Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ముందుగా నిర్ణయించిన ప్రకారమే రాబోయే మూడేళ్లలో పూర్తవుతుందన్నారు మంత్రి నారాయణ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు మంత్రి. ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 50వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒక్కో నిర్మాణం పూర్తి చేశామని.. చివర్లో ఏడాది ఉందనగా టెండర్లు పిలిచామన్నారు మంత్రి నారాయణ. అందుకే ఆలస్యం జరిగినట్లు తెలిపారు మంత్రి నారాయణ.
మొత్తం ఏడు అంశాలకు ఆమోదం తెలిపింది సీఆర్‌డీఏ. రాజధాని పరిధిలో మరో 20 వేల 494 ఎకరాల భూ సమీకరణకు ఆమోదించింది. ఇందులో భాగంగా అమరావతి మండలంలో 4 , తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో భూసమీకరణ చేయనున్నారు. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్ పీ పిలిచేందుకు ఆమోదం తెలిపింది సీఆర్‌డీఏ. అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ ప్రతిపాదనకు..అథారిటీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక, అమరావతిలో భూకేటాయింపుల విషయంలో కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. సీబీఐ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ సహా మొత్తం 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది సీఆర్‌డీఏ.
Also Read: మొన్న గోడ.. ఇప్పుడు షెడ్డు.. సింహాద్రి అప్పన్న భక్తులకు తప్పిన ప్రమాదం
వైసీపీ ఆధిపత్యం ఉన్న గ్రామాల్లో భూసమీకరణపై కొంత ఆందోళన ఉందన్నారు మంత్రి నారాయణ. ఎక్కడైనా ఐదు పది శాతం ఇలాంటివి సహజమేనంటూ చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.