CBSE Final Date Sheets: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 విద్యా సంవత్సరానికి 10, 12 తరగతుల బోర్డు పరీక్షల తుది డేట్ షీట్‌ను విడుదల చేసింది. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/cbsenew/cbse.html లో పూర్తి షెడ్యూల్ పొందవచ్చు. ఈ రెండు తరగతులకు పరీక్షలు ఫిబ్రవరి 17, 2026న ప్రారంభమవుతాయి. జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సుల మేరకు 2026 నుంచి ఒక విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.
సెప్టెంబర్ 24, 2025న తాత్కాలిక డేట్ షీట్ ను సీబీఎస్ఈ విడుదల చేసింది. విద్యార్థుల జాబితాలు అందడంతో పరీక్షలకు దాదాపు 110 రోజుల ముందుగా సీబీఎస్ఈ తుది డేట్ షీట్‌ను విడుదల చేసింది. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు సజావుగా జరిగేందుకు మెయిన్ సబ్జెక్టుల మధ్య తగినంత సమయం ఉండేలా డేట్ షీట్ ను రూపొందించారు. దీంతో విద్యార్థులకు తగినంత ప్రిపరేషన్ సమయం లభిస్తుందని బోర్డు తెలిపింది.
ఒకే సమయంలో వివిధ పరీక్షల ఓవర్‌లాప్‌ల గురించి విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు తమ 11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలని సీబీఎస్ఈ సూచించింది. జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అన్ని పాఠశాలలు 11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్‌ను అందించాలని బోర్డు సూచించింది.
ఒకే తేదీన రెండు సబ్జెక్టుల పరీక్షలు రాకుండా సీబీఎస్ఈ తుది డేట్ షీట్‌ను రూపొందించింది. పరీక్షలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలను ఏప్రిల్ 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Also Read: NHAI Recruitment: డిగ్రీ అర్హతతో నేషనల్ హైవేలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,77,500 జీతం, ఇదే మంచి అవకాశం
పాఠశాలల్లో ఏఐ పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి సీబీఎస్ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటేషనల్ థింకింగ్ కోసం పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి సీబీఎస్ఈ ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని అధికారులు ఓ ప్రకటన తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరంలో 3వ తరగతి నుంచి అన్ని పాఠశాలల్లో ఏఐ పాఠ్యాంశాలను రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తు్న్నారు.