Pod Taxi Service Coming To Mumbai: ప్రపంచ వ్యాప్తంగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో పాడ్ టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణీకులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ పాడ్ ట్యాక్సీలను వినియోగిస్తున్నారు. పాడ్ ట్యాక్సీ అనేది కారులా కనిపించే ట్యాక్సీ. ఇది డ్రైవర్ లేకుండానే స్టీల్ ట్రాక్ మీద నడుస్తుంది. మెట్రో రైల్ లాగే పాడ్ ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ట్రాక్ నిర్మిస్తారు. ఈ పాడ్ టాక్సీలన్నీ ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ వాహనాలు.
ఇప్పటికే నోయిడాలో ఈ తరహా పాడ్ టాక్సీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ముంబైలోనూ పాడ్ టాక్సీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ముందుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పరిధిలో ఈ పాడ్ టాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని షిండే ప్రభుత్వం భావిస్తోంది. ఈ నగరాల్లో వర్కవుట్ అయితే.. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కూడా ప్రారంభించాలనే యోచనలో ఆయా రాష్ట్రాలు ఉన్నాయి. ఇంతకీ.. ఏమిటీ పాడ్ ట్యాక్సీలు? ఇవి ఎలా పనిచేస్తాయ్?
పాడ్ ట్యాక్సీ అంటే?
పాడ్ ట్యాక్సీ అంటే కాలుష్య రహిత ఎలక్ట్రిక్ వాహనాలు. వీటిని నడిపేందుకు ప్రత్యేకంగా డ్రైవర్లు కూడా అవసరం లేదు. అత్యంత వేగంగా ఇవి గమ్యానికి చేరుస్తాయి. అయితే, వీటి సిటింగ్ కెపాసిటీ చాలా తక్కువ. ఒకేసారి నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణించవచ్చు. ఇప్పటికే సింగపూర్, లండన్, దుబాయ్‌లో ఇలాంటి పాడ్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఇదే మొదటి ప్రాజెక్ట్. ఉత్తరప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా నొయిడా సెక్టార్ 21 నుంచి జెవార్ ఎయిర్ పోర్ట్ వరకు సుమారు 12 నుంచి 14 కిమీల ట్రాక్ నిర్మాణం జరగనుంది. కొన్ని దేశాల్లో ఈ పాడ్ ట్యాక్సీలు సోలార్ పవర్‌తో కూడా నడుస్తున్నాయి.
Also Read: ఈ రూట్లలో నడిచే ‘వందే భారత్’కు ఇక 20 అదనపు కోచ్‌లు.. వెయిటింగ్ లొల్లి తీరినట్లే!
2026 నాటికి పూర్తి
ముంబైలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రయాణీకులకు బయటపడేయాలనే లక్ష్యంగా పాడ్ ట్యాక్సీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో ఈ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన.. త్వరలో ఆమోదముద్ర వేయబోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పాడ్ టాక్సీ ప్రాజెక్టుకు సంబంధించి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MMRDA) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.642 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు జరగుతున్నాయి. 2026 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని యోగీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నిర్మించేది మన హైదరాబాద్ సంస్థే..
ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ కు చెందిన సాయి గ్రీన్ మొబిలిటీ సంస్థకు అప్పగించింది. పాడ్ టాక్సీల రూపకల్పన, ఇంజినీరింగ్, డెవలప్ మెంట్, నిర్మాణం, టెస్టింగ్, నిర్వహణ బాధ్యతలన్నీ ఈ కంపెనీయే పర్యవేక్షించనుంది. ఫైనాన్స్ బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ ప్రాతిపదికన ఈ కంపెనీకి టెంటర్ అందించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ..1,016.34 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాలలో అందుబాటులోకి రానుంది.
ముంబైలో 9 కిలో మీటర్ల పరిధిలో పాడ్ టాక్సీ సేవలు
ముంబైలో సుమారు 9 కిలో మీటర్ల మేర ఈ పాడ్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మార్గంలో మొత్తం 38 హాల్ట్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. బాంద్రా, కుర్లా సబర్బన్ స్టేషన్లు, బుల్లెట్ రైలు స్టేషన్, బీకేసీ మెట్రో స్టేషన్లలో పాడ్ ట్యాక్సీలు కనెక్టివిటీని గణనీయంగా పెంచనున్నాయి. ఈ పాడ్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే ప్రతి నెల 6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా.