TG Govt Schools: గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు మొత్తం వెంటనే క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం సాయంత్రం ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు, నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. ప్రజా భవన్ లో జరిగిన సమీక్షలో గిరిజన సంక్షేమ నివాస పాఠశాలలు, గిరిజన, జనరల్ గురుకులాలు, కేజీబీవీ పాఠశాలలు విద్యార్థుల భోజన ఛార్జీలు, అద్దె ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై చర్చించారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని అన్ని రకాల బిల్లులు సుమారు రూ.92 కోట్లు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తూ.చా తప్పక పాటించాలని, మెనూ పాటిస్తున్నారా? లేదా? వసతి సౌకర్యాలు, బోధనలు నాణ్యత వంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అధికారులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలను సందర్శించాలని సూచించారు.
డిప్యూటీ సీఎం ఆదేశంలో ఆయా పాఠశాలల బిల్లులన్నీ తక్షణం క్లియర్ అయ్యేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలతో పాటు తాజా బకాయిలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామన్నారు.
Also Read: Hydraa: రూ. 111 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.. స్థానికులు హర్షం వ్యక్తం
ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం, మెస్ ఛార్జీలను 40% పెంచినట్లు భట్టి విక్రమార్క గుర్తుచేశారు. తాజాగా పెంచిన ఛార్జీలతో పాటుగా, పెండింగ్ బిల్లును క్లియర్ చేయడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు బిల్లులు క్లియర్ చేయడంతో మేలు జరగనుందన్నారు.