Health tips: శనగలు ఒక అద్భుతమైన, పోషక విలువలున్న ఆహారం. వాటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లతో పాటు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. కొన్ని రకాల అదనపు ఆహార పదార్థాలను వీటిలో చేర్చడం ద్వారా శనగల పోషక విలువలను మరింత పెంచుకోవచ్చు. దీనివల్ల రుచి కూడా పెరుగుతుంది. శనగల్లో ఎలాంటి పదార్థాలు కలిపితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి కూరగాయలు :
ఉల్లిపాయలు, టమాటోలు, కీర దోసకాయ, క్యారెట్లు, క్యాప్సికమ్ వంటివి చిన్నగా తరిగి శనగలలో కలపడం వల్ల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ శాతం పెరుగుతాయి. ఈ కూరగాయలు కలపడం వల్ల శనగలతో తయారు చేసిన చాట్ లేదా సలాడ్ మరింత రుచికరంగా, పోషకాలున్న ఆహారంగా మారుతుంది.
2. కరివేపాకు, కొత్తిమీర :
కొత్తిమీర, కరివేపాకు వంటివి శనగలకు అద్భుతమైన సువాసన, రుచిని అందిస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
3. పప్పులు, ఇతర గింజలు:
శనగలలో పెసర పప్పు, రాజ్మా, లేదా ఇతర పప్పులు కలిపి వండడం వల్ల ప్రోటీన్, ఫైబర్ శాతం పెరుగుతుంది. ఈ మిశ్రమం సంపూర్ణమైన మాంసకృత్తుల మూలంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది శాఖాహారులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది.
4. నిమ్మకాయ:
ఉడికించిన శనగలతో తయారు చేసిన చాట్ లో నిమ్మరసం పిండడం వల్ల రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, శనగల్లో ఉండే ఐరన్ ను శరీరం సులభంగా గ్రహించుకోవడానికి సహాయపడుతుంది.
Also Read: త్వరగా బరువు తగ్గాలంటే.. ఏ సీడ్స్ తినాలో తెలుసా ?
5. పెరుగు:
శనగ చాట్‌కు కొద్దిగా పెరుగు కలపడం వల్ల రుచి మరింత మెరుగుపడుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే.. పెరుగులో ఉండే ప్రోటీన్, కాల్షియం శనగల పోషక విలువలను మరింత పెంచుతాయి.
ఈ ఐదు పదార్థాలను శనగలకు చేర్చడం వల్ల అవి కేవలం రుచికరంగా మాత్రమే కాకుండా.. సంపూర్ణమైన , ఆరోగ్యకరమైన ఆహారంగా మారతాయి. మీ ఆహారంలో ఈ మార్పులు చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.