Lord Rama : ఆనాడు త్రేతాయుగం లో ముక్కోటి దేవతలు చూస్తుండగా రామయ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మిథిలానగరంలో. ఆ వివాహాన్ని కనులారా చూడలేని చంద్రుడు ఆ అదృష్టాన్ని తనకు ఎలాగైనా ప్రసాదించమని శ్రీరామచంద్రుని వేడుకున్నాడట. అసలే ఆపన్న శరణ్యుడు, భక్తమందారుడు. కాబట్టి రామయ్య చంద్రుని ప్రార్ధనకు కరిగిపోతాడు. నవమి వెళ్ళిన పున్నమి నాడు ఆరుబయట పెళ్లి చేసుకుంటానని, అంతేకాకుండా తన పేరు చివర్లో చంద్ర శబ్దాన్ని చేర్చుకుంటానని చంద్రుని ఓదార్చాడట. ఆనాటి నుండి శ్రీరాముడు శ్రీరామచంద్రుడయ్యాడు.
ఒంటిమిట్టలో నవమి కళ్యాణం పున్నమి కళ్యాణంగా మారింది. అక్కడ జరిగే శ్రీరామనవమి కళ్యాణం కూడ ప్రత్యేకమే. దేశమంతా సీతారాముల కళ్యాణాన్ని శ్రీరామనవమి రోజున జరుపుకుంటే ఇక్కడ మాత్రం నవమి వెళ్లిన పున్నమి నాటి రాత్రి ఆరుబయట ప్రత్యేకం గా నిర్మించిన మండపంలో జరుగుతుంది. చంద్రుడికి ఇచ్చిన వరం వల్లే ఇక్కడ ఈ రామయ్య వివాహాన్ని పౌర్ణమి నాడు నిర్వహిస్తున్నారు.
ఈ ఆలయం మూడు దశలలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. తొలి దశ లో గర్భాలయం, రెడవదశ లో ముఖమండపం , మలి దశ లో ప్రాకార , రాజగోపురాలు నిర్మించబడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఆలయ మంతా విజయనగర శిల్ప శైలి మురిపించి కనువిందు చేస్తుంది. గర్భాలయ నిర్మాణం చోళ సంప్రదాయం లో నిర్మించబడినట్లు చరిత్రకారులు చెపుతున్నారు. ఆలయ గాలిగోపురాలు , ముఖమండపం భాగవత ,రామాయణ కధా కథన శిల్పాలతో చూపరులను కట్టిపడేస్తాయి.ప్రతి శిల్పంలోను జీవకళ ఉట్టిపడుతుంది.