Success Story| ఒకప్పుడు నెలకు రూ.1,200 జీతంతో లేబర్‌గా పనిచేసిన వ్యక్తి.. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్‌గా, హోటల్ ఉద్యోగిగా కూడా పనిచేశాడు దిగంత దాస్. జీవితంలో ఎదురైన కష్టాలు, తక్కువ జీతాలు, చివరకు జరిగిన ఘోర ప్రమాదం కూడా ఆయనను ఆపలేకపోయాయి. ఆ తరువాత తన అనుభవంతో వ్యాపారాన్ని ప్రారంభించి ఊహకందని విజయం సాధించాడు.
అసోంలోని బిశ్వనాథ్ జిల్లాలోని గోహ్‌పూర్‌కు చెందిన దిగంత దాస్ ఆర్థిక కష్టాల మధ్య బాల్యాన్ని గడిపాడు. 2001లో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత కుటుంబానికి సహాయం చేసేందుకు ఉద్యోగంలో చేరారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు నిర్మాణ కూలీగా పనిచేశాడు. అప్పట్లో ఆయనకు నెలకు సుమారు రూ.1,200 జీతం వచ్చేది. తర్వాత సిక్కింలో కూడా నిర్మాణ పనులు చేశాడు.
2011లో మంచి అవకాశాల కోసం దిగంత దాస్ బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ నెలకు సుమారు రూ.4,500 సంపాదించాడు. కొంతకాలం హోటల్‌లో రూమ్ సర్వీస్ ఉద్యోగం కూడా చేశారు. అయితే తక్కువ జీతం, పైగా జీతం ఆలస్యంగా రావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.
2012లో హోస్కోటేలోని ఐడీ ఫ్రెష్ ఫుడ్‌లో కుక్‌గా చేరడం ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. అక్కడ పెద్ద స్థాయిలో ఆహారాన్ని తయారు చేయడం, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం నేర్చుకున్నాడు. ముఖ్యంగా మలబార్ పరోటాను తయారు చేయడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు.
2017లో హై – వోల్టేజ్ విద్యుత్ తీగ ఆయనపై పడటంతో తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యారు. దాదాపు రెండేళ్లు కోలుకోవడానికి పట్టింది. అనంతరం ఓ స్నేహితుడు పరోటా తయారీ యూనిట్ ప్రారంభించే అవకాశం ఇచ్చారు.
2022లో దిగంత దాస్ అసోంలో డైలీ ఫ్రెష్ ఫుడ్ (DFF) ప్రారంభించారు. ఫ్రోజెన్ మలబార్ పరోటాలను తయారు చేసి సమీపంలోని దుకాణాలకు సరఫరా చేయడం మొదలుపెట్టారు. తన జీవిత పొదుపు మొత్తం రూ.7 లక్షలను వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. రుచి, నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
వ్యాపారానికి క్రమంగా మంచి స్పందన రావడంతో ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం రోజుకు 20,000కు పైగా పరోటాలు తయారు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆయన వ్యాపారం కూడా అసోంలో బాగా గుర్తింపు పొందిన ఫ్రోజెన్ ఫుడ్ బ్రాండ్‌గా ఎదిగింది.
Also Read: గోల్డ్ లోన్ చెల్లించినా మీ బంగారాన్ని బ్యాంక్ తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇది తెలుసుకోండి
నిర్మాణ కూలీ నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు ఎన్నో ఉద్యోగాలు చేసిన దిగంత దాస్, చివరకు తాను నేర్చుకున్న ఆహార తయారీ నైపుణ్యాన్నే వ్యాపారంగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు నెలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కష్టాల్లో సంపాదించిన అనుభవం, పొదుపు, సరైన అవకాశాన్ని ఉపయోగించుకోవడం తన జీవితాన్ని ఎలా మార్చగలదో ఆయన ప్రయాణం చూపిస్తుంది.