Bangkok Zoo Horror: బ్యాంకాక్‌లోని ఓపెన్ ఎయిర్ జూలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాలుగా సింహాల సంరక్షకుడిగా పనిచేస్తున్న జియన్ రంగ ఖరాసమీ అనే వ్యక్తి.. సింహాల దాడికి బలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జూ సిబ్బందిని, స్థానిక ప్రజలను షాక్‌కు గురి చేసింది.
మృతుడు జియన్ రంగ ఖరాసమీ వయస్సు 45 సంవత్సరాలు. గత 20 ఏళ్లుగా ఈ జూలో సింహాల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతనికి జంతువులపై అపారమైన ప్రేమ ఉండేది. జూకు వచ్చే సందర్శకులు తరచూ అతన్ని సింహాలతో ఆడుకుంటూ, వాటికి ఆహారం పెడుతూ చూసేవారు. అతనికి సింహాలపై విశేష అనుభవం ఉండటంతో సహచరులు కూడా అతన్ని ఆదర్శంగా భావించేవారు.
ఘటన జరిగిన రోజు ఉదయం జియన్ సింహాల కోసం ఆహారం సిద్ధం చేశాడు. ఆహారం ఇవ్వడానికి వాటి గదిలోకి వెళ్ళిన సమయంలో ఒక్కసారిగా రెండు సింహాలు అతనిపై దాడి చేశాయి. అతన్ని కింద పడేసి, బలంగా కొరికాయి. అతని కేకలు వినిపించడంతో వెంటనే ఇతర సిబ్బంది పరుగెత్తుకొచ్చారు.
సిబ్బంది వెంటనే వాహనాల హార్న్లు కొట్టారు, గట్టిగా కేకలు వేశారు. 15 నిమిషాలపాటు అలా ప్రయత్నించినా సింహాలు జియన్‌ను వదల్లేదు. చివరికి tranquilizer గన్ ఉపయోగించి సింహాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే జియన్ తీవ్రంగా గాయపడి, ఎక్కువ రక్తం కోల్పోయి మృతి చెందాడు.
ఈ ఘటనతో జూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. 20 ఏళ్లుగా సింహాలను పిల్లలుగా చూసుకున్న మనిషిని అవే సింహాలు పొట్టనబెట్టుకోవడం చాలా బాధాకరం అని సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు. జియన్ కుటుంబసభ్యులు కూడా కన్నీరు మున్నీరయ్యారు.
నిపుణుల ప్రకారం, సింహాలు వన్యమృగాలు కావడంతో.. వాటి ప్రవర్తన ఎప్పుడూ అంచనా వేయలేము. ఏళ్ల తరబడి చూసుకున్నా, పెంచినా, ఒక్కసారిగా వాటి స్వభావం మేల్కొని దాడి చేసే అవకాశముంది అని జంతుశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. జంతువుల ప్రవర్తనలో చిన్న మార్పు వచ్చినా దానిని గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బ్యాంకాక్ జూ అధికారులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ ఘటన జూకు వచ్చే సందర్శకుల్లో భయాన్ని కలిగించింది. సాధారణంగా సింహాల ఎన్‌క్లోజర్ వద్ద ఎక్కువమంది ఆకర్షితులు చేరుతుంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం ఖాళీగా కనిపిస్తోంది. మన కళ్లముందు జూకీపర్‌ను సింహాలు దాడి చేయడం చాలా భయంకరంగా ఉంది సందర్శకులు ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాంకాక్ జూలో జరిగిన ఈ దారుణం మరోసారి వన్యమృగాల.. అసలైన స్వభావాన్ని గుర్తు చేసింది. జంతువులను ఎంతగా పెంచినా, మానవత్వం చూపించినా, వాటి సహజ స్వభావం ఒక్కసారిగా విరుచుకుపడే ప్రమాదం ఉందని ఈ ఘటన తేటతెల్లం చేసింది.