Nara Lokesh: రాష్ట్రంలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే జరిగిన పట్టణ, పరిషత్, మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏకపక్ష విజయాలు సాధించడంతో పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ కనిపిస్తోంది. ఇదే ఊపును రెండో దశలోనూ కొనసాగించాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి నుంచి పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు.
ప్రతి ఓటూ కీలకం.. బూత్ స్థాయిపై నజర్
ప్రస్తుతం ప్రజలంతా కూటమి పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నారన్నారు. అయితే దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలోనే అసలు విజయం ఉందని లోకేష్ నేతలకు గుర్తుచేశారు. రెండో దశ ఎన్నికలను ఎవరూ తేలికగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరూ సీరియస్‌గా పనిచేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎవరి పరిధిలోని బూత్‌లలో వారు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. పకడ్బందీ వ్యూహరచనతో ముందుకు వెళ్తూ.. ఓటర్లను ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాలకు మొబిలైజ్ చేయాలని ఆదేశించారు.
రెబల్స్ బుజ్జగింపు.. 100% ఓటు ట్రాన్స్‌ఫర్
ఎన్నికల్లో విజయానికి కూటమి పార్టీల మధ్య సమన్వయం చాలా అవసరమని లోకేష్ నొక్కి చెప్పారు. కూటమి బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఎక్కడైనా రెబల్స్ సమస్య ఉంటే.. స్థానిక నాయకత్వం వెంటనే వారితో మాట్లాడి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య వంద శాతం ఓటు ట్రాన్స్‌ఫర్ జరిగేలా కృషి చేస్తేనే భారీ మెజారిటీలు సాధ్యమవుతాయని వివరించారు.
పనిచేసే వారికి పదవుల భరోసా
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని ఎప్పటికీ మర్చిపోమని లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన నాయకులకు భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల భర్తీలో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. మొదటి దశ కంటే రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో మరింత అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు.
Also Read: అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు