Delivery boy rape Attempt: దేశంలో రోజురోజుకు అత్యాచారాలు, దాడులు, హింసలు, వేధింపులు పెరిగిపోతున్నాయి. గృహ హింస, ఉద్యోగ స్థలంలో వేధింపులు, రోడ్డుపై పోకిరీల వేధింపులు ఒకటేమిటి అడుగడుగునా మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏకంగా సినిమా పరిశ్రమ, మహిళా అధికారులపై కూడా అత్యాచారాలు జరుగుతుంటే గుండె బద్దలువుతోంది. ఇటీవల బెంగాల్ వైద్య విద్యార్థిని దారుణంగా హత్యాచారం చేసిన ఘటన దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఎన్ని చట్టాలు చేసినప్పటికీ దాడులు ఆగడం లేదు. తాజాగా, నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వివాహితపై ఈ కామర్స్ డెలివరీ బాయ్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. వెంటనే ఆ మహిళ కేకలు వేయడంతో అక్కడినుంచి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ కాలనీకి చెందిన ఓ వివాహిత మూడు రోజుల క్రితం ఆన్‌లైన్‌లో వస్తువును ఆర్డర్ చేసుకుంది. ఈ వస్తువును ఆమె ఫ్లిప్ కార్టులో ఆర్డర్ చేసుకోగా.. మంగళవారం డెలివరీ అవతుందని మెసెజ్ వచ్చింది. అయితే ఈ వస్తువును ఇచ్చేందుకు సంబంధింత కంపెనీకి చెందిన డెలివరీ బాయ్ విఘ్నేశ్ మంజులాపూర్ కాలనీకి వచ్చాడు. ఆర్డర్ చేసిన ఇయర్ ఫోన్స్ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఆమె ఇంటికి వచ్చాడు. కాగా, అంతకుముందు వివాహిత భర్త ఉదయం 10 గంటలకు విధులకు వెళ్లడంతో ఇంట్లో ఆమె ఒక్కటే ఉంది.
ఈ తరుణంలో ఇంట్లో సదరు మహిళ ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన డెలివరీ బాయ్ విఘ్నేశ్ ఆమెతో మాట్లాడుతూ ఇంట్లోకి దూరాడు. వెంటనే ఆ వివాహితపై లైంగికదాడికి యత్నించాడు. బలవంతంగా అత్యాచారానికి పాల్పడుతుండగా.. భయపడిన ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో పాటు ఇరుగుపొరుగున ఉన్న వారిని పిలిచింది. దీంతో ఆ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని పారిపోతున్న విఘ్నేశ్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
Also Read: భార్య ఆస్పత్రి బిల్లు చెల్లించలేక.. కొడుకుని అమ్ముకున్న భర్త!
అయితే, 23 ఏళ్ల విఘ్నేశ్.. బైక్ పై పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు బాధితురాలి ఇంటికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు డెలివరీ సంస్థను ఆరా తీసి పట్టణానికి చెందిన విఘ్నేశ్ అని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు నిర్మల్ రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.