Engineer Turns Rapido Driver| ఇంజినీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించడం చాలామందికి ఒక కల. అయితే, ఉద్యోగం ఉన్నా కుటుంబ అవసరాలు తీరకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ మహిళ రాపిడో బైక్ టాక్సీలో ప్రయాణిస్తుండగా డ్రైవర్‌తో చర్చలో ఈ విషయం ప్రస్తవనకు వచ్చింది. ఆ డ్రైవర్ సంపాదన గురించి తెలిసి షాకైన సోషల్ మీడియాలో అతని గురించి షేర్ చేశారు. గతంలో నెలకు రూ.40 వేల జీతం తీసుకున్న ఓ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి రాపిడో డ్రైవర్‌గా మారినట్లు అతను చెప్పాడు. ఇప్పుడు నెలకు రూ.1.2 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సంఘటన కెరీర్, ఆదాయం, కుటుంబ బాధ్యతల గురించి కొత్త చర్చకు తెరలేపింది.
రాపిడో రైడ్‌లో ఆ మహిళ.. డ్రైవర్‌తో మాట్లాడారు. రోజుకు ఎంత సంపాదిస్తున్నారని అతడిని అడిగారు. రోజుకు రూ.4 వేల వరకు సంపాదిస్తానని అతను చెప్పినట్లు ఆమె తన ఎక్స్ పోస్టులో వెల్లడించారు. మొదట ఆమె ఆ మొత్తాన్ని విని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అతను రోజువారీ ఆదాయం గురించి చెబుతున్నట్లు అర్థం చేసుకున్నారు. నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారా అని అడగగా, అవునని డ్రైవర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. తన నెలవారీ ఆదాయం రూ.1 లక్ష నుంచి రూ.1.2 లక్షల వరకు ఉంటుందని అతను తెలిపినట్లు వెల్లడించారు.
ఆ డ్రైవర్ గతంలో ఓ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేసేవాడని మహిళ తెలిపారు. అప్పుడు అతనికి నెలకు రూ.40 వేల జీతం వచ్చేదని పేర్కొన్నారు. అయితే, ఆ ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని డ్రైవర్ చెప్పినట్లు ఆమె వివరించారు.
కుటుంబ అవసరాలను తీర్చేందుకు మరో మార్గాన్ని ఎంచుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. చివరకు ఇంజినీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాపిడో డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు.
రాపిడో డ్రైవర్‌గా మారిన తర్వాత ఆదాయం పెరిగిందని అతను చెప్పినట్లు మహిళ వెల్లడించారు. అంతేకాకుండా, సొంత నగరంలోనే పనిచేసే అవకాశం లభించడంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎక్కువ ఆదాయం సంపాదించడంతో పాటు కుటుంబానికి దగ్గరగా ఉండటం కూడా అతని నిర్ణయంలో ముఖ్యమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ హోదా కంటే కుటుంబ అవసరాలు, ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు
ఇంజినీరింగ్ డిగ్రీ, కార్పొరేట్ ఉద్యోగం ఉంటేనే విజయం సాధించినట్లు చాలామంది భావిస్తారు. కానీ మంచి ఉద్యోగం ఉన్నంత మాత్రాన ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోవు. జీవన వ్యయం, కుటుంబ బాధ్యతలు, జీతం వంటి అంశాలు కెరీర్ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. విజయం అంటే కేవలం ఉద్యోగ హోదా కాదు. మన అవసరాలను తీర్చుకుంటూ, కుటుంబాన్ని ఆదుకుంటూ సంతృప్తిగా జీవించడం కూడా విజయమే.
ప్రతి ఒక్కరి పరిస్థితులు, లక్ష్యాలు, విజయానికి సంబంధించిన నిర్వచనాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరికి ఉద్యోగ హోదా ముఖ్యం కాగా, మరికొందరికి కుటుంబాన్ని ఆదుకోవడం, మెరుగైన ఆదాయం సంపాదించడం ముఖ్యం.
Also Read: సెక్యూరిటీ గార్డ్ జాబ్ వదిలేసి చిన్న వ్యాపారం.. కట్ చేస్తే నెలకు రూ.50 లక్షల ఆదాయం