Guava: జామపండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు. పోషకాల గని కూడా.. దీనిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకు ఒక జామపండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా చాలా వరకు పెరుగుతుంది. ఇంతకీ జామపండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. రోగనిరోధక శక్తి:
జామపండులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. సాధారణంగా నారింజ పండు కంటే జామపండులో నాలుగు రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. రోజువారీ ఒక జామపండు తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి సాధారణ అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయ పడుతుంది.
2. గుండె ఆరోగ్యాన్ని మెరుగుదల:
జామపండులో ఉండే పొటాషియం, కరిగే ఫైబర్ గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే.. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
3. జీర్ణక్రియకు మేలు:
జామ పండులో అధికంగా ఉండే ఆహార ఫైబర్ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది, ఆరోగ్యకరమైన పేగులలోని బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
4. మధుమేహ నియంత్రణ:
జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా విడుదల చేయడానికి సహాయ పడతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా మంచిది. జామ ఆకు జ్యూస్ కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ప్రభావ వంతంగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
5. క్యాన్సర్ నివారణకు సహాయం:
జామపండులో లైకోపీన్, క్వెర్సెటిన్ , విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ పడతాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలకు దోహద పడతాయి. ముఖ్యంగా.. గులాబీ రంగు జామలో ఉండే లైకోపీన్ ప్రోస్టేట్ , రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది.
6. కంటి చూపును మెరుగుదల:
జామలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. రోజువారీ జామ పండు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. అంతే కాకుండా రేచీకటి వంటి సమస్యలను నివారించవచ్చు. అంతే కాకుండా కంటి పొరల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Also Read: చలికాలంలోనూ డీహైడ్రేషన్.. మీలో ఎంతమందికి ఈ లక్షణాల గురించి తెలుసు ?
7. ఒత్తిడిని తగ్గిస్తుంది:
జామ పండులో ఉండే మెగ్నీషియం కండరాలను, నరాలను విశ్రాంతి పరుస్తుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. అంతేకాకుండా.. దీని లోని విటమిన్ బి3, విటమిన్ బి6 (పిరిడాక్సిన్) మెదడు రక్త ప్రసరణను మెరుగు పరిచి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతాయి.
8. చర్మ సౌందర్యం:
జామ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి కీలకం. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా జామపండు తినడం వల్ల ముడతలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.