Genius Child Signs| పుట్టగానే ప్రతి బిడ్డ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటాడు. అయితే ఎంత త్వరగా నేర్చుకుంటాడనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా చదువులో పిల్లాడికి కష్టంగా అనిపిస్తే తల్లిదండ్రులకు అర్థమైపోతుంది. కానీ కొందరు పిల్లల్లో అసాధారణ తెలివితేటలు కలిగి ఉంటారు. వారిలో ఈ లక్షణాలను చాలా మంది తల్లిదండ్రులు గుర్తించరు.
ఈ జీనియస్ పిల్లలు ఎప్పుడూ స్కూల్ చదువులో అద్భుత మార్కులు చూపించకపోవచ్చు. కానీ వారి ఇతర మంచి లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించాలి. వారు ప్రతిభావంతులు కాగలరనే అంచనాలు వేయాలి. చిన్నప్పుడే వారిలో ప్రతిభను గుర్తిస్తే బిడ్డ భవిష్యత్తును మెరుగుపరచవచ్చు. తల్లిదండ్రులు సరైన అవకాశాలు ఇవ్వడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా పిల్లలు కొన్నిసార్లు అసాధారణంగా ప్రవర్తిస్తారు. దీంతో వారి తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక జీనియస్ పిల్లాడిలో ఉండే అయిదు అసాధారణ లక్షణాలను ఇప్పుడు చూద్దాం.
జీనియస్ పిల్లలు కొత్త విషయాలను ఇతరుల కంటే చాలా వేగంగా అర్థం చేసుకుంటారు. ఒక్కసారి చెబితే చాలు వారికి మళ్లీ చెప్పాల్సిన అవసరం ఉండదు. కొత్త నైపుణ్యాలు, కార్యకలాపాలు త్వరగా అలవర్చుకుంటారు. వారికి నేర్చుకోవడం సహజంగా, సులభంగా అనిపిస్తుంది. ఈ పిల్లల నేర్పరితనం, పనిచేసే వేగంతో పెద్దలు కూడా ఆశ్చర్యపరుస్తారు. చిన్న వయస్సులోనే వారి మానసిక అభివృద్ధి అత్యంత వేగంగా సాగుతుంది.
తెలివైన పిల్లలు చిన్నప్పుడే పుస్తకాలంటే మక్కువ చూపిస్తారు. ఎవరూ బలవంతం చేయకుండానే వారు స్వయంగా పుస్తకాలు ఎంచుకుంటారు. చదవడం వల్ల వారి పదజాలం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. కథలు, వాస్తవాలు, కొత్త సమాచారం తెలుసుకోవడానికి వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి పిల్లలు తరచూ ఎక్కువ పుస్తకాలు కావాలని అడుగుతారు. తమ సమాన వయస్కుల కంటే ముందుగా క్లిష్టమైన విషయాలను మంచిగా అర్థం చేసుకుంటారు. నిత్యం చదవడం వల్ల వారు మేధోపరంగా వేగంగా ఎదుగుతారు.
మంచి మేధశక్తి కలిగిన పిల్లలు ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తారు. పని పూర్తి చేసేవరకు ఇతర విషయాలపై దృష్టి మరల్చకుండా పూర్తి చేస్తారు. చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తారు. ఒక్కసారి విన్న విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటారు. సంభాషణలు, కార్యకలాపాల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ ఏకాగ్రత వల్ల వారు ఏ రంగంలోనైనా మెరుగ్గా పని చేస్తారు. పనిలో శ్రద్ధ అనేది మేధస్సు అభివృద్ధికి సంకేతం.
ఇాలాంటి పిల్లలో ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం కనిపిస్తుంది. రోజువారీ విషయాల గురించి కూడా చాలా ప్రశ్నలు అడుగుతారు. ఏదైనా ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని అర్థం చేసుకునేందుకు, తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉంటారు. వాళ్లు అడిగే ప్రశ్నలు పెద్దలను కూడా ఆశ్చర్యపరుస్తాయి. తమ వయస్సుకు మించిన ఆలోచనలను అన్వేషించడం ఇష్టపడతారు. ఈ ఉత్సుకత వల్ల ప్రతి రోజూ జ్ఞానం పొందుతారు. ఇది వారి బలమైన మేధస్సుకు స్పష్టమైన సంకేతం.
జీనియస్ పిల్లలు ఇతరులకంటే వేరుగా ఆలోచిస్తారు. కొత్త ఆలోచనలతో పరిష్కారాలను కనిపెడతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ ఇతరులపై ఆధారపడరు. తమ ఊహతో కొత్త వస్తువులను రూపొందించేందుకు ఇష్టపడతారు. వారి ఆలోచనల్లో విశిష్టత, ప్రత్యేకత ఉంటుంది. సమస్యలను తమ సొంత పద్ధతులతో పరిష్కరించడం వారికి సంతోషానిస్తుంది. సృజనాత్మకతో ఆలోచించడం అనేది వారి తెలివికి ముఖ్యమైన లక్షణం.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి
తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలి. వారి ఆసక్తులను, సహజ ప్రతిభను ప్రోత్సహించాలి. వారి ఉత్సుకతకు తగ్గ వనరులు అందించాలి. వారు ఇష్టపడని కార్యకలాపాల్లో బలవంతం చేయకూడదు. ఓర్పుతో, శ్రద్ధతో వారు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే వారికి సపోర్ట్ చేయాలి. మార్కుల కంటే నైపుణ్యాల అభివృద్ధిపై శ్రద్ధ వహించండి. పిల్లలు కొత్త విషయాలు స్వేచ్ఛగా అన్వేషించడానికి, నేర్చుకుంటూ పెరగడానికి తల్లిదండ్రులు అవకాశాలు ఇవ్వాలి.
ప్రతి బిడ్డకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. కొంతమంది పిల్లలు చిన్నప్పుడే వారి తెలివి తేటలను సంకేతాలు ప్రదర్శిస్తారు. ఈ సంకేతాలను తల్లిదండ్రులు గుర్తించడం పిల్లాడి జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల తెలివితేటలు, ప్రతిభను గుర్తించి మంచి భవిష్యత్తు వైపు మార్గనిర్దేశం చేయాలి. ఇలా చేయడం వల్ల వారిలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయవచ్చు. అలా చేస్తే జీవితంలో వారి విజయానికి ఇక ఆకాశమే హద్దు.
Also Read: తల్లిదండ్రులు మహాభారతం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు.. పిల్లలను ప్రయోజకులుగా చేయడానికి ఇవి చాలా అవసరం