ భయాలను నిజం చేస్తూ వరుస ఉపద్రవాలు జపాన్ ని చుట్టుముడుతున్నాయి.
అప్పుడు-ఇప్పుడు
జపాన్ వాంగగా గుర్తింపు తెచ్చుకున్న రియో టాట్సుకి జ్యోతిష్యం ఇప్పుడు నిజమేనని అనిపిస్తోంది. 2011లో జపాన్ సునామీని కూడా ఆమె ముందుగానే ఊహించి చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే సునామీ ఆ దేశాన్ని కకావికలం చేసింది. ఆ తర్వాత 2025 జులై 5న మరో వినాశనం ఉందని ఊహించి చెప్పింది వాంగా. ఈసారి కూడా ఆ అంచనా నిజమవుతుందని జపాన్ వాసులు భయపడుతున్నారు. వరుస పరిణామాలు ఆ భయాందోళనలను మరింత పెంచుతున్నాయి.
తొలి సంకేతం..
జులై-2, బుధవారం జపాన్‌లోని మౌంట్ షిన్‌మోడాకే అనే అగ్ని పర్వతం బద్దలైంది. భద్రతా కారణాల దృష్ట్యా స్థానికులను అక్కడినుంచి ఖాళీ చేయించారు అధికారులు. ఆ పర్వతం 2011 నుంచి నిద్రాణంగా ఉంది. మళ్లీ ఇప్పుడు ఒక్కసారిగా పేలడంతో స్థానికులు భయపడిపోయారు. బాబా వాంగ జ్యోతిష్యానికి ఇది తొలి సంకేతంగా భావించారు జపాన్ వాసులు.
రెండో సంకేతం..
జులై-3, గురువారం జపాన్ లోని కగోషిమా ప్రిఫెక్చర్ లో వరుస కంపనాలు మొదలయ్యాయి. తక్కువ తీవ్రతతో దాదాపు వెయ్యి భూకంపాలు నమోదయ్యాయి. దీంతో వాంగా జ్యోతిష్యంపై మరింత నమ్మకం పెరిగింది. అగ్నిపర్వతం బద్దలైన తర్వాత వినాశనానికి రెండో సంకేతంగా ఈ భూకంపాలను గుర్తించారు. దక్షిణ క్యుషు ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూమి కంపించడంతో జులై-4న అధికారులు మారుమూల దీవులనుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక శనివారం, అంటే వాంగా జ్యోతిష్యం నిజమయ్యే జులై-5 కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కోరింది.
నష్టం మొదలైంది..
వాంగా జ్యోతిష్యం నిజమైతే ఈరోజు అర్థరాత్రికి జపాన్ లో మరింత తీవ్రమైన భూకంపాలు రావాలి. అలాంటి ఉపద్రవాలేవీ జరగకపోయినా ఆల్రడీ జపాన్ కి నష్టం మొదలైంది. ప్రకృతి విపత్తులపై అనుమానంతో జపాన్ పర్యాటకం పడకేసింది. జపాన్ లో పర్యాటక ప్రాంతాలన్నీ బోసిపోయి కనపడుతున్నాయి. న్యూ బాబా వాంగా జ్యోతిష్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జపాన్ వాసులు వణికిపోతున్నారు. జులై-5వతేదీ దాటిపోయినా ఈ గండం గట్టెక్కామని వారు ధైర్యంగా ఉండలేరు. విపత్తుల సంకేతాలు పూర్తిగా ఆగిపోయే వరకు వారిలో భయం తొలగిపోదు. వాంగ జ్యోతిష్యం భయాలనుంచి జపాన్ కోలుకోడానికి మరికొంత కాలం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ జ్యోతిష్యాన్ని నమ్మొద్దని ప్రభుత్వం చెబుతున్నా.. వరుసగా జరుగుతున్న పరిణామాలు మాత్రం జపాన్ వాసుల్ని కలవర పెడుతున్నాయి.